దొంగ దొరికాడు
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:26 AM
దేశంలో సంచలనం సృష్టించిన బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఇదే రెజిమెంట్‌లో పని చేసి, ఇటీవలే సస్పెండైన మాజీ హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజు ఈ దొంగ తనం చేశాడని తేలింది.
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో
మాజీ హవల్దార్ మల్లేశ్ అరెస్టు
అమ్ముకునేందుకే చోరీ చేసినట్లు సందేహాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధ డీలర్లను ఫాలో
అవుతున్న నిందితుడు.. వారిలో ఓ పాకిస్థానీ
2 నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన మల్లేశ్
స్కూటీపై వచ్చి ఆయుధాలు తీసుకెళ్లిన వైనం
పాలమూరు జిల్లాలోని స్వగ్రామంలో ఇంట్లో
గడ్డివాము కింద గొయ్యిలో దాచిన మల్లేశ్
నిందితుడి అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం
సస్పెండ్ చేశారన్న కోపంతోనే ఈ పని..
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి: డీజీపీ ఆనంద్
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో సంచలనం సృష్టించిన బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఇదే రెజిమెంట్‌లో పని చేసి, ఇటీవలే సస్పెండైన మాజీ హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజు ఈ దొంగ తనం చేశాడని తేలింది. మల్లేశ్ ఎత్తుకెళ్లిన ఆయుధాలు, తూటాలను అన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
తమ ప్రాథమిక విచారణలో మల్లేశ్ ఒక్కడే ఈ చోరీ చేశాడని నిర్ధారణ అయ్యిందని, అయితే, దీని వెనుక ఇతరులెవరైనా ఉన్నారా? ఆర్మీ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? ఉగ్రలింకులున్నాయా అనే విషయాలపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. మల్లేశ్ సోషల్ మీడియా ఖాతాల్లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆయుధాల డీలర్ వివరాలు ఉండటంతో.. ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవటం కోసం ఈ చోరీకి పాల్పడ్డాడా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.
డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మహబూబ్‌నగర్ జిల్లా జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ బొల్లారం సమీపంలోని బాలాజీనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. దేశ సైన్యంలో దాదాపు 16 ఏళ్లపాటు పని చేశాడు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఈ ఏడాది జూన్ 30వ తేదీన అతడిని సర్వీస్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయుధాలను దొంగిలించాలని పథకం వేసి, గత నెల 27వ తేదీ నుంచి.. ఆయుధాలు భద్రపరిచే కోటే వద్దకు సాయంత్రం వేళల్లో వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చాడు. 30వ తేదీ రాత్రి తన స్కూటీ వాహనంపై మద్రాస్ రెజిమెంట్‌లోకి వెళ్లి, వాహనాన్ని ఆయుధాల గదికి కొంచం దూరంలో చీకటి ప్రదేశంలో నిలిపి ఉంచాడు.
తుపాకులు ఉన్న గది వద్దకు వెళ్లి తాళం, తలుపు పగులగొట్టి ఆయుధాలు తీసుకున్నాడు. వాటిని తన వాహనం వద్దకు తీసుకొచ్చి అక్కడ పెట్టి, తూటాలు తదితర మందుగుండు ఉన్న మరో గది వద్దకు వెళ్లాడు. దాని తాళం పగులగొడుతున్నప్పుడు ఆ చప్పుడు విని సమీపంలోని ఓ నైట్ గార్డు అటువైపు రాగా, మల్లేశ్ చీకట్లో దాక్కున్నాడు. గార్డు వెళ్లిపోయిన గంట తర్వాత ఆ గది తాళం పగులకొట్టి, తాను అప్పటికే దొంగిలించిన తుపాకులకు అవసరమైన తూటాలు తీసుకుని స్కూటీ వద్దకు వెళ్లాడు. తుపాకులను, తూటాలను తీసుకొని అక్కడికి రెండు కి.మీ.ల దూరంలో ఉన్న ఒక ఆలయం వద్దకు వెళ్లాడు.
అయితే, మందుగుండు గది వద్ద వదిలిపెట్టిన మ్యాగజైన్ (తూటాల) కవర్స్‌ను తీసుకుని రాలేదని గుర్తించి, వాటి కోసం మళ్లీ వెనక్కువెళ్లి ఓ బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చాడు. దారిలో సెక్యూరిటీ వాళ్లు ఎవరు అని దూరం నుంచి ప్రశ్నించగా 20 రెజిమెంట్ అని చెప్పి జారుకున్నాడు. ఆలయం వద్ద తుపాకులు, తూటాలను దాచిపెట్టి.. మాగ్యజైన్ కవర్స్ బ్యాగుతో ఉదయం 4.34కి తన ఇంటికి స్కూటీపై చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న బ్రీజా కారు డిక్కీలో మ్యాగజైన్ కవర్స్ బ్యాగ్ పెట్టాడు. కారులో బయల్దేరి ఆలయం వద్దకు వెళ్లి అక్కడ దాచిన ఆయుధాలు, మందుగుండును డిక్కీలో వేసుకున్నాడు. అక్కడి నుంచి అచ్చంపేట వైపు బయల్దేరాడు.
శ్రీశైలం ప్రధాన రహదారిలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రయాణించి సాగర్ రోడ్డులోకి వెళ్లాడు. సాగర్ రోడ్డులో తన కారులోకి నలుగురు ప్రయాణికులను ఎక్కించుకుని వారి వద్ద డబ్బులు తీసుకున్నాడు. తర్వాత దిండి వద్ద మరో ఇద్దర్ని ఎక్కించుకుని వారి వద్ద డబ్బులు తీసుకున్నాడు. అచ్చంపేటకు మధ్యాహ్నం చేరుకున్నాడు’. పోలీసు విచారణలో తన మీద అనుమానం రాకుండా ఉండటానికి.. ఉద్యోగం పోతే క్యాబ్ నడుపుతున్నట్లు సాక్ష్యాధారాలను సృష్టించుకోవడానికి మల్లేశ్ ఆరుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు.
ఇంటికి చేరుకున్న తర్వాత ఆయుధాలను గడ్డివాములో దాచి వాటిపై చెత్త వేశాడని తెలిపారు. అయితే, తర్వాత రోజుల్లో దర్యాప్తులో భాగంగా పోలీసులు తన ఇంటికి రావడానికి ముందు 6వ తేదీన ఆయుధాలను తీసుకుని పస్రా గ్రామంలో ఒక ఇంట్లో దాచాడని, పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత 8వ తేదీన మళ్లీ ఆయుధాలను తీసుకొచ్చి ఇంట్లోని గడ్డివాము కింద గుంత తీసి దాచాడని పేర్కొన్నారు. మల్లేశ్ ఒక్కడే ఈ దొంగతనం చేశాడా? అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుగుతోందని, దొంగతనం తర్వాత మల్లేశ్ ఆయుధాల గది ఇన్‌చార్జితో మాట్లాడిన కాల్ డిటైల్స్ ఉన్నాయని ఆనంద్ తెలిపారు.
మల్లేశ్ సోషల్ మీడియా ఖాతాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆయుధాల డీలర్‌ను ఫాలో అవుతున్నట్లు వెల్లడైందని, ఆ డీలర్ ఇన్‌స్టాలో షాట్‌గన్స్ ఇతర ఆయుధాల వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయుధాలను విక్రయించటం కోసం ఈ చోరీ చేశాడా అన్న కోణాన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే, తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో ఆవేశంలో చేసిన పనిగానే ప్రాథమికంగా అనుమానిస్తున్నామని డీజీపీ తెలిపారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీలు రాత్రి పూట పని చేయవనే విషయం మల్లే్‌షకు తెలుసని పేర్కొన్నారు. ఇందులో ఇతర వ్యక్తుల పాత్రపై సైన్యం ఇంటెలిజెన్స్ విచారణ జరుపుతుందని, భద్రతా వైఫల్యాలున్నాయా అనే విషయంలో తాము కామెంట్ చేయదలచుకోలేదని డీజీపీ స్పష్టం చేశారు.
వీడని చిక్కుముడులెన్నో...
సైన్యానికి సంబంధించిన ఆయుధాల చోరీ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి, ఆయుధాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికి దర్యాప్తులో వీడని చిక్కుముడులెన్నో కనిపిస్తున్నాయి. మల్లేశ్ ఏ ఉద్దేశంతో చోరీ చేశాడు అన్నది కీలకంగా మారింది. ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన నలుగుర్ని మల్లేశ్ ఫాలో అవుతున్నట్లు సమాచారం. అంటే, అమ్మడం కోసమే ఆయుధాలు దొంగిలించాడా? 16 ఏళ్లు సైన్యంలో పని చేసిన మల్లేశ్ మరో మూడేళ్లలో రిటైర్ కావాల్సి ఉంది.
ఇటువంటప్పుడు తనను క్రమశిక్షణ చర్యల కింద పెన్షన్డ్ అవుట్ కింద తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయాడా? తన పై అధికారులకు శిక్ష పడాలని ఆయుధాలను దొంగిలించాడా? అలాగైతే, తనను సర్వీసు నుంచి తొలిగించిన నాటి నుంచి చోరీకి పాల్పడిన నాటికి మధ్యనున్న రెండు నెలలపాటు ఏం చేశాడు? దొంగతనం ఎప్పటికైనా బయటపడుతుందని తెలిసే ఏవేవో సాకులు సృష్టించుకోవడానికి ప్రయత్నించాడా? మద్రాస్ రెజిమెంట్‌లోని కొందరు ఉన్నతాధికారులతో అతనికున్న పరిచయాలేమిటి? వంటి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి దర్యాప్తును మిలిటరీ అధికారులు చూస్తారని పోలీసులు ప్రకటించినప్పటికి, కేసు బొల్లారం పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రమంలో తదుపరి విచారణను ఎన్‌ఐఏకు బదిలీ చేయనున్నారా అనేప్రశ్నలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దర్యాప్తు జరిగిందిలా..
కేసు దర్యాప్తులో మల్కాజిగిరి, హైదరాబాద్ కమిషనరేట్ల టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ బృందాలతో పాటు రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు కూడా పాల్గొన్నాయని సీవీ ఆనంద్ వివరించారు. ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కావడంతో.. దర్యాప్తులో ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్లామని తెలిపారు. ఆయుధాల గది ఇంచార్జ్‌లను ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో.. ఆయుధాల వద్దకు తరచూ వెళ్లే అవకాశం ఉన్నవారిని, అవుట్ సోర్సింగ్ సిబ్బందితోపాటు ఇతరులనూ విచారించామని, అయినా ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో దర్యాప్తు తీరు మార్చుకున్నామని వివరించారు.
క్రమశిక్షణాచర్యల్లో భాగంగా విధుల నుంచి తొలగింపునకు గురైన 34 మందిని, సెలవుల్లో ఉన్న 54మందిని, సర్వీసు నుంచి పెన్షన్డ్ అవుట్ అయిన ఏడుగురిని ప్రశ్నించుకుంటూ, దాదాపు 8.5 లక్షల మొబైల్ కాల్స్‌ను విశ్లేషణ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇద్దరిపై తమ అనుమానాలు బలపడ్డాయని తెలిపారు. ఒకరు పెన్షన్డ్ అవుట్ అయిన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ హవల్దార్ కాగా, మరొకరు మల్లేశ్ అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వ్యక్తిని విచారించిన క్రమంలో అతని పాత్ర లేదని తేలిందని, జంగంరెడ్డి పల్లిలో ఉంటున్న మల్లేశ్ ఇంటికి తమ బృందం ఈనెల 7వ తేదీన వెళ్లి ప్రశ్నించినప్పుడు.. అతడు కొన్ని విషయాలను దాచిపెట్టినట్లు గుర్తించామన్నారు. దీంతో స్థానిక పోలీసులకు అతనిపై నిఘా పెట్టాలని చెప్పి, మల్లేశ్‌ను హైదరాబాద్‌కు రావాలని చెప్పి వచ్చామన్నారు.
చోరీ జరగటానికి ముందు గత నెల 27-29వ తేదీల్లో సాయంత్రం వేళలో మల్లేశ్ ఆయుధాల గది సమీపానికి పలుమార్లు వెళ్లిన విషయం సీసీ కెమెరాలో రికార్డు అయ్యిందని, ఆయినా మల్లేశ్ ఈ విషయాన్ని వెల్లడించకపోవటంతో తమ అనుమానాలు బలపడ్డాయని ఆనంద్ తెలిపారు. పోలీసు విచారణకు మల్లేశ్ రెండు రోజులు గైర్హాజరు కావడంతో మరో బృందం అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆయన భార్య, మామను కలిసి కేసు తీవ్రతను వివరించామని, ఆ సమయంలో మల్లేశ్ ఫోన్‌ను పరిశీలించడంతో వాట్సాప్ కాల్‌లాగ్, చాట్స్ క్లియర్ చేసి ఉన్నాయని వెల్లడించారు.
అప్రమత్తమైన పోలీసు బృందం వెంటనే మల్లేశ్‌ను వెంటపెట్టుకుని హైదరాబాద్‌కు రావాలని ఆయన భార్యకు సూచించిందని, గురువారం హైదరాబాద్‌కు బయల్దేరిన సమయంలో మల్లేశ్‌ను అతడి భార్య నిలదీయడంతో ఆయుధాలు తానే దొంగిలించినట్లు చెప్పాడని పేర్కొన్నారు. మల్లేశ్ భార్య తమకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసు బృందం మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిందని, అతడు వెల్లడించిన సమాచారం మేరకు వారి ఇంటిలోని గడ్డికుప్ప కింద గుంతలో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని ఆనంద్ తెలియజేశారు. శుక్రవారం ఉదయం మల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
మల్లేశ్ వద్ద నుంచి నాలుగు ఎకే 47 రైఫిళ్లు, ఐదు మ్యాగజైన్లు, 5.56 ఎంఎం ఇన్సాస్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 9ఎంఎం పిస్టల్‌తోపాటు 12 మ్యాగజైన్లు, సివిల్ విభాగానికి చెందిన 6.35 పిస్టల్ ఒక మ్యాగజైన్, 9ఎంఎం పిస్టల్‌తో పాటు 1156 తూటాలు, ఏకే 203కి సంబంధించిన 720 తూటాలు, ఇన్సా్‌సకు సంబంధించిన 11 బాల్స్, ఐదు ట్రేసర్లు, 20 బ్లాంక్ రౌండ్స్, నైట్‌విజన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్, మల్కాజిగిరి కమిషనర్ సుమతి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఆయుధాల చోరీ ఘటన.. ఇది ఇంటిదొంగల పనే అయి ఉంటుందంటూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. అది నిజమేనని ప్రస్తుతం తేలింది.
చిన్నతనంలోనే చోరీలు!
పదర, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పట్టుబడిన మల్లేశ్.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండల పరిధిలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన పెద్ద నారాయణ కుమారుడు. అతడి పూర్తి పేరు ఉప్పుతోళ్ల రాజు ఆలియాస్ మల్లేశ్. ఆయుధాల చోరీ కేసులో అరెస్టు కావడంతో గ్రామంలో పలువురు చర్చించుకున్నారు. రాజు చిన్నతనంలోనే దొంగతనాలకు పాల్పడేవాడనే ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం రాజు కుటుంబం ఈ గ్రామంలో ఉండటంలేదు. తల్లి మృతి చెందగా తండ్రితో కలిసి అచ్చంపేట, హైదరాబాద్‌లలో నివసిస్తున్నాడు. నాగర్‌కర్నూలులో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నట్లు వెలడైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
సురేఖనెందుకు తొలగించారు!?
Read Latest AP News And Telangana News And International News And Telugu News