Share News

విద్యకు అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:47 AM

ఆరు గ్యారంటీల అమలుతోపాటు విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. రెండున్నరేళ్లలో విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రభుత్వ పరంగా ప్రీ ప్రైమరీ సెక్షన్లను సైతం ప్రారంభించామని చెప్పారు.

విద్యకు అత్యంత ప్రాధాన్యం
Sridhar Babu

  • రెండున్నరేళ్లలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం

  • టీహబ్‌ తరహాలో కే-హబ్‌..

  • అన్ని వర్సిటీల్లో ఇంక్యుబేషన్‌ హబ్‌లు

  • బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి: దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీల అమలుతోపాటు విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. రెండున్నరేళ్లలో విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రభుత్వ పరంగా ప్రీ ప్రైమరీ సెక్షన్లను సైతం ప్రారంభించామని చెప్పారు. శాసనసభలో విద్యావ్యవస్థలో సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్‌, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతను ‘రెడీ టు వర్క్‌ ఫోర్స్‌’గా తీర్చిదిద్దేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ప్రారంభించినట్లు తెలిపారు.


విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించేలా ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ కన్సార్టియం సహకారంతో దేశంలోనే తొలిసారిగా డిగ్రీ, ఇంజనీరింగ్‌లో బీఎ్‌ఫఎ్‌సఐ కోర్సులను ప్రారంభించామన్నారు. బాలికల విద్యపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మంత్రి చెప్పారు. రూ.500 కోట్లతో 93 కేజీబీవీలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీని ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ’గా మార్చామని, ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.


టీసీఎస్‌ సహకారంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ ట్రేడ్‌ సెంటర్లుగా అభివృద్ధి చేశామని తెలిపారు. క్రీడలకూ పెద్దపీట వేస్తూ యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ప్రారంభించామని అన్నారు. టీహబ్‌ తరహాలో వరంగల్‌లో ఇంక్యుబేషన్‌ హబ్‌ (కే-హబ్‌) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లోనూ వీటి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.


జీవో 97 వెనక్కి తీసుకోవాలి: ఏలేటి

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు కూడా అదే బాటలో నడుస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, పాము కాట్లు, పురుగుల అన్నం, ఫుడ్‌పాయిజన్‌లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జీవో 97తో పాలిటెక్నిక్‌ విద్యార్థులు రోడ్డెక్కారని, చదువుకునే వయసులో పోలీసుల లాఠీచార్జికి గురవుతున్నారని అన్నారు. ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, ప్రభుత్వం సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు కాలేజీలు మూతపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. ప్రైవేటు కాలేజీలు బతికి ఉంటేనే అందరికీ విద్య అందుతుందని, బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.


ప్రభుత్వ అధీనంలోనే పాలిటెక్నిక్‌: వివేక్‌

పాలిటెక్నిక్‌ విద్యను ప్రైవేటుపరం చేస్తారనే వదంతులు నమ్మొద్దని, అది ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని మంత్రి జి.వివేక్‌ అన్నారు. అందులోనే మరిన్ని అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పీఎం సేతు స్కీమ్‌ కింద దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒకటే క్లస్టర్‌ వస్తే.. తెలంగాణకు మాత్రం 4 క్లస్టర్‌లు వచ్చాయని, సీఎం చొరవ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులకు ఇక ముందు కూడా ఏఐసీటీఈ సర్టిఫికెట్‌, ఈసెట్‌ పరీక్ష, దాంతోపాటు లేటరల్‌ ఇంజనీరింగ్‌ ఎంట్రీకి కూడా అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఫీజు స్ట్రక్చర్‌ కూడా ఏమీ పెరగదన్నారు. జీవో 97లో ఇంకా మార్పులు అవసరం ఉంటే కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. ఓవైపు ఏటీసీల నిర్మాణాలకు తాము 282 ఎకరాల భూములను కొత్తగా ఇస్తుంటే.. బీఆర్‌ఎస్‌ మాత్రం పాలిటెక్నిక్‌ భూములు అమ్మడానికే ఇదంతా చేస్తున్నామంటూ ఆరోపిస్తోందని మండిపడ్డారు.


విద్య విషయంలో బెస్ట్‌ సీఎం రేవంత్‌: కూనంనేని

విద్యారంగం విషయంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే మన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ‘ది బెస్ట్‌’గా ఉన్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యారంగంపై లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ, ‘‘సీఎం రఫ్‌గా ఉంటే చదువురాదని కొందరు అంటున్నారు. అది సరైంది కాదు. మన సీఎం హిందీ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. పార్లమెంటులోనూ అనర్గళంగా మాట్లాడారు. పట్టుదల, ధ్యేయం, దీక్ష ఉండటంతోనే విద్యాశాఖను సీఎం తన వద్ద పెట్టుకున్నారు.


విద్యా రంగం విషయంలో ప్రభుత్వం పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తోంది. సీఎ్‌సఆర్‌ నిధుల్ని సమీకరించి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. విషయం తెలియనివారు ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారనడం సరైంది కాదు. ఒక్కడే, ఒక్కసారే మార్పు తేవడం సాధ్యం కాదు. మార్పు కోసం సీఎం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. టీ హబ్‌ అనుబంధంగా ఏఐ, ఇతర స్కీంలు తెచ్చినందుకు సీఎంకు అభినందనలు’’ అని కూనంనేని అన్నారు. గ్రామ స్థాయి పాఠశాలల్లో సీబీఎ్‌సఈ విధానం తీసుకురావాలని, పేద విద్యార్థుల ఇంటి గుమ్మం వద్దకు నాణ్యమైన చదువు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టణ స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్‌ మెంబర్లుగా ట్రాన్స్‌జెండర్లు
సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 05:47 AM