సురేఖనెందుకు తొలగించారు!?
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:09 AM
బీసీ కులగణన అంశంపై అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య జరిగిన ఆసక్తికర చర్చలో సంవాదమిది! కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న రెండో దశ జనగణనకు 40 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీ అంశాన్ని చేర్చాలనే డిమాండ్‌తో స్వల్పకాలిక చర్చ పెట్టారు.
మీరు సంజయ్‌ను తీసేశారేం!?
బీసీ కులగణనపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ వాగ్వాదం
జనగణనలో బీసీ/ఓబీసీ క్యాటగిరీ చేర్చాలని అసెంబ్లీ తీర్మానం
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను ఎందుకు తొలగించారు!?
పార్టీ అధ్యక్ష పదవి నుంచి మీరు బండి సంజయ్‌ను ఎందుకు తీసేశారు!?
.. బీసీ కులగణన అంశంపై అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య జరిగిన ఆసక్తికర చర్చలో సంవాదమిది! కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న రెండో దశ జనగణనకు 40 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీ అంశాన్ని చేర్చాలనే డిమాండ్‌తో స్వల్పకాలిక చర్చ పెట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీలను చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు వాగ్వాదం జరిగింది.
తొలుత మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ‘‘కుల ఆధారిత జనగణన అవసరాన్ని అందరూ గుర్తించాలి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీల వాస్తవ పరిస్థితిని గుర్తించాం. కేంద్రం గతంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఓపెన్ కాలమ్ విధానం పెట్టింది. దాంతో ఓబీసీ గణాంకాలు సేకరించటం కష్టమైంది. అందుకే, ఈసారి జనగణనలో ఎస్టీ, ఎస్సీల మాదిరిగా ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలి. కచ్చితమైన కుల గణాంకాల ఆధారంగా సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని కోరారు.
బీజేపీఎల్పీ ఉప నాయకుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని జనగణన చేయిస్తున్నారని, దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో జరగలేదని ఆరోపించారు. 60 శాతానికిపైగా ఉన్న బీసీ జనాభా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. దీంతో, డిప్యూటీ సీఎం భట్టి లేచి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆ మాట మాట్లాడుతున్నారా? అసెంబ్లీలో ఉండి అలా మాట్లాడితే ఎలా? దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఏ రాష్ట్రంలో కులగణన చేయలేదు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జనగణనలో కుల గణన పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. బీసీల లెక్క తేల్చాల్సిందేనని, జన గణనలో బీసీ/ఓబీసీ కాలమ్ చేర్చాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం ఎవరేం చేశారన్న అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘బీజేపీలో మనువాదం నడుస్తోంది. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. చివరకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవిని కూడా బీసీకి ఇవ్వలేదు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ కనీసం సభలో కూడా లేరు’’ అని తప్పుబట్టారు.
ఈలోగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభలోకి వచ్చారు. వచ్చీ రాగానే మైక్ తీసుకొని.. బీసీ మహిళ కొండా సురేఖ మంత్రి పదవిలో ఉంటే చూడలేక బర్తరఫ్ చేశారని, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. వెంటనే పొన్నం జోక్యం చేసుకొని ‘‘మరి మీరు బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెబుతారా?’’ అని పొన్నం నిలదీశారు. పాయల్ శంకర్‌కు ఇచ్చిన సమయంలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండడంతో.. ‘‘బీసీ నేతను కనీసం మాట్లాడనీయరా? పాయల్ శంకర్.. భయపడుతున్నావా?’’ అంటూ కాంగ్రెస్ సభ్యులు కామెంట్లు చేశారు. రాష్ట్రంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి:
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News