ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6 నెలల్లో రోబోటిక్ సర్జరీలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:33 AM
తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జీజీహెచ్‌లలో వచ్చే ఆరు నెలల్లో అధునాతన రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
వైద్య కళాశాలలు, జీజీహెచ్‌లలో టెక్నాలజీ విస్తరణ
వైద్య విద్యార్థులకు 6 నెలల ప్రత్యేక శిక్షణ తప్పనిసరి
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సనత్‌నగర్ టిమ్స్‌లో మల్టీ స్పెషాలిటీ రోబోటిక్
సర్జరీ వర్క్‌షాప్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే ఆరు నెలల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో (జీజీహెచ్) అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ఆదివారం నిర్వహించిన ‘స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షా్‌ప’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆస్పత్రితో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, టిమ్స్, గాంధీ, నిలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లలో రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. రోబోటిక్ టెక్నాలజీలో ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ను అమలు చేసి, క్రమం తప్పకుండా వర్క్‌షా్‌పలు నిర్వహించడం ద్వారా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నిపుణులైన డాక్టర్లను తయారు చేస్తామన్నారు. వైద్య విద్యలో భాగంగా విద్యార్థులు కచ్చితంగా ఆరు నెలల పాటు రోబోటిక్ శస్త్ర చికిత్సలపై శిక్షణ పొందేలా సంస్కరణలు తేనున్నామని, అవసరమైతే దీనికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతులు కూడా తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే నిమ్స్‌లో గత రెండున్నరేళ్లలో 1,000కి పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగా, అందులో 90 శాతానికి పైగా శస్త్రచికిత్సల ఖర్చును రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రతీ టిమ్స్ ఆస్పత్రిని 1000 పడకలతో, నూతన ఉస్మానియాను 2వేల పడకలతో నిర్మిస్తున్నామని, ఇవన్నీ అందుబాటులోకి వస్తే 40వేల పడకలు సమకూరుతాయని చెప్పారు. అలాగే, విదేశీ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా హెల్త్ టూరిజం పాలసీ కింద 400 పడకలను కేటాయించామని మంత్రి వివరించారు.
రోబోటిక్ సర్జరీతో విప్లవాత్మక మార్పులు: డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ
రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా అత్యంత కచ్చితత్వంతో కూడిన చికిత్స సాధ్యమవుతుందని, రోగులు కూడా త్వరగా కోలుకుంటారని భారత రోబోటిక్ సర్జరీ పితామహుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు సుధీర్ శ్రీవాస్తవ తెలిపారు. టెలి-సర్జరీ సాంకేతికతతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు ఆఫీసులో కూర్చునే విజయవంతంగా సర్జరీ చేయవచ్చని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఎస్‌ఎ్‌సఐ మంత్ర’ రోబోటిక్ సిస్టమ్స్ ద్వారా చికిత్స వ్యయం గణనీయంగా తగ్గిందన్నారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు ‘త్రివేణి’ రోబోటిక్ బస్సును, డ్రోన్ ద్వారా శస్త్రచికిత్సలు చేసేందుకు ‘ఎస్‌ఎ్‌సఐ విమాన’ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసినట్లు డాక్టర్ శ్రీవాస్తవ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చరిత్రను తొక్కిపెడుతున్నారు
కాంగ్రెస్‌ను వీడేది లేదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News