Share News

కమీషన్లు నాకెందుకు!?

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:49 AM

‘‘నేను కమీషన్లు తీసుకుంటున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ అవసరం నాకేంటి!? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కేవలం 17.5 ఏళ్లలోనే జడ్పీటీసీ నుంచి సీఎం దాకా అన్ని పదవులూ వచ్చాయి. కోట్ల మందిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఇచ్చాడు. విద్య, వ్యాపారం.. పెళ్లి, పిల్లలను ఇచ్చాడు. ఇంకా నాకు కక్కుర్తి ఎందుకు ఉంటుంది?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

కమీషన్లు నాకెందుకు!?
Revanth Reddy

  • దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు.. ఇంకా కక్కుర్తి ఎందుకు!?

  • డబ్బులు కావాలనుకుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో

  • వేల కోట్లు సంపాదించేవాడ్ని.. కక్కుర్తిపడే జాతకం కాదు నాది

  • జెన్‌జీ గురించి కాదు.. ఆల్ఫా, బీటాల గురించి ఆలోచిస్తున్నా

  • పేదలకు న్యాయం జరగాలనే విద్య, న్యాయ శాఖలు తీసుకున్నా

  • చట్టాన్ని కేంద్రం ఆమోదించగానే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ

  • స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై అధ్యయనానికి విదేశాలకు ఎమ్మెల్యేలు

  • కేటీఆర్‌ను చూసి అసహ్యించుకునేవాళ్లే, అసూయ పడేవాళ్లు లేరు

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాపం నాది కాదు.. కేసీఆర్‌ సర్కారుది

  • కాలేజీలపై దాడులు చేసి మరీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, సన్నిహితుల కాలేజీలకే నిధులిచ్చింది

  • పాలమ్మితే, పూలమ్మితే వందల కోట్లు వస్తాయా!?:

  • అసెంబ్లీలో విద్యా విధానంపై లఘు చర్చలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను కమీషన్లు తీసుకుంటున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ అవసరం నాకేంటి!? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కేవలం 17.5 ఏళ్లలోనే జడ్పీటీసీ నుంచి సీఎం దాకా అన్ని పదవులూ వచ్చాయి. కోట్ల మందిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఇచ్చాడు. విద్య, వ్యాపారం.. పెళ్లి, పిల్లలను ఇచ్చాడు. ఇంకా నాకు కక్కుర్తి ఎందుకు ఉంటుంది?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. తన బంధువులే జాతీయ నాయకత్వ స్థాయి వరకూ వెళ్లినా సీఎం కాలేకపోయారని, దేవుడు తనకు ఆ అవకాశం ఇచ్చాడని చెప్పారు. ‘తెలంగాణ విద్యా విధానం’పై శుక్రవారం శాసన సభలో జరిగిన లఘు చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


‘‘నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఈపాటికి వేల కోట్లు సంపాదించి ఉండేవాడిని. పుప్పాలగూడ, మంచిరేవులలో నేను ఎకరాల్లో రియల్‌ వ్యాపారం చేస్తున్నప్పుడు మైహోం వంటి వాళ్లు హైదరాబాద్‌లో గజాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. నాతో చదువుకున్నవారు ఇప్పుడు అమెరికాలో బిలియనీర్లుగా ఉన్నారు. నేనూ వాళ్లతో వెళ్లి ఉంటే సంపాదించుకుని ఉండేవాడిని. కానీ, అవేవీ మానసిక సంతోషాన్ని ఇవ్వవనే నేను ప్రజా జీవితంలోకి వచ్చాను. కేసీఆర్‌ కుటుంబంలా కక్కుర్తి పడే జాతకం నాది కాదు. నాతో ఉన్నవారికి సహాయం చేసే జాతకం నాది’’ అని వ్యాఖ్యానించారు. తనకు ఏమీ పైశాచిక కోరికలు ఉండవని, తాను ఇంటికి వెళ్లగానే రెండు నిమిషాల్లో నిద్ర పడుతుందని అన్నారు.


ప్రస్తుతం జెన్‌జీ గురించి చర్చలు జరుగుతున్నాయని, కానీ తాను జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటాలకూ ఉపయోగపడే విద్యా విధానం గురించి ఆలోచన చేస్తున్నానని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. తలరాతని మార్చేది విద్య ఒక్కటేనని సంపూర్ణంగా విశ్వసించి.. ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ‘‘రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. ఈ విధానాన్ని కేంద్రం అడాప్ట్‌ చేసుకుని పీఎం సేత్‌ కార్యక్రమం చేపట్టింది. దాని కింద నాలుగు క్లస్టర్లనూ తెలంగాణకు తెచ్చుకున్నాం. కేంద్రం సహకరిస్తే అభినందనలు చెబుతూనే ఉంటాం. అలాగే, మా ప్రభుత్వం మంచి పనులు చేసినప్పుడు మాకూ అభినందనలు తెలపాలి’’ అని వ్యాఖ్యానించారు.


విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండాలని, కానీ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 17 మందికి ఒకరు ఉన్నారని, అందుకే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది వేల మంది టీచర్లను రిక్రూట్‌ చేసినట్లు చెప్పారు. బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యకు బడ్జెట్లో 6.53 శాతం కేటాయింపులుంటే.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.53 శాతానికి పెంచానని, మూలధన పెట్టుబడిని కూడా కలిపితే ఇది 18 శాతం దాకా ఉంటుందని వివరించారు.


విద్యా శాఖ అంటే నాకు ప్యాషన్‌

విద్యా శాఖ అంటే తనకు ప్యాషన్‌ అని, అందుకే, ఆ శాఖను తన దగ్గర ఉంచుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘‘విద్యా శాఖకు పూర్తిస్థాయి మంత్రి లేడని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అంటున్నారు. ఆ శాఖను సీఎం నిర్వహిస్తున్నాడంటేనే.. అన్నింటి కంటే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు. విద్యా శాఖ మంత్రి సమీక్ష చేస్తే ఆ శాఖ అధికారులు మాత్రమే వస్తరు. అదే ఒక సీఎం సమీక్ష చేస్తే.. మొత్తం సిస్టమే వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఈ చిన్న తేడాను కూడా సభ్యులు గుర్తించట్లేదు’’ అని వివరించారు.


పేదలకు న్యాయం జరగాలనే తాను విద్య, న్యాయ శాఖలను ఇష్టపడి తీసుకున్నానని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ విద్యను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని, రెండేళ్లలో కొంత మెరుగుపడిందని, పట్టాలిక్కించిన తర్వాత పరుగులు పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం వల్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరిక తగ్గుతోందని, అందుకే 4,100 స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం ఆ స్కూళ్లలో 64 వేల మంది ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారన్నారు.


ఆస్తులున్నవాళ్లు వెనకబడ్డారు

‘‘విద్య ఒక్కటే జీవితాల్లో మార్పు, వెలుగు తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024లో ‘సీపెక్‌’ సర్వే చేసింది. వివిధ కులాలు, ఉప కులాల ఆర్థిక, విద్య, సామాజిక, వెనుకబాటుకు సంబంధించి దీనిని చేశాం. ఇందులో ఓ కొత్త అంశం మా దృష్టికి వచ్చింది. సామాజిక వెనుకబాటుకు ఆస్తులు, అంతస్తులు కారణం కాదు. ఆస్తులున్న వారు సామాజిక వెనుకబాటుకు లోనయ్యారు. ఒక్క గుంట భూమి, ఎకరం వ్యవసాయ భూమి, సొంత ఇల్లు లేనివారు సామాజికంగా అగ్ర భాగాన ఉన్నట్లు తేలింది. దీనికి విద్య కారణమని తెలిసింది. దళితులు, ఆదివాసీల నుంచి వచ్చినవారు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎ్‌సలుగా రాణించి సామాజికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇలాంటి వాళ్లకు సొంతంగా ఆస్తులేమీ లేవు. చదువుకోవడం వల్ల సామాజికంగా గౌరవం పొందుతున్నారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు.


అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో కురుమ సోదరులకు ఎకరాలకొద్దీ భూమి, వందలకొద్దీ గొర్రెలు, మేకలు, ఇంట్లో బంగారం అన్నీ ఉంటాయని, కానీ, పిల్లలను పెద్దగా చదివించకపోవడం వల్ల సామాజికంగా సమాజంతో కనెక్షన్‌ తెగిపోయిందని, వారు సామాజికంగా వెనుకబడినట్లు సర్వేలో తేలిందని వివరించారు. అందుకే, ‘‘చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. దేశంలో క్లోజ్డ్‌ ఎకానమీ ఉన్నప్పుడు, సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లో లేనప్పుడు మన చదువు, మన ఉద్యోగం... ఊరు, సమితి, నియోజకవర్గం, జిల్లా, జోనల్‌ వ్యవస్థను దాటలేదు. కానీ, ఇప్పుడు ఓపెన్‌ ఎకానమీ! లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ విధానాలను పీవీ నర్సింహా రావు ప్రవేశపెట్టిన తర్వాత ప్రపంచ విద్యా విధానం అంతా మనకు అందుబాటులోకి వచ్చింది.


ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అన్ని వ్యవస్థలు మారిపోయాయి. అందుకే, తెలంగాణ విద్యా విధానంలోని లోటుపాట్లను సవరించడానికి మొట్టమొదటిసారి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ఆ కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఇందులో కొన్ని అభ్యంతరాలుంటే... కె.కేశవరావు ఆధ్వర్యంలో మరో కమిటీని వేశాం. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, శాంతా సిన్హాలను సభ్యులుగా నియమించాం. తెలంగాణలో మంచి విద్యా విధానాన్ని అమలు చేసుకోవడానికి మేధావులు, నిపుణులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి’’ అని కోరారు. విద్యా విధానంపై చర్చ సందర్భంగా సభ్యులు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.


మోడల్‌ స్కూళ్లకు మోదీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు

మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తీసుకు వచ్చిన మోడల్‌ స్కూళ్లకు మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్‌ తప్పుబట్టారు. 2014 నుంచి ఈ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి గత ప్రభుత్వం చట్టాన్ని సవరించిందని, ఆమోదం కోసం దానిని కేంద్రానికి పంపితే.. రెండేళ్లపాటు పెండింగ్‌లో పెట్టిందని గుర్తు చేశారు. ఇటీవలే కొన్ని క్లారిఫికేషన్స్‌ అడిగితే పంపించామని, ఆ చట్టం ఆమోదం పొందగానే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.


రాష్ట్రంలో అధికారంలోకి రావడంతోనే అన్ని వర్సిటీలకు వీసీలను నియమించామని, ఇప్పుడవి అద్భుతంగా పని చేస్తూ ర్యాంకింగ్‌నూ పెంచుకున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అదనంగా 87 వేలు పెరిగిందని, హాజరు శాతాన్ని 74 శాతానికి పెంచామని చెప్పారు. ఆలిండియా పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో గతంలో 31వ స్థానంలో ఉన్న ప్రభుత్వ విద్యను 18వ స్థానానికి తెచ్చామన్నారు. అలాగే ఆలిండియా నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో గతంలో 36వ స్థానంలో ఉండగా.. దాన్ని 26వ స్థానానికి తెచ్చినట్లు చెప్పారు.


687 కోట్ల టెండర్లో 2 వేల కోట్ల అవినీతా!?

‘‘విద్యార్థులకు 9 రకాల వస్తువులతో స్కూల్‌ కిట్‌ను ఇస్తున్నాం. అందులో మఫత్‌లాల్‌ కంపెనీ దుస్తులతో యూనిఫాంలూ ఉన్నాయి. ఇందులో కూడా రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అసలు దీనికి సంబంధించిన టెండరే రూ.687 కోట్లు. అందులో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది!?’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. పేదవాడి ఆకలి తీర్చడం తన బాధ్యతగా భావించి నర్సరీ నుంచి 12 తరగతి వరకు విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం మెనూలో గుడ్డు, చికెన్‌, మటన్‌, రాగి వంటి జావలు అందిస్తున్నామని, సెంట్రల్‌ కిచన్‌ను డిజైన్‌ కూడా చేశామని చెప్పారు.


స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై అధ్యయనం చేయడానికి ఎమ్మెల్యేలను చైనా, జపాన్‌, జర్మనీ, సౌత్‌ కొరియా దేశాలకు పంపుతానని హామీ ఇచ్చారు. ఈ బాధ్యతను మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్మనీ, జపాన్‌, ఫిలిప్పీన్‌ లాంటి దేశాల్లో విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు 500 మంది టీచర్లను పంపామన్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో ఉన్నవారినే ఆ దేశం వెనక్కు పంపుతోందని, వచ్చే ఐదేళ్లలో వచ్చే పది లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఎక్కడికి పోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందుకే, స్కిల్‌ వర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.


నీకేం తెలుసు.. ఇక్కడి విద్య గురించి?

‘‘ఇక్కడ పెరిగినోడివి.. ఇక్కడ చదవుకున్నోడివి.. పిల్లల్ని ఇక్కడ చదివించినోడివీ కాదు. ఇక్కడి సమాజం గురించి నీకేం తెలుసు’’ అంటూ కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పేద ప్రజల మధ్య పెరిగిన తనకు తెలుసునన్నారు. తాను ఆదివాసీలు, దళితులు, గిరిజనుల మధ్య పెరిగానని, ఊళ్లో పొద్దున లేస్తే మాదిగల పిల్లలతో ఆడుకునేవాడినని, వడ్డెర, చాకలి తదితర కులాల పిల్లలతో కలిసి పెరిగానని చెప్పారు. అహకారం, అంటరానితనంతో పసుపు నీళ్లతో కడగడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తాను పేదోడిని కాకపోవచ్చు కానీ.. పేదరికం తెలియని వాడిని కాదన్నారు. కేటీఆర్‌ పేదరికాన్ని చూడాలంటే బెంజ్‌ కార్లో వెళ్లి చూడాలని, అది ఆయనకు ఎక్స్‌కర్షన్‌ వంటిదని ఎద్దేవా చేశారు. పేదల మధ్య పెరిగి వచ్చిన తనకున్న మానవ సంబంధాలు కేటీఆర్‌కు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. కేటీఆర్‌ను చూసి అసహ్యించుకునే వారే తప్ప అసూయ పడేవారు ఎవరూ లేరన్నారు. ‘‘విద్యార్థులను గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు చేయాలని గత ప్రభుత్వం పనిచేసింది. వాళ్లదే గంజాయి దందా.. వాళ్లదే కోకైన్‌ దందా.. వాళ్లవే పబ్బులు, వాళ్లవే బార్లు. రాత్రయితే బార్లు, పొద్దునైతే దర్బార్లు. ఈ సంస్కృతి నుంచి బయటకి తేవాలన్నదే మా లక్ష్యం’’ అని వివరించారు.


ఒక్క పాఠశాల కూడా మూసివేయం

రాష్ట్రంలో ప్రభుత్వ బడులు మూసివేస్తామన్న ప్రచారం అవాస్తవమని, ఒక్క పాఠశాల కూడా మూసివేయబోమని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించాలనే నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నామని, తాను చేసింది మంచో చెడో 2029 ఎన్నికల్లో నిర్ణయించాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్యపై రాజకీయాల్లో పావులుగా మారకండని యువతను కోరారు.


పదేళ్లూ ఒక్క ధర్నా చేయని కాలేజీలు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను గత ప్రభుత్వం పదేళ్లుగా ఇవ్వలేదని, అయినా పదేళ్లపాటు గప్‌చు్‌పగా ఉన్న కాలేజీలు.. ఇప్పుడు తన ప్రభుత్వం రాగానే ఎందుకు ఉద్యమిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపేదని, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదన్న ధీమానా..? అని కాలేజీలు యాజమాన్యాలను ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల పాపం తనది కాదని, గత కేసీఆర్‌ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2025-26 వరకు రూ.1465 కోట్లు, ఈ విద్యా సంవత్సరంలో రూ.976 కోట్ల డిమాండ్‌ వస్తే దానిలో రూ.612 కోట్లు కట్టేశామని తెలిపారు.


ఇప్పటి వరకు 32 నెలల్లో రూ.3,488 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం చెల్లించామని చెప్పారు. ‘‘కాలేజీలపై విజిలెన్స్‌ దాడులు చేయించి కేసీఆర్‌ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల కాలేజీలకే ఇచ్చారు. సీబీఐటీ, వాసవి, మాతృశ్రీ వంటి బెస్ట్‌ కాలేజీలను చంపేశారు. ఒక్క విద్యార్థి ఫీజులు మూడుసార్లు తీసుకున్నారు. గత ప్రభుత్వ విజిలెన్స్‌ నివేదికలు తెప్పించి తాజాగా మళ్లీ విచారణ చేయిస్తున్నాం. మోసాలకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్‌ సన్నిహితుడి యూనివర్సిటీ ఖాతాలో రూ.400 కోట్లు ఖాతాలో పడ్డాయి. ఆ డబ్బంతా ఎక్కడిది..? పాలమ్మితే, పూలమ్మితే వందల కోట్లు వస్తాయా?’’ అని ప్రశ్నించారు. ఫీజంతా పిల్లల దగ్గర వసూలు చేసి మళ్లీ ప్రభుత్వం నుంచి తీసుకున్నారని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు.


ఇంకా అంబాసిడర్‌ కార్లు రిపేర్‌ చేసుకోవాలా..?

‘నేటి పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు ఇంకా పాతకాలపు కోర్సులనే అమలు చేస్తున్నాయి. డీజిల్‌ మెకానిక్‌ కోర్సు ఇప్పటికీ ఉంది. దానిని నేర్చుకుని అంబాసిడర్‌ కార్లు రిపేర్‌ చేసుకోవాలా..?’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దీనిని మార్చి యువతకు నైపుణ్యాలు కల్పించాలన్న లక్ష్యంగానే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘‘పాలిటెక్నిక్‌లపై అపోహలు కల్పిస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య లేదు. వాళ్ల స్థలాలు తీసుకోవడం కాదు. 282 ఎకరాలు ఏటీసీలకు ప్రభుత్వ భూమిని బదిలీ చేశాం. ఒక్కో ఏటీసీపై ప్రభుత్వం రూ.46 కోట్లు ఖర్చు చేస్తోంది. జీవో-91లో మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీ ఉంటుంది. దీని వెనక మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌లో చదువుకున్న ఓ నేత ఉన్నడు. (మాసబ్‌ ట్యాంక్‌ పాలిటెక్నిక్‌లో హరీష్‌ రావు చదువుకున్నడు. పాస్‌ అయిండో లేదో నాకు వివరాలు ఇవ్వండి అని అధికారులను ఆదేశించారు)’’ అని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పాము విషానికి కొత్త విరుగుడు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 03:53 AM