Share News

భూగర్భ లైన్లు, డబుల్‌ డెక్‌లు!

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:09 AM

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో 3.25 కి.మీ. భూగర్భ మెట్రో, 1.2 కి.మీ. డబుల్‌ డెక్‌ మార్గం కీలకంగా ఉన్నాయి.

భూగర్భ లైన్లు, డబుల్‌ డెక్‌లు!
Hyderabad Metro

  • మెట్రో రెండో దశ నిర్మాణ పనుల్లో అనేక సవాళ్లు..

  • 3.25 కిమీల మేర అండర్‌ గ్రౌండ్‌లో రైలు మార్గం

  • 1.2 కిమీల మేర డబుల్‌ డెక్‌..

  • మొదటి ఎలివేటెడ్‌లో ఫ్లైఓవర్‌,

  • రెండో దానిలో మెట్రో కారిడార్‌

  • ఆరు ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్‌లు దాటాల్సిన పరిస్థితి

  • పనులు పూర్తికి వివిధ శాఖల అనుమతులు, సమన్వయం తప్పనిసరి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో త్వరలో చేపట్టనున్న మెట్రో రెండో దశ నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. మొదటి దశ పనులతో పోలిస్తే రెండో దశ కారిడార్ల నిర్మాణం కాస్త క్లిష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ ప్రకారం రెండో దశ మార్గాల్లో భూగర్భ లైన్లు, డబుల్‌ డెక్‌ నిర్మాణం వంటివి ఉన్నాయి. అలాగే పలు చోట్ల సాధారణ రైల్వే క్రాసింగ్‌లు దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత కారిడార్లలో భూసేకరణతోపాటు వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకుని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాల్సిన పరిస్థితి.


కాగా, ఎల్‌ అండ్‌ టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వెంటనే రెండో దశ పనులకు కేంద్రం అనుమతి ఇవ్వనుందని సమాచారం. దీంతో టేకోవర్‌కు కావాల్సిన రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మెట్రో రెండో దశలో 122.9 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 7 కారిడార్లలో 86 స్టేషన్లను ప్రతిపాదించారు. ఫస్ట్‌ఫేజ్‌లో ఇప్పటికే 57 స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ పూర్తయితే హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థలోని స్టేషన్ల సంఖ్య 143కి చేరనుంది.


3.25 కిలోమీటర్లలో అండర్‌ గ్రౌండ్‌ మెట్రో!

ప్రతిపాదిత రెండో దశ పనుల్లో కారిడార్‌-4 నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అతిపెద్ద కారిడార్‌. ఈ మార్గంలో 36.8 కి.మీల మేర 24 స్టేషన్లు రానున్నాయి. ఎయిర్‌పోర్టుకు సుమారు 5-6 కిమీల దూరంలో నాగోల్‌ నుంచి వస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ను భూమి మీదకు (ఎట్‌ గ్రేడ్‌)కు దించి అక్కడ కట్‌ అండ్‌ కవర్‌ (భూమిని కాలువగా తవ్వి కప్పడం) విధానంలో అండర్‌గ్రౌండ్‌ మెట్రోను నిర్మించనున్నారు. 1.6 కిమీల భూగర్భ మెట్రోలో భాగంగా 20 మీటర్ల లోతులో భూమిని తవ్వనున్నారు. అక్కడి నుంచి ట్రాక్‌ను ఎయిర్‌పోర్టు టర్మినల్‌ స్టేషన్‌కి తీసుకెళ్లి కారిడార్‌ను ఫ్లాట్‌ఫాం టు ఫ్లాట్‌ఫాం డిజైన్‌లో నిర్మించేలా ప్రతిపాదించారు. మరోపక్క, కారిడార్‌-9 జేబీఎస్‌ నుంచి శామీర్‌ పేట్‌లో హకీంపేట విమానాశ్రయం వద్ద రన్‌వేకి ఇబ్బందులు ఉండకుండా హెచ్‌ఎండీఏ ప్రతిపాదిత టన్నెల్‌ వెంబడి అండర్‌గ్రౌండ్‌లో 1.65 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. అయితే ఇక్కడ ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది.


రైల్వే క్రాసింగులు దాటాల్సిన పరిస్థితి..!

రెండో దశలోని ఓల్డ్‌సిటీ కారిడార్‌ను 7.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఇందులో చాంద్రాయణగుట్టకు చేరుకోకముందే ఫలక్‌నుమా వద్ద సాధారణ రైల్వే క్రాసింగ్‌ను దాటాల్సి ఉంది. అలాగే నాగోల్‌-ఎయిర్‌పోర్టు కారిడార్‌లో ఆరాంఘర్‌, శంషాబాద్‌ వద్ద, జేబీఎ్‌స-మేడ్చల్‌లో నిర్మిస్తున్న 24.5 కిలోమీటర్ల మార్గంలో గుండ్ల పోచంపల్లి, సుచిత్ర, లోతుకుంట, అల్వాల్‌ వద్ద కూడా రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. మొత్తం ఆరు ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్‌లు ఉండగా ఆ శాఖతో సమన్వయం తప్పనిసరి.


కిలోమీటర్లలో డబుల్‌ డెక్‌ నిర్మాణం!

కారిడార్‌-7 కింద 13.4 కిలోమీటర్ల మేర మియాపూర్‌-పటాన్‌చెరు మార్గాన్ని నిర్మించనున్నారు. మియాపూర్‌ దాటిన తర్వాత మియాపూర్‌ క్రాస్‌రోడ్డు, ఆల్విన్‌ క్రాస్‌రోడ్డు, మదీనాగూడ, చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌, జ్యోతినగర్‌, బీరంగూడ, ఆర్‌సీపురం, ఇక్రిశాట్‌, పటాన్‌చెరు వద్ద స్టేషన్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా మదీనాగూడ-చందానగర్‌ మధ్య 1.2 కిలోమీటర్లలో డబుల్‌ డెక్‌ చేపట్టనున్నారు. మొదటి ఎలివేటెడ్‌లో ఫ్లై ఓవర్‌, రెండో ఎలివేటెడ్‌లో మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు. అయితే ఇక్కడ 10 కిలోమీటర్ల మార్గంలో మినిస్ర్టీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ అనుమతి పొందాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పంటలను కాపాడిన వాన

కాంగ్రెస్‌ను వీడేది లేదు
Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 04:11 AM