Share News

దండాలయ్యా...ఉండ్రాలయ్యా

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:44 AM

జిల్లాలో సోమవారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ముస్తాబు చేయగా, విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్నాయి. పలు చోట్ల మట్టి వినాయక విగ్రహాలు, కర్ర వినాయకులను కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు చేయగా ఆయా ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.

దండాలయ్యా...ఉండ్రాలయ్యా

జగిత్యాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ముస్తాబు చేయగా, విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్నాయి. పలు చోట్ల మట్టి వినాయక విగ్రహాలు, కర్ర వినాయకులను కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు చేయగా ఆయా ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో స్వచ్చంద సంస్థలు, కుల సంఘాలు, యువజన సంఘాలు వినాయక ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి.

జిల్లాలో 1,200కు పైగా మండపాలు..

జిల్లా వ్యాప్తంగా సుమారు 1,200కు పైగా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. పలు సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తుండగా ఫ్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన రంగు రంగుల విగ్రహాలకు సైతం భారీగా డిమాండ్‌ పెరిగింది. జిల్లాలోని కోరుట్ల విగ్రహాల తయారీ, విక్రయాలకు ప్రసిద్ధిగాంచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కోరుట్లకు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. వినాయక విగ్రహాలకు ఉపయోగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, కొబ్బరి పీచు, రంగులు తదితర వస్తువుల ధరలు గతంలో కంటే పెరిగాయి. దీంతో వ్యాపారులు విగ్రహాల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకును తీసుకువచ్చి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ముడి సరుకులను తరలించేందుకు రవాణా చార్జీలు సైతం భారీగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

ఫపెరిగిన విగ్రహాల ధరలు

జిల్లాలో ఒక్కో వినాయక విగ్రహం రూ.500 నుంచి రూ.50 వేల వరకు సైజులను బట్టి విక్రయిస్తున్నారు. రూ.50 వేలకు మించి ఖరీదైన విగ్రహాలు సైతం కొన్ని అందుబాటులో ఉన్నాయి. గత యేడాది రూ.25 వేలకు లభించిన విగ్రహం ప్రస్తుత సీజన్‌లో రూ.32 వేల వరకు పలుకుతోంది. జిల్లాలోని పలు చోట్ల అర ఫీట్‌ విగ్రహం నుంచి 15 ఫీట్ల వరకు ఎత్తయిన భారీ విగ్రహాలు లభిస్తున్నాయి. దీనికి తోడు పూజా సామాగ్రి ధరలు, పువ్వుల ధరలు, మైక్‌ సెట్‌ సామాగ్రి, మండపానికి వినియోగించే వస్తువుల అద్దెలు పెరగడం, ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు, మైక్‌ సెట్‌ అనుమతి చార్జీలు వసూలు చేస్తుండడంతో మండపాల నిర్వాహకులకు ఆర్థిక భారం పెరిగింది.

మండపాల జియోట్యాగింగ్‌

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్ఠకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డులు, ప్రధాన ప్రాంతాల్లో వినాయక మండపాలు, పందిళ్లు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నవరాత్రోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినాయక మండపాల నిర్వహణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. తమ వివరాలను సంబందిత పోర్టల్‌లో నిర్వాహకులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ మండపాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. నవరాత్రోత్సవాల్లో మండపాల నిర్వాహకులు పాటించాల్సిన అంశాలపై పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు శాంతి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసి అవసరమైన సూచనలు చేశారు.

ఫమట్టి గణపతులపై అవగాహన

జిల్లాలో పర్యావరణ హిత గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి అటు అధికారులు, ఇటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పర్యావరరణానికి ఇబ్బందులు కలిగించే పీవోపీ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచిస్తున్నారు. పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, అధికారులు, రాజకీయ నాయకులు భారీ మొత్తంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్న మట్టి గణపతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు.

ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి

-అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి

జిల్లాలో గణేష్‌ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి. నిబంధనలను ప్రతీ మండప నిర్వాహకులు పాటించాలి. మండపాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలి. పోలీసులు, అధికారులకు ఆయా మండపాల నిర్వాహకులు సహకరించాలి.

మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి

-సంజయ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి. సంప్రదాయబద్ధంగా వినాయక చవితిని జరుపుకోవాలి. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలి. మండపాల నిర్వాహకులు నిబంధలను కచ్చితంగా పాటించాలి. వినాయక విగ్రహాల ప్రతిష్ఠ మొదలుకొని నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు బాధ్యతాయుతంగా నిర్వాహకులు వ్యవహరించాలి.

Updated Date - Sep 14 , 2026 | 12:44 AM