రేషన్ బియ్యం.. బ్రాండెడ్ దందా
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:01 AM
దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తినడం లేదని చెప్పి.. ఖర్చు ఎక్కువైనా రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది.
లబ్ధిదారుల నుంచి కిలోకి రూ.15-18 చొప్పున కొనుగోలు
పాలిష్ చేసి బస్తాల్లో నింపి కిలో రూ.60 నుంచి రూ. 80 వరకు అమ్మకాలు
గ్రామాల్లో ఏజెంట్లను పెట్టి కొనుగోలు
పొరుగు రాష్ట్రాలకూ అక్రమ రవాణా
రెచ్చిపోతున్న దళారులు, రైసు మిల్లర్లు.. ఎఫ్‌సీఐ కోటా కిందా ఇవే బియ్యం
రూ.14 వేల కోట్లతో చేపట్టిన సంక్షేమ పథకం లక్ష్యానికి గండి
రేషన్ బియ్యం రుచిస్తోంది ఎవరికి? పేదలకు కొంతే కానీ అంతకుమించి దళారులకు, మిల్లర్లకు, వ్యాపారులకు! వీరంతా రేషన్ బియ్యాన్ని అడ్డికి పావుశేరు లెక్కన కొనేసి.. పాలిష్ చేసి.. అందంగా కనిపించే సంచుల్లో నింపేసి.. బ్రాండెడ్ లుక్ తీసుకొస్తున్నారు! ఆ బియ్యాన్నే మార్కెట్లో రెండింతల లాభానికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు! పేదల నుంచి రేషన్ బియ్యం కొనేందుకు ఊర్లలో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకోవడం కొసమెరుపు!!
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తినడం లేదని చెప్పి.. ఖర్చు ఎక్కువైనా రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది. అయినా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. సన్న బియ్యం సైతం పక్కదారి పడుతోంది. రైసు మిల్లర్లు, దళారులు, ట్రేడర్లు రంగంలోకి దిగి కిలోకి రూ.15-18 వరకు చెల్లించి సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. వాటిని రైస్ మిల్లులకు తరలించి పాలిష్ పట్టించి.. బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి, బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.60-80 వరకు విక్రయిస్తూ భారీగా ప్రయోజనం పొందుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఈ రేషన్ బియ్యం దొడ్డిదారిలో తరలివెళుతోంది.
రాష్ట్రంలో 1.06కోట్ల తెల్ల రేషన్ కార్డుల పరిధిలో 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ప్రతి నెలా 2.05 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ అవుతోంది. ఇందు కోసం ప్రభుత్వం ఏటా రూ.14వేల కోట్లను ఖర్చు చేస్తోంది. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తే లబ్ధిదారులు వాటిని తింటారని, అమ్ముకోవాల్సిన అవసరం ఉండదని ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి 2025 ఉగాదినాడు శ్రీకారం చుట్టింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. లబ్ధిదారుల్లో కొందరు ఈ బియ్యాన్ని పిండి వంటలకు, అల్పాహారాలకు వినియోగిస్తుండగా.. మరికొందరు దళారులకు అమ్ముకుంటున్నారు.
ధరల పెరుగుదలతో దొడ్డిదారి..
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిపోయాయి. ఆగస్ట్ చివర్లో కిలోకి రూ.45 స్థాయిలో ఉన్న సోనామసూరి బియ్యం ధర కాస్తా.. రూ.70-80కు చేరగా.. హెచ్‌ఎంటీ ధర అయితే కిలోకి రూ.65 నుంచి రూ.95కు చేరిందని వ్యాపారులు చెబుతున్నారు.. ఎల్‌నినో ప్రభావంతో వరి దిగుబడి తగ్గుతుందన్న అంచనాలు సైతం ధరలపై ఒత్తిడి పెంచాయి. ఈ పరిణామం దళారులు, మిల్లర్లకు కలసివస్తోంది. రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. మార్కెట్లో మంచి ధరపై విక్రయిస్తూ పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. బియ్యం కొనుగోళ్ల కోసం రైస్ మిల్లర్లు, ట్రేడర్లు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నారు.
ఆటోలు, చిన్న వాహనాల ద్వారా బియ్యాన్ని గోదాములకు తరలిస్తున్నారు. ఏజెంట్ల నుంచి మిల్లర్లు కిలోకి రూ.20-22 చొప్పున కొంటున్నారు. మిల్లుల్లో బియ్యాన్ని పాలిష్ పట్టి, నూకలు వేరు చేసి నాణ్యమైన బియ్యం మాదిరి ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం అని గుర్తు పట్టకుండా ఉండేందుకు ప్రైవేటు బ్రాండ్ల పేరుతో ఉన్న బ్యాగుల్లో ప్యాక్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు సైతం నేరుగా ఈ బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు, పాలిషింగ్, ప్యాకింగ్ కోసం కిలోకి రూ. 35 వరకు ఖర్చు అవుతుండగా.. స్థానిక మార్కెట్లో బ్రాండెడ్ బియ్యం పేరుతో రూ. 60-80 వరకు అమ్ముతున్నారు. గుజరాత్‌లో కిలోకు రూ. 53, మధ్యప్రదేశ్‌లో కిలోకు రూ. 54 చొప్పున ఈ రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా కిలోకు రూ. 18 -19 వరకు లబ్ధి పొందుతున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద వ్యవస్థ..
రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మంగళపల్లి, పటేల్‌గూడ, బొంగుళూరు, శంషాబాద్, శేరిగూడ, తక్కుగూడ, మహేశ్వరం, చేవెళ్ల, యాచారం, మంచాల, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరణ, మిల్లులకు తరలింపు, రీసైక్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మంగళపల్లిలోని న్యూ బన్సల్ రైస్‌మిల్లులో ఇటీవల 396 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా పద్మానగర్‌లోని హనుమాన్ ఇండస్ట్రీ్‌సలో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. పాలిషింగ్ చేసి, బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో ఈ ఏడాదిలో 8 వేల క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి, మెదక్, కోహిర్, వర్గల్ ప్రాంతాల్లో కూడా బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి కొల్లూరు మీదుగా గుజరాత్‌కు తరలిస్తుండగా... 335 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అలాగే, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని గోండియా పట్టణానికి 350 క్వింటాళ్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ నుంచి కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా వివిధ మార్గాల్లో బియ్యం తరలివెళుతున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు, జహీరాబాద్ ప్రాంతాల్లో రేషన్ బియ్యం నిల్వచేయటానికి ప్రత్యేకంగా గోదాములు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ఓడరేవు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుండగా అధికారులు గత ఏప్రిల్‌లో సీజ్ చేయడం గమనార్హం.
ఎఫ్‌సీఐకి కూడా ఇవే బియ్యం
కొందరు రైస్‌మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్ని పాలిషింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటుండగా... మరికొందరు మిల్లర్లు ఎఫ్‌సీఐ కోటాను ఈ బియ్యంతో భర్తీ చేస్తున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు, మేనేజర్లు రైస్ మిలర్లకు సహకరిస్తుండటంతో పేదల బియ్యం ఇలా పక్కదారి పడుతోంది. అంతిమంగా ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యాలకు తూట్లు పడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు
జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News