గణపతి బప్పా మోరియా... డీజే మోతలు వద్దయా..
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:07 AM
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైపోయింది. నేటి నుంచి నవరాత్రులు పూర్తయి నిమజ్జనోత్సవం ముగిసే దాకా వాడవాడలా ఏదో ఒక మూల నుంచి చెవులు చిల్లులు పడేలా.. గుండెలు అదిరిపోయేలా.. డీజే మోతలు, తీన్మార్ డప్పుల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి.
నేటి నుంచే గణేశ్ నవరాత్రులు
నిమజ్జనోత్సవాలు పూర్తయ్యే దాకా
వాడవాడలా మోగనున్న స్పీకర్లు, డీజే బాక్సులు
భారీ శబ్దాలతో గుండెకు చేటు అంటున్న వైద్యులు
హృద్రోగులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని
సూచన.. సంప్రదాయ వాయిద్యాలే మేలు
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైపోయింది. నేటి నుంచి నవరాత్రులు పూర్తయి నిమజ్జనోత్సవం ముగిసే దాకా వాడవాడలా ఏదో ఒక మూల నుంచి చెవులు చిల్లులు పడేలా.. గుండెలు అదిరిపోయేలా.. డీజే మోతలు, తీన్మార్ డప్పుల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ ధ్వనులు ఇచ్చే ఉత్సాహం సంగతి ఎలా ఉన్నా... డీజే మోతలకు మాత్రం ప్రజలు దూరంగా ఉండడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లబ్ డబ్ అని కొట్టుకునే గుండెను డీజే మోత ఆపేసే ముప్పుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనలు, పలు వైద్య పరిశోధనలు ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి.
బాబోయ్ అనిపిస్తున్న అధ్యయనాల ఫలితాలు
రాష్ట్రంలో డీజే సౌండ్ దెబ్బకు గుండె ఆగిపోయిన ఘటనలు ఇటీవల కాలంలో చాలానే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కమలాదేవి (60) అనే వృద్ధురాలు తన కోడలితో కలిసి ఆలయానికి వెళ్తుండగా భారీ డీజే సౌండ్ సిస్టమ్‌తో మోత మోగిస్తూ ఓ ట్రాక్టర్ వారి సమీపం నుంచి వెళ్లింది. అంతే ఆ విపరీతమైన ధ్వని, దాని కంపనాల ధాటికి కమలాదేవి గుండె పట్టుకుని కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండడంతో వైద్యులు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు, అధ్యయనాల్లో వెలువడిన ఫలితాలు బాబోయ్ అనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. పుణెలో 2025లో జరిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా అక్కడి శబ్ద తీవ్రత, దాని వల్ల ప్రజల్లో కలిగిన ఆరోగ్య సమస్యలపై డీవై పాటిల్ కళాశాల జాగ్రఫీ, పర్యావరణ శాస్త్ర విభాగాల పరిశోధకుల బృందం ఓ అధ్యయనం చేసింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం వాణిజ్య ప్రాంతాల్లో గరిష్ఠ శబ్ద తీవ్రత 55 నుంచి 75 డెసిబెల్స్ మించరాదు. కానీ ఉత్సవాల వేళ ఈ తీవ్రత సగటు 95 నుంచి 102 డెసిబెల్స్ వరకు ఉండగా గరిష్ఠంగా 116 డెసిబెల్స్ వరకు చేరినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే, ఉత్సవాల్లో పాల్గొన్న 200 మందిపై ఓ సర్వే చేయగా వారిలో 50 మంది వైద్య నివేదికలు కలవరపెట్టాయి. భక్తులు, స్థానికులలో 41 శాతం మందికి శోభాయాత్రల తర్వాత చెవుల్లో నిరంతరం ఈలలు వేసినట్లు శబ్దాలు వినిపించే తాత్కాలిక టిన్నిటస్ సమస్య వచ్చింది. అలాగే కొంతమందిలో బీపీ, గుండె వేగం పెరిగాయి. అలాగే, మండపాల సమీపంలో నివసించే వారిలో 64 శాతం మంది తీవ్ర నిద్రలేమితో బాధపడ్డారు. నిమజ్జనం జరిగే దారుల్లో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు (36 శాతం) తీవ్రమైన తలనొప్పితో బాధపడగా 58 శాతం మంది మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆ అధ్యయనం తేల్చింది.
చెవులకే కాదు గుండెకు ఇబ్బందే..
బిగ్గరగా వచ్చే శబ్దాలు కేవలం చెవులనే కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’లో ప్రచురితమైన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. అనుకోకుండా విపరీతమైన శబ్దాన్ని విన్నప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ర్టెస్ హార్మోన్లు ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ హార్మోన్ల ప్రభావంతో రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోయి, రక్తపోటు శరవేగంగా పెరుగుతుంది. దీంతో హృదయస్పందన రేటు ఒక్కసారిగా పెరిగి గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అలాగే సాధారణంగా 60 డెసిబెల్స్ (ఆఫీసుల్లో మాట్లాడే శబ్దం) దాటితేనే గుండె వ్యవస్థపై ఒత్తిడి మొదలవుతుంది.
ఇక వందల డెసిబెల్స్ దాటే డీజే శబ్దాలు ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. కాగా యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ‘డెసిబుల్-ఎంఐశ్రీ’ అధ్యయనం ప్రకారం.. రాత్రి వేళల్లో శబ్దం 10 డెసిబెల్స్ పెరిగినా కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు వచ్చే ప్రమాదం 25 శాతం పెరుగుతుందని వెల్లడైంది. ఇక, వయస్సు పెరిగే కొద్దీ గుండె రక్తనాళాల్లో దమనుల పటిష్టత తగ్గ్గిపోతుంది. దాంతో పాటు గుండె జబ్బులు ఉన్న విషయం చాలామందికి ముందే తెలియకపోవచ్చు. దీంతో హిడెన్ కార్డియోవ్యాస్కులర్ డిసిజెస్ ఉన్నవారు, వృద్ధులు హఠాత్తుగా భారీ శబ్దాలు విన్నప్పుడు ఆ తీవ్రతను తట్టుకోలేక వారి గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సంప్రదాయ వాయిద్యాలే మేలు...
పోలీసుల ఆదేశాలు, వైద్య నిపుణుల హెచ్చరికలు, పర్యావరణ నిబంధనలు ఉన్నప్పటికీ డాల్బీ, డీజే శబ్ద వ్యవస్థల వినియోగం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందని పరిశోధకులు అంటున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆధునిక డీజే మోతల కంటే వేడుకలు, ఊరేగింపుల్లో సంప్రదాయ వాయిద్యాలు, భక్తి పాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అధిక శబ్దాలపై ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.
డీజే సౌండ్ బాక్సులకు 10 అడుగుల దూరంలో ఉండండి
డీజే సౌండ్స్ వల్ల చాలా ప్రమాదాలున్నాయి. 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దాలను విన్నప్పుడు అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయి, హార్ట్ రేటు పెరుగుతుంది. గుండె లయ తప్పుతుంది. ఒక్కోసారి కార్డియాక్ అరెస్టు అవుతుంది. స్ర్టెస్ కార్డియోమయోపతికి గురై... గుండె ఆకస్మాత్తుగా వీక్ అవుతుంది. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. డీజే సౌండ్స్ వల్ల దీర్ఘకాలంలో బీపీ పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి అధికమవుతుంది. అందువల్ల డీజే సౌండ్ బాక్స్‌లకు కనీసం పది అడుగుల దూరంలో ఉండాలి. పేస్‌మేకర్స్ వాడుతున్న వారు, బీపీ, యాంగ్‌జైటీ సమస్యలు ఉన్నవారు డీజే సౌండ్స్‌కు దూరంగా ఉండడం మేలు.
- డాక్టర్ ఆర్. గోపికృష్ణ,
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు,
యశోద ఆస్పత్రి, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌రెడ్డి
ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి ఘటన.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News