నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మృతి
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:14 PM
నాగాలాండ్‌లో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర డీజీపీ రుపిన్ శర్మ వెల్లడించారు. వీరంతా టుయెన్‌సాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.
గువహాటి, సెప్టెంబర్13: రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మరణించారని నాగాలాండ్ డీజీపీ రుపిన్ శర్మ వెల్లడించారు. వీరంతా టుయెన్‌సాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. కల్తీ మద్యం తాగి వీరంతా మరణించినట్లు నివేదిక అందడంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. మూన్, మోకోక్‌చుంగ్, టుయెన్‌సాంగ్, లాంగ్‌లెంగ్, కిఫైర్, షమాటోర్, నోక్లాక్ జిల్లాలోని ప్రజలెవరూ మద్యం సేవించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోని ప్రజలు కూడా మద్యానికి దూరంగా ఉండాలని డీజీపీ రూపిన్ శర్మ కోరారు.
అపరిచితులు లేదా అనధికారికంగా విక్రయించే మద్యాన్ని సేవించవద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. ఈ కల్తీ మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయిందో గుర్తించేందుకు.. అందుకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. నాగాలాండ్‌లో 1989 టోటల్ లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ అమల్లో ఉంది. అయినా అక్రమ మద్యం మార్కెట్లతోపాటు కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
అస్సాంతో నాగాలాండ్‌కు ఉన్న సరిహద్దు ద్వారా అక్రమ మద్యం సరఫరా వెల్లువెత్తుతోంది. దాంతో నాగాలాండ్‌లోని సరిహద్దు పట్టణాల్లో మాఫియా ముఠాలు అక్రమ, కల్తీ మద్యం స్థావరాలు భారీగా ఏర్పాటు చేసుకున్నాయి. అవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీని వల్ల ఏటా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. అలాగే పర్యాటక, హోటల్, ఆతిథ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరో వైపు అక్రమ రవాణా వల్ల మద్యం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యువత డ్రగ్స్ వైపు మళ్లుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మలేషియా పీఎంతో రాహుల్, ప్రియాంక బ్రేక్ ఫాస్ట్ భేటీ
అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ
For More National News And Telugu News