పంటలను కాపాడిన వాన
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:28 AM
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో ఎండిపోతున్న పంటలకు ఊపిరి వచ్చింది. 534 మండలాల్లో వర్షాలు నమోదవగా, కేసముద్రంలో అత్యధికంగా 20.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా మురిపించిన వానలు
534 మండలాల్లో కురిసిన వర్షాలు
కేసముద్రంలో అత్యధికంగా 20 సెం.మీ. వాన
పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు
రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది
నేడు, రేపు కూడా వర్షాలు.. యెల్లో అలెర్ట్ జారీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
చినుకు తడి లేక ఎండిపోతున్న పంటలకు వరుణుడు మళ్లీ జీవం పోశాడు. చాలా రోజుల తర్వాత శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రెండు రోజులుగా చెదురుమదురు జల్లులు పడగా.. శనివారం రాష్ట్రమంతా వర్షం కురిసింది. 534 మండలాల్లో వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 11 మండలాల్లో అతి భారీ వర్షం పడగా, 39చోట్ల భారీగా, 255 మండలాల్లోమోస్తరు, 198 చోట్ల తేలికపాటి వర్షం కురిసినట్లు వెల్లడించింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లాలోని నెల్లికుదరులో 15.6, పెద్ద వంగరలో 12.9, ఇనుగుర్తిలో 12, చిన్నగూడూరులో 11, నర్సింహుల పేట, దంతాలపల్లిలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా రాయపర్తిలో 15.6, యాదాద్రి జిల్లా మోత్కూరులో 13.6, వర్ధన్నపేటలో 12, జనగామ జిల్లా కడకొండ్లలో 12.6, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 45.6 మి.మీ. వర్షం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జోరుగా వర్షం కురవటంతో అన్నదాతల్లో ఆనందం వెళ్లివిరుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సరాసరి 45.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 91.2 మి.మీ. రికార్డయింది. వరంగల్ జిల్లాలో 57.8 మి.మీ, జనగామ జిల్లాలో 47.3 మి.మీ, ములుగు జిల్లాలో 36.8 మి.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 22.1 మి.మీ, హనుమకొండ జిల్లాలో 18.2 మి.మీ. వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలో పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు కొట్టుకుపోయి, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రామన్నగూడెం బస్టాండ్ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. రావిరాల స్టేజీవద్ద రోడ్డు పై నుంచి వరదనీరు ప్రవహించటంతో తొర్రూరు, మహబూబాబాద్, కేసముద్రం ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లి మండలంలో పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దంతాలపల్లి-పెద్దముప్పారం-సూర్యాపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి నల్లగొండలో కంది, పత్తి పంటలకు ఊపిరి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిపోతున్న పంటలకు తాజా వర్షాలు మళ్లీ ప్రాణం పోశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలు అన్నదాతలకు పంటలపై మళ్లీ ఆశలు రేకెత్తించాయి. పత్తి, కంది వంటి పంటలకు ఈ వర్షాలు ఊపిరి పోశాయి. ఈ వర్షాలతో జిల్లాలో వర్షపాత లోటు 36 నుంచి 22 శాతానికి తగ్గింది. చౌటుప్పల్‌లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో భారీ వర్షాలకు చెరువులు నిండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మూసీవాగు, పాలేరు వాగులకు వరద పెరిగింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా శాలిగౌరారంలో 12.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో వరి పంట నీట మునిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనెకుంటతండాలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందాయి. జాజిరెడ్డిగూడెం మండలం కొత్తగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గదుల్లోకి వర్షపు నీరు చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌రెడ్డి
గణపతి బప్పా మోరియా... డీజే మోతలు వద్దయా..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News