పంటల ధరలు పైపైకి
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:49 AM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల కరువు చాయలు పరుచుకుంటున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు తరలి వస్తున్న వివిధ పంటల ధరలు భగ్గుమంటున్నాయి.
మురిపిస్తున్న మక్కలు..
మిర్చి మరింత ‘ఘాటు’
ఎల్‌నినో ఎఫెక్ట్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల కరువు చాయలు పరుచుకుంటున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు తరలి వస్తున్న వివిధ పంటల ధరలు భగ్గుమంటున్నాయి. అరకొర దిగుబడి వస్తుందన్న అంచనాల మధ్య వ్యాపారులు సైతం అధిక ధర పెట్టి ఆయా పంటలను కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. వరి ధాన్యం ధర రోజురోజుకో సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నది. మక్కలు రైతును మురిపిస్తుండగా, మిర్చి ఘాటెక్కుతోంది. పసుపు, పత్తి, పల్లీలు అదే బాట పట్టాయి. వరంగల్ (ఎనుమాముల), మహబూబాబాద్ మార్కెట్లలో కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2,410ని దాటేసి మంగళవారం క్వింటాల్ మక్కలు రూ.3,085 పలికాయి. సిద్ధిపేటలో క్వింటాల్ ‘మక్క’లు రూ.2,900 పలికింది. ఖమ్మంలో సోమవారం రూ.2,600 పలకడం గమనార్హం.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వరికి బదులు ఆరుతడి పంట మక్క’లు అన్నదాతకు అండగా నిలిచింది. ఇక మరో జిల్లా కేంద్రం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా ఏసీ రకం మిర్చి క్వింటాల్‌పై మంగళవారం మరో రికార్డు నమోదు చేసింది. వ్యాపారులు జెండా పాటగా రూ.23,500లకు తేజా ఏసీ రకం మిర్చిని కొనుగోలు చేయగా, తేజా మిర్చి (నాన్ ఏసీ) రకం క్వింటాల్ ధర రూ.12 వేల నుంచి రూ.16,300 మధ్య కొన్నారు. సోమవారం తేజా ఏసీ రకం ధర రూ.23,150 కావడం గమనార్హం. కాగా, వరంగల్ (ఎనుమాముల)లో తేజా ఏసీ రకం క్వింటాల్ రూ.23,300 పలికితే వండర్‌హాట్ ఏసీ రకం రూ.31 వేలతో సరికొత్త రికార్డు నెలకొల్పగా, యూఎస్-341 రకం రూ.26,500లకు కొనుగోలు చేశారు.
ఇక వరంగల్ (ఎనుమాముల)లో క్వింటాల్ పసుపు (కాడి రకం) రూ.19,089, గోల రకం రూ.18,289 పలికాయి. పత్తి క్వింటాల్‌పై రూ.9,070, పల్లికాయ సూక రూ.8,800, పెసళ్లు రూ.6,952లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మహబూబాబాద్ మార్కెట్‌కు శివారులోని నేరడ రైతు భూక్యా లాలూ తీసుకొచ్చిన 6 బస్తాల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం క్వింటాల్ ధర రూ.5,510 పలికితే, జై శ్రీరాం ధాన్యం రూ.5,508, పత్తి క్వింటాల్‌పై రూ.9,138, నువ్వులు క్వింటాల్ రూ.12,100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక సూర్యాపేట జిల్లా తిరుమల గిరి వ్యవసాయ మార్కెట్ కొన్ని రోజులుగా ధాన్యం రాశులతో నిండిపోతోంది. మంగళవారం 699 మంది రైతులు 50,083 బస్తాల్లో 32,553 క్వింటాళ్ల ధాన్యం తీసుకొచ్చారు. ఎస్ఎం రకం ధాన్యం క్వింటాల్‌పై గరిష్ఠంగా రూ.3,377, కనిష్ఠంగా రూ.2,101 పలికితే, ఐఆర్-64 క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.2,174, కనిష్ఠ ధర రూ.1,870లకు కొన్నారు. ఇక సన్న రకం ధాన్యం మద్దతు ధర రూ.2,461గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు
జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్!
వ్యభిచారం చెయ్.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News