చరిత్రను తొక్కిపెడుతున్నారు
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:24 AM
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సెప్టెంబర్ 17వ తేదీ అసలు చరిత్రను.. పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తొక్కిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణలో రాజకీయాలు
మజ్లి్‌సకు భయపడి బీఆర్‌ఎస్ వెనకడుగు
ప్రస్తుత ప్రభుత్వానిదీ అదే తీరు
పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
ఆపరేషన్ పోలో అమరవీరులకు ఘన నివాళి
కవాడిగూడ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సెప్టెంబర్ 17వ తేదీ అసలు చరిత్రను.. పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తొక్కిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మజ్లిస్ పార్టీకి భయపడి వెనకడుగు వేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరు ప్రవరిస్తోందన్నారు. గాంధీ భవన్‌లో కేవలం పార్టీ కార్యక్రమంగా జరుపుకుంటూ.. ‘ప్రజాపాలన’ పేరిట అసలు చరిత్రను మరుగున పరుస్తోందని విమర్శించారు.
ఆపరేషన్ పోలో ప్రారంభదినం (భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనానికి 1948 సెప్టెంబర్ 13న చేపట్టిన ఆపరేషన్) సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండ్‌పై చారిత్రక యుద్ధ ట్యాంక్ వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం ఫలితంగానే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించదన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభబాయ్ పటేల్ దృఢ నిర్ణయం, కేఎం మున్షీ చొరవ, భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ లేకపోతే నేడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోందన్నారు. పాఠ్యపుస్తకాల్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన పోరాట చరిత్రను సమగ్రంగా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ వీర బైరాన్‌పల్లి, అప్పంపల్లి వంటి ప్రాంతాలలో నేలకొరిగిన వీరుల త్యాగాలు తెలంగాణ విమోచన చరిత్రలో చిరస్దాయిగా నిలిచిపోతాయన్నారు. విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన సైనికుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, కెప్టెన్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి, భరత్‌గౌడ్, విమోచన కమిటి సభ్యులు కిరణ్, సంజయ్, రవీందర్‌రావు, డాక్టర్ వెంకట్‌రెడ్డి, శ్రీధర్, సలంద్రి శ్రీనివా్‌సయాదవ్, సురేష్ ముదిరాజ్, రమే్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూగర్భ లైన్లు, డబుల్ డెక్‌లు!
కాంగ్రెస్‌ను వీడేది లేదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News