Share News

జిల్లాలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:47 AM

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌(కేంద్రీకృత సామాజిక వంటశాల)ను ఏర్పాటు చేస్తోంది. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో ఈ వంటశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది.

జిల్లాలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌(కేంద్రీకృత సామాజిక వంటశాల)ను ఏర్పాటు చేస్తోంది. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో ఈ వంటశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. త్వరలోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ దీనిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హరే రామ.. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమ నిర్వహణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.

జిల్లాలోని 669 ప్రభుత్వ పాఠశాలలకు..

జిల్లాలోని నెలకొల్పుతున్న కేంద్రీకృత సామాజిక వంటశాల ద్వారా కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌, హుస్నాబాద్‌ తదితర నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో ఉన్న 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజు పరిశుభ్రమైన పోషక విలువలతో కూడిన రుచికరమైన అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు సమతులమైన పోషక విలువలు కలిగిన అల్పాహారాన్ని అందించేందుకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సహకారంతో రోజు వారి అందించే టిఫిన్‌ మెనూను రూపొందించారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఏకాగ్రత కూడా కలుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

అధునాతన యంత్రాలు ఏర్పాటు

సోమవారం ఇడ్లీ సాంబారు, మంగళవారం ఆలు కుర్మ, బుధవారం దోష, చట్నీ, గురువారం ఉప్మా చట్నీ, శుక్రవారం మిల్లెట్‌ ఇడ్లీ సాంబారు, శనివారం బోండా చట్నీ అల్పాహారంగా అందిస్తారు. విద్యార్థులకు ఈ అల్పాహారంతోపాటు రోజు విడిచి రోజు పాలు అందిస్తారు. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఈ కేంద్రీకృత వంటశాల నుంచి ప్రతీరోజు సకాలంలో అల్పాహారాన్ని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 680 పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు రవాణా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. మంథని, మంచిర్యాల, మధిరలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడంతో కరీంనగర్‌లోనూ దీన్ని చేపట్టి అతి స్వల్ప సమయంలో వంటశాల ఏర్పాటు పనులు పూర్తి చేశారు. ఈ సామాజిక వంటశాలలో అడ్వాన్స్‌డ్‌ ఆటోమేటెడ్‌ పరికరాలతో లార్జ్‌ స్కేల్‌లో టిఫిన్స్‌ సిద్ధం చేస్తారు. గంటకు 5,400 ఇడ్లీలు, గంటకు రెండు వేల దోశలు, గంటకు మూడు వేల పూరీలను తయారు చేసే మిషన్లను ఇందులో ఏర్పాటు చేశారు. రెండు గంటల్లో ఐదు వేల మందికి సరిపోయే కూరలు, సాంబారు తయారు చేసే పరికరాలు, 15 నిమిషాల్లో వెయ్యి మంది విద్యార్థులకు సరిపోయే ఆహారాన్ని అందించగలిగిన పరికరాలను ఈ కిచెన్‌లో అమర్చారు.

Updated Date - Sep 14 , 2026 | 12:47 AM