Share News

22ఏ వెనుక రేవంత్‌ కుట్ర

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:29 AM

రాష్ట్రంలోని పేదల ఇళ్లు, భూములను రాత్రికి రాత్రే 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి ప్రజలతో ప్రభుత్వం కన్నీళ్లు పెట్టిస్తోందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. వేలాది ఎకరాల భూములతోపాటు ఊర్లకు ఊర్లేనిషేధిత జాబితాలోకి వెళ్లటం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు

22ఏ వెనుక రేవంత్‌ కుట్ర
HARISHRAO WITH LAND VICTIMS

  • రాత్రికి రాత్రే పేదల ఇళ్లు, భూములు నిషేధిత జాబితాలోకి

  • ఆయన పాలనంతా భూముల చుట్టే సాగుతోంది

  • మంత్రి పొంగులేటి కి సిగ్గుంటే రాజీనామా చేయాలి

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదల ఇళ్లు, భూములను రాత్రికి రాత్రే 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి ప్రజలతో ప్రభుత్వం కన్నీళ్లు పెట్టిస్తోందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. వేలాది ఎకరాల భూములతోపాటు ఊర్లకు ఊర్లేనిషేధిత జాబితాలోకి వెళ్లటం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో 22ఏ వివాదంపై ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలన ప్రజల కేంద్రంగా సాగితే.. రేవంత్‌రెడ్డి పాలన భూముల కేంద్రంగా సాగుతోందన్నారు. మూసీ ప్రాజెక్టు వెనుక దాదాపు 3 వేల ఎకరాల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉందని ఆరోపించారు. హైడ్రా చర్యల వెనుక కూడా భూ వ్యవహారమే ఉందని అన్నారు. సీఎం సోదరుడి ఇల్లు, బడా బాబుల ఇళ్లు హైడ్రాకు కనిపించవని విమర్శించారు. హెచ్‌సీయూ, లగచర్ల భూములు, హిల్‌టాప్‌ పాలసీ, స్కిల్‌ యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌ భూములు, హైడ్రా, మూసీ, మెట్రో వంటి అన్ని అంశాల వెనుకా భూ దోపిడీయే ఉందని ఆరోపించారు. భూభారతి పోర్టల్‌లో వక్ఫ్‌, దేవాదాయ, అసైన్డ్‌ భూముల వివరాలు పూర్తిగా కనిపించడం లేదని, 22ఏ నిబంధన ప్రభుత్వ భూములను కాపాడేందుకే అయితే ఆ భూముల వివరాలు ఎందుకు లేవ ని ప్రశ్నించారు.


రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు టీజీఐఐసీ భూమిని ఎలా రిజిస్ట్రేషన్‌ చేసిందని ప్రశ్నించారు. నిషేధిత జాబితా నుంచి భూములను విడిపించేందుకు 30 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పిన మాట అబద్ధమని మండిపడ్డారు. 2025 సెప్టెంబరులో 33 జిల్లాల కలెక్టర్లకు కొత్తగా నిషేధిత భూములను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారని, కలెక్టర్ల నివేదికల ఆధారంగా భూములను నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. అబద్ధాలు చెప్పిన మంత్రి పొంగులేటికి సిగ్గుంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత.. ఇరు దేశాల మైత్రి బలపడనుందా.?

బ్రిక్స్ సదస్సు.. పుతిన్, షీ జిన్‌పింగ్ బస చేసే హోటళ్లలో రోజుకు అద్దె ఎన్ని లక్షలంటే..?

Updated Date - Sep 12 , 2026 | 04:29 AM