‘విజిలెన్స్’ దెబ్బకు..1,000 కోట్లు వసూలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:36 AM
విజిలెన్స్ దాడులతో తెలంగాణలో రైస్‌మిల్లర్ల నుంచి కేవలం 50 రోజుల్లోనే రూ.1,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం వసూలు చేసింది. గత 12 ఏళ్లుగా పేరుకుపోయిన రూ.6,631 కోట్ల బకాయిల్లో ముఖ్యంగా 2022-23 ధాన్యం రికవరీపై అధికారులు దృష్టి సారించారు.
రైస్‌మిల్లర్ల నుంచి ఖజానాకు చేరిన సొమ్ము
రెండు నెలలుగా ముక్కుపిండి బకాయిల వసూళ్లు
2022-23లో వేలం వేసిన
ధాన్యం రికవరీపై దృష్టి
అమ్ముకున్న ధాన్యానికి క్వింటాకు
రూ.2,236 చొప్పున వసూలు
కేసుల నమోదును తగ్గించి.. బకాయిల వసూళ్లకే ప్రాధాన్యం
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేసుకుని ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టిన రైస్‌మిల్ల్లర్లపై ‘విజిలెన్స్’ అస్త్రం సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 200కుపైగా రైస్‌మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక బృందాలతో దాడులు చేపట్టడంతో.. 50 రోజుల వ్యవధిలోనే రూ.1,000 కోట్ల మేర బకాయిలు వసూలుకావడం గమనార్హం. 2022-23లో టెండరు వేసిన ధాన్యాన్ని అమ్ముకున్న రైస్‌మిల్లర్లతోపాటు ఏళ్ల తరబడి బకాయిలున్న మిల్లర్ల నుంచి బకాయిలు వసూలుచేసేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఆ బృందాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమెండోలను కూడా చేర్చడంతో అక్రమార్కుల్లో భయాందోళన కనిపిస్తోంది. ఈ బృందాల దెబ్బకు ఒక రైస్‌మిల్లరు మూడు రోజుల్లోనే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించారని అధికారులు తెలిపారు.
12 ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలు
ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలుచేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం (మిల్లింగ్) కోసం రైస్‌మిల్లులకు పంపుతుంది. మిల్లులు మర ఆడించిన తర్వాత బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ చాలా మంది మిల్లర్లు ధాన్యాన్ని అమ్మేసుకుని, సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ఎగ్గొడుతూ వచ్చారు. ఇలా గత 12 ఏళ్లలో రైస్‌మిల్లర్ల వద్ద రూ.6,631 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైస్ మిల్లుల్లో ధాన్యం మాయంపై వరుసగా కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుని.. మిల్లుల్లో ధాన్యం నిల్వల తనిఖీ, బకాయిలు వసూలు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.
200కుపైగా మిల్లుల్లో మాయమైన సుమారు రూ.1,700 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో 50 రోజుల్లోనే రూ.1,000 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. అందులో చాలా వరకు 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన బకాయిలే కావడం గమనార్హం. ఇక మిగతా మిల్లుల్లో, మరిన్ని సీజన్లకు సంబంధించిన ధాన్యం బకాయిల వసూలు కోసం విజిలెన్స్ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టనున్నాయి. మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) యాక్టులు, క్రిమినల్ కేసులు, పీడీ యాక్టులు వంటివి పెట్టకుండా, సొమ్ము రికవరీకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. బకాయిల చెల్లించేందుకు ముందుకురాని విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
గణపతి బప్పా మోరియా... డీజే మోతలు వద్దయా..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News