ఐక్యంగా ఉంటేనే మీకు కోటా.. వాటా..
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:47 AM
ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో కోటా, వాటా సాధించుకోవచ్చని సూచించారు.
ఆత్మాభిమానానికి ప్రతీక ఆర్యవైశ్యులు
సీఎంలంతా గల్లాపెట్టె రోశయ్యకే
ఇచ్చారు.. గాంధీజీ మీ వాడే: రేవంత్
ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య
భవన నిర్మాణానికి శంకుస్థాపన
సీఎం మాటల్లోనే కఠినత్వం..
చేతల్లోనూ ఉంటే ఎంతో మంది జైలుకెళ్లేవారు: టీజీ వెంకటేశ్
హైదరాబాద్ సిటీ/ఉప్పల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యులంతా సమైక్యంగా ఉండాలని, పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని సీఎం రేవంత్ అన్నారు. సమయస్ఫూర్తితో రాజకీయాల్లో కోటా, వాటా దక్కించుకోవాలని సూచించారు. అందరూ ఒక్కతాటిపై నడిస్తే వారిని గౌరవించనివారు ఉండరని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలు ఉంటారు. కానీ, వారు తమ పేదరికాన్ని కడుపులో దాచుకొని.. సమాజంలో గౌరవం, ఆత్మాభిమానంతో బతుకుతారు. సౌమ్యంగా ఉంటారు’ అని అన్నారు. బ్యాంకులు, ఇతర సంస్థలు ఏదైనా ఆస్తిని తనఖా పెట్టనిదే రుణం ఇవ్వవని, కానీ.. ఊరిలో ఉన్న ఏ పేదవాడు వచ్చినా తినడానికి అవసరమైన వస్తువులను ఆర్యవైశ్యులు ఉదారంగా ఇస్తారని తెలిపారు.
ఏ గ్రామమైనా, బస్తీ అయినా ప్రశాంతంగా ఉందన్నా, పేదవాడి ఆకలి తీరుతుందన్నా.. ఎలాంటి తనఖా లేకుండా ఆర్యవైశ్యులు అప్పులు ఇవ్వడం వల్లేనన్నారు. ‘‘పేదవాడి ఆకలి తీర్చడాన్ని మీరు బాధ్యతగా భావిస్తారు. పేదలతో మీకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఊరిలో అందరూ మీ వద్దకు వచ్చి సాధక బాధకాలు చెబుతారు. మీ సలహా కూడా అడుగుతారు. వ్యాపారంలో ఎన్ని ఒడిదొడుకులు, ఆటుపోట్లు ఎదురైనా ఎలా అధిగమించాలో ఆర్యవైశ్యులకు తెలుసు. నేనెప్పుడూ మీ శ్రేయోభిలాషినే’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, మర్ని చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గల్లాపెట్టె పెత్తనం వారికే ఇచ్చారని చెప్పారు. తమ సొమ్ము కంటే జాగ్రత్తగా, పొదుపుగా వ్యవహరించడంతోపాటు.. ఆర్థిక వ్యవస్థను అదుపులో పెట్టి అద్భుతంగా పదవులు నిర్వర్తించారని తెలిపారు.
ధనిక రాష్ట్రంలో రోశయ్య పాత్ర..
2014 జూన్ 2న రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిందంటే.. 16 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండడమూ ఒక కారణమని సీఎం రేవంత్ అన్నారు. సీఎంలు మారినా.. ఆర్థిక మంత్రిగా రోశయ్యను కొనసాగించడం చూస్తేనే ఆర్థిక వ్యవహారాల్లో ఆర్యవైశ్యులు ఎంత నిక్కచ్చిగా ఉంటారో తెలుస్తోందన్నారు. రోశయ్యను మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా చేసి కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని తెలిపారు. ‘‘2007లో నేను మొదటిసారి శాసనమండలికి వెళ్లినప్పుడు కొన్ని విషయాలపై దూకుడుగా మాట్లాడితే.. సభ ముగిసిన అనంతరం రోశయ్య పిలిపించుకొని ఆవేశం తగ్గించుకొని.. అనుభవం తోడు చేసుకొని మాట్లాడితే రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.
దీర్ఘకాలిక రాజకీయాలు ఎలా చేయాలో అలవరుచుకుంటే.. తిరుగులేని నాయకుడిగా ఎదుగుతావు అని నన్ను మొదట గుర్తించింది రోశయ్యే’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. రోశయ్యతో అసెంబ్లీలో సంవాదం నడిచేదని, ఆయన విమర్శలు చురకలా ఉండేవని, ఎవరినీ దూషించేవారు కాదని అన్నారు. రాష్ట్రం విడిపోయినా.. ఆయన మర్యాదను, గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నగరం నడిబొడ్డున స్థలం కేటాయించి విగ్రహం పెట్టామని తెలిపారు. అయితే ఏపీకి చెందిన రోశయ్య విగ్రహం హైదరాబాద్‌లో ఎలా పెడతారంటూ చాలా మంది విమర్శలు చేశారని అన్నారు. కానీ, ‘‘ఓ సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ తాను ఆ గ్రామం నుంచి, ప్రాంతం (ఏపీ) నుంచి అన్నీ అమ్ముకొని బల్కంపేటకు వచ్చి నాలుగు దశాబ్దాలు అయిందని చెప్పారు. తాను హైదరాబాదీనే అని, మంచైనా, చెడైనా ఇక్కడేనని అన్నారు’’ అని సీఎం రేవంత్ వివరించారు.
ప్రపంచస్థాయి నాయకుడు మీ వాడే..
సాధారణంగా జిల్లా, ప్రాంతం, రాష్ట్ర, దేశ నాయకులను చూస్తామని, కానీ.. ప్రపంచ స్థాయి నాయకుడు ఒకే ఒక్కడు మహాత్మా గాంధీ అని సీఎం రేవంత్ అన్నారు. భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి నాయకుడు ఎవరనే చర్చ వస్తే.. అది ఆర్యవైశ్యుల బిడ్డ గాంధీ అని చెప్పాల్సిందేనన్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ అని, జాతీయ అధ్యక్షుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీతారాం కేసరి, ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా రోశయ్య, కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన నంధ్యాలకు చెందిన పెండెకంటి వెంకటసుబ్బయ్య ఆర్యవైశ్యులేనని గుర్తు చేశారు.
లాలా లజపతిరాయ్, సీతారాం కేసరి, పొట్టి శ్రీరాములు వంటి గొప్ప వ్యక్తులు ఆర్యవైశ్య సమాజం నుంచి ఉన్నారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రం, సమగ్రత కోసం మహత్మాగాంధీ ప్రాణాలిస్తే.. ఏపీ సాధనకు పొట్టి శ్రీరాములు అమరులయ్యారని కొనియాడారు. ఆర్భాటం, ప్రచారాలకు దూరంగా ఉండడం వల్ల ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు రాలేదన్నారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. ‘మీరు ఐక్యంగా ఉంటే మాకందరికీ కూడా మీకు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది’ అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకా్‌షగౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, నవీన్‌యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
రేవంత్ కఠినంగా ఉంటే ఎంతో మంది జైలుకెళ్లేవారు: టీజీ వెంకటేశ్
ఉప్పల్: సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో ఉన్నంత కఠినత్వం చేతల్లో ఉండదని, అలా ఉండి ఉంటే ఈరోజు తెలంగాణలో ఎంతో మంది జైలుకు వెళ్లేవారని ఏపీ మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. రేవంత్ పేరులో ప్రకాశవంతమైన అనే అర్థం ఉందన్నారు. సూర్య భగవానుడు ప్రపంచానికి వెలుగునిచ్చినట్లే.. తెలంగాణకు ప్రజలకు రేవంత్ ప్రకాశవంతుడుగా ఉంటూ అందరినీ సేవా కార్యక్రమాల వైపు తీసుకెళుతున్నారని తెలిపారు. ఆర్యవైఽశ్యులు అందరితో మంచిగా ఉంటారని, దైవకార్యాలకు, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పదవుల్లో వైశ్యుల వాటాను మరింత పెంచాలని కోరారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవనానికి తన వంతుగా రూ.1 కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘విజిలెన్స్’ దెబ్బకు..1,000 కోట్లు వసూలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News