ఓ వీరప్పన్.. ఓ రేవంత్!
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:37 AM
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అటవీశాఖ మంత్రి అయితే పరిస్థితి ఎలా ఉండేదో భూ దందాలు చేసే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో అలాంటి పరిస్థితే నెలకొందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
వీరప్పన్ అటవీశాఖ మంత్రి అయితే ఎలా ఉండేదో
భూ దందాల రేవంత్ సీఎం అవడంతో అలాగే ఉంది
కనీవినీ ఎరుగని స్థాయిలో రాష్ట్రంలో భూ దోపిడీ
హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలపై రేవంత్ కన్ను
మంత్రులు కాదు.. అలీబాబా, 40 దొంగలు
నిషేధిత జాబితాలో భూములు పెట్టిన కాంగ్రె్‌సను
ప్రజలు నిషేధించాలి: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అటవీశాఖ మంత్రి అయితే పరిస్థితి ఎలా ఉండేదో భూ దందాలు చేసే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో అలాంటి పరిస్థితే నెలకొందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో సెక్షన్ 22ఏ భూ బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నేరపూరిత మనస్తత్వంతో ఒక ముఠాను ఏర్పాటు చేశారని, ఆ ముఠా కనుసన్నల్లోనే 22ఏ దందా నడుస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి బతికేవారని ఆరోపించారు.
భూములను కాపాడాల్సిన కాపలాదారులే కబ్జాదారులుగా మారారని, దేశచరిత్రలో కనీవినీ ఎరుగని భూ దోపిడీ ఇక్కడే జరుగుతోందన్నారు. ఈ వ్యవహారాలపై రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. ప్రతి స్కీం వెనుక ఒక స్కామ్ ఉంటుందని, గుడి, బడి, ఆస్పత్రి, స్మశానం నిర్మించాలంటే ప్రభుత్వం దగ్గర గజం భూమిలేదని, కానీ హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములపై సీఎం కన్ను పడిందన్నారు. అస్మదీయుల కోసం హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని, పది వేల ఎకరాలను కాజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అడ్డికి పావుశేరు లెక్కన భూములను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. మూసీ పేరుతో వేల ఎకరాలు మింగే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఫార్మాసిటీని రద్దుచేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా చేస్తున్నార ని, రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టారని విమర్శించారు.
22ఏను అడ్డుపెట్టుకొని కోటి 16లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని, భూ బకాసుర బ్రదర్స్ కన్ను భూములపై పడిందని, ‘మంత్రులు కాదు.. అలీబాబా 40 దొంగలు’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. మంచిరేవుల భూ కుంభకోణం బయటపడ్డాక ఒక మంత్రి బర్తరఫ్ అయ్యారని, మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య పర్సంటేజీల యుద్థం జరుగుతోందని ఆరోపించారు. ఇది ‘30శాతం కమీషన్ల సర్కారు’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ భూముల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలుండేవని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు, తాగునీటి సమస్యలను పరిష్కరించారని చెప్పారు.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ఒకే రోజులో జీవోలు ఇచ్చారని తెలిపారు. అప్పట్లో ఎకరం రూ.5 లక్షలుగా ఉన్న భూమి విలువ రూ.50 లక్షలకు పెరిగిందన్నారు. భూమి సురక్షితమైన పెట్టుబడి అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని, అలాంటి పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా మార్చేస్తోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ బకాసురలదే రాజ్యమని,‘ భూమి కనబడితే బుక్క పెట్టు.. జాగా కనబడితే పాగా వెయ్’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆరోపించారు. ‘గాంధీల సామంతుల పాలనలో గజానికో గజదొంగ.. గుంటకో గుంటనక్క’ అన్నట్లుగా వ్యవహారం సాగుతోందని వ్యాఖ్యానించారు నిషేధిత జాబితాలో ప్రజల భూములను పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిషేధించాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దొంగ దొరికాడు
సురేఖనెందుకు తొలగించారు!?
Read Latest AP News And Telangana News And International News And Telugu News