Share News

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి ధాన్యాల మార్కెట్ ఉంటే మంచిది: పుతిన్

ABN , Publish Date - Sep 13 , 2026 | 06:40 PM

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి ధాన్యాల మార్కెట్‌తో పాటు కొత్త ఇన్సూరెన్స్ మెకానిజం ఉంటే బాగుంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్రిక్ సభ్య దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారం ఉండాలని ఆయన సూచించారు.

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి ధాన్యాల మార్కెట్ ఉంటే మంచిది: పుతిన్

ఇంటర్‌నెట్ డెస్క్: బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి ధాన్యాల మార్కెట్‌తో పాటు కొత్త ఇన్సూరెన్స్ మెకానిజం ఉంటే బాగుంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్రిక్ సభ్య దేశాల మధ్య బలమైన ఆర్థిక సహకారం ఉండాలని ఆయన సూచించారు. 18వ బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిర్గతంగా ఆర్థిక ఒత్తిడి ఉన్నా.. క్యాపిటల్, లేబర్, టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకొనే శక్తిసామర్థ్యాలు బ్రిక్స్ సభ్య దేశాలకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాను ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ మెకానిజం రష్యాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ‘‘పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఇంధన ఎగుమతులపై బాగా ప్రభావం పడింది. రష్యా చమురును రవాణా చేసే నౌకలకు బీమా సదుపాయం కల్పించకుండా వెస్టర్న్ కంపెనీలను జీ7, యూరోపియన్ యూనియన్, యూకే అడ్డుకున్నాయి’’ అని పుతిన్ పేర్కొన్నారు.


న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పనితీరు అద్భుతం

బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉందని పుతిన్ ప్రశంసించారు. 140 బిలియన్ డాలర్ల (రూ.13 లక్షల కోట్లు) విలువైన ప్రాజెక్టులను ఆ బ్యాంకు సమర్థంగా నిర్వహిస్తున్నదని కొనియాడారు. ఇక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని బ్రిక్స్‌ దేశాలతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలను కూడా ఆయన కోరారు. భద్రతా ముప్పులను సమిష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ సమావేశాల్లో పెరుగుతున్న దేశాల భాగస్వామ్యం ఈ కూటమిపై అంతర్జాతీయ ఆసక్తి పెరుగుతోందనడానికి నిదర్శనమని పుతిన్ పేర్కొన్నారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, సమిష్టిగా సమస్యలను పరిష్కరించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని సూత్రాలను పాటించడం వంటి అంశాలకు బ్రిక్స్ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ

Updated Date - Sep 13 , 2026 | 06:41 PM