కాంగ్రెస్‌ను వీడేది లేదు
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:58 AM
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, కొండా మురళికి త్వరలో రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి వస్తుందని చెప్పారు.
మంత్రి పదవి పోయినందుకు బాధ లేదు
అకారణంగా తొలగించారన్న బాధ మాత్రమే ఉంది
వచ్చే ఎన్నికల్లోనూ వరంగల్ తూర్పు నుంచే గెలుస్తా
కొండా మురళికి త్వరలోనే రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి
అధిష్ఠానం నుంచి సంకేతాలు వస్తున్నాయి: కొండా సురేఖ
అధిష్ఠానం సురేఖకు పదవి ఇస్తానంటోంది: కొండా మురళి
వరంగల్‌లో కార్యకర్తలతో కొండా దంపతుల సమావేశం
వరంగల్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తాము పార్టీ మారతామంటూ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మంత్రి పదవి పోయిందని, అయినా బాధ లేదని తెలిపారు. అకారణంగా తొలగించారన్న బాధ మాత్రమే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వరంగల్ తూర్పు నుంచే పోటీ చేసి గెలుస్తానని, మళ్లీ మంత్రినవుతానని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంటామని చెప్పారు.
ఆదివారం వరంగల్‌లోని ఓ హోటల్‌లో పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు సమావేశమయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ‘‘కొండా దంపతులతోనే మా పయనం, మీ వెంటే మేముంటాం’ అని మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ, ‘‘మంత్రి పదవి నుంచి నన్ను బర్తరఫ్ చేసిన సందర్భంగా చాలా మంది నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరూ ఎలాంటిఅల్లర్లు చేయవద్దని మేం చెప్పిన మాటకు అందరూ కట్టుబడి ఉన్నారు’’ అని తెలిపారు.
పదవులు తృణప్రాయమే..
రాజకీయాల్లో వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేయమంటే కూడా తప్పించుకుని పోతారని, అలాంటిదితాము పదవులను తృణప్రాయంగా వదిలేశామని కొండా సురేఖ చెప్పారు. దాదాపు మూడేళ్లపాటు మూడు శాఖల్లో ఎక్కడా అవినీతికి తావులేకుండా మంత్రి పదవి నిర్వహించానని తెలిపారు. తెలంగాణ కాంగ్రె్‌సలో తానే సీనియర్‌నని, తనకు మంచి ఫ్యూచర్ ఉంటుందనే విషయం తెలుసునని అన్నారు. కొండా మురళికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి వస్తుందని అదిష్ఠానం నుంచి సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణిలపై సురేఖ పరోక్షంగా విమర్శలు చేశారు. కొండా మురళి మాట్లాడుతూ.. తాము విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నామని, ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీలో కొనసాగడం లేదని చెప్పారు. తమ కుమార్తె సుస్మిత.. తన భవిష్యత్తును తానే చూసుకుంటారని అన్నారు. ఆమె ప్లాన్ బీ ఏమిటో తమకు తెలియదన్నారు. ‘మేం వరగంల్ తూర్పును చూసుకుంటాం. ఆమె అక్కడ చూసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. తాను ఎవరినైనా బెదిరించి భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకొంటానని సవాల్ చేశారు. సురేఖకు పదవి ఇస్తామని, ఢిల్లీ రమ్మని అదిష్ఠానం అంటోందని, కానీ, ఆమె వెళ్లడంలేదని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐక్యంగా ఉంటేనే మీకు కోటా.. వాటా..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News