Share News

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:06 AM

గుర్తుందా? మునుపు రేషన్‌ పథకం కింద బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు, సబ్బుల వంటివి కూడా ఇచ్చేవారు! పేదల కోసం ఈ నిత్యావసరాల భరోసా పథకం మళ్లీ తెరమీదకు వస్తోంది.

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!
six essential commodities ration

  • బియ్యంతోపాటు కందిపప్పు, పామాయిల్‌, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండి

  • సంక్రాంతి నుంచి పథకం అమలుకు ప్రతిపాదనలు.. పరిశీలిస్తున్న సర్కారు

  • ధరల మంట, కరువు నుంచి పేదలను గట్టెక్కించడమే లక్ష్యం!

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గుర్తుందా? మునుపు రేషన్‌ పథకం కింద బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు, సబ్బుల వంటివి కూడా ఇచ్చేవారు! పేదల కోసం ఈ నిత్యావసరాల భరోసా పథకం మళ్లీ తెరమీదకు వస్తోంది. తాజాగా ధరలు మండిపోతుండటం, ఎల్‌నినో పరిస్థితులతో ముంచుకొస్తున్న కరువు నేపథ్యలో పేద ప్రజలకు రెగ్యులర్‌గా అందజేస్తున్న బియ్యంతో పాటు పలు రకాల నిత్యావసరాలనూ అందజేయాలన్న ప్రతిపాదనలను సర్కారు తీవ్రంగా పరిశీలిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేస్తే గనక బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయుల్‌, చింతపండు, కారంపొడి, చక్కెరను పంపిణీ చేయాలని సర్కారు ఇప్పటికే ఓ ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.


ప్రస్తుతానికి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్‌) లబ్ధిదారులకు బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. కుటుంబంలో తలా ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 2023లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బియ్యంతో పాటు ఇతర నిత్యవసరాలను కూడా పేదలకు అందజేస్తామని చెబుతోంది. తాజాగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్రంలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులున్నాయి. వీటి కింద 3.42 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.


వీరికి నెలకు 2.18 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆహార భద్రత పథకం కింద ఇతర నిత్యావసరాలను పంపిణీ చేయాల్సి వస్తే ఎన్ని రకాల వస్తువులను ఇవ్వాలి? ఎంత పరిమాణంలో ఇవ్వాలి? ఎంత కాలం పాటు ఇవ్వాలి? అందుకు బడ్జెట్‌ ఎంతవుతుంది? అనే అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బియ్యంతోపాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయుల్‌, చింతపండు, పంచదార, కారంపొడి పంపిణీచేయాలని ప్రాథమికంగా ఓ ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఈ నిల్వలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా? లేకపోతే ఎలా సేకరించాలి? అనే అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. యాసంగి సీజన్‌లో పంటలు సాగుచేయలేకపోతే ఇంకో రెండు నెలలు చూసి నిత్యావసర వస్తువుల పంపిణీ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ రకంగా వచ్చే సంక్రాంతికి ఈ పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బియ్యం.. బ్రాండెడ్‌ దందా

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 05:06 AM