ఇంజినీరింగ్ సీట్లు.. బై వన్ గెట్ వన్!
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:50 AM
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలోనే 22,972 సీట్లు మిగిలిపోగా, మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ)లోనూ సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ సీట్లకు డిమాండ్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.
ఐదు సీట్లు అమ్మితే రెండు సీట్లు ఉచితం..
అమ్మిపెట్టాలంటూ కన్సల్టెంట్లకు పిలుపు
కాలేజీల యాజమాన్యాల ఆఫర్లు
కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లు 22972
మేనేజ్‌మెంట్ కోటాలోనూ భారీగా మిగులు
నేటి నుంచి మూడోదశ కౌన్సెలింగ్
2 వరకు వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలోనే 22,972 సీట్లు మిగిలిపోగా, మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ)లోనూ సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ సీట్లకు డిమాండ్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, శుక్రవారం నుంచి మూడో (తుది)విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటాలో మొత్తం 94,424 సీట్లు ఉండగా, రెండోదశ కౌన్సెలింగ్ తర్వాత కేవలం 71,452 మంది కళాశాలల్లో రిపోర్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ ధ్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తి చేయించుకోని అభ్యర్థులు 31న (శుక్రవారం) స్లాట్ బుక్ చేసుకొని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే, మూడోదశలో కాలేజీ లేదా బ్రాంచ్ మార్చుకోవాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని పేర్కొన్నారు. తుదివిడత సీట్ల కేటాయింపును 5వ తేదీలోగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
బీ కేటగిరీలో భర్తీకాక బెంబేలు..
కన్వీనర్ కోటాలోనే భారీగా సీట్లు మిగిలిపోవడం, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు భర్తీ కాకపోవడంతో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. రెండోదశలో సీట్ల పెంపునకు అనుమతి తెచ్చుకున్న కాలేజీలన్నీ ఎలాగోలా సీట్లను భర్తీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కొన్ని పేరున్న కాలేజీలు కన్సల్టెంట్లను తమ మెయిన్ గేటును కూడా తాకనీయని పరిస్థితి ఉండగా, ప్రస్తుతం కన్సల్టెంట్లూ రారండహో.. అంటూ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. తమ కాలేజీల్లో సీట్లు మిగిలిపోకుండా ఎలాగోలా అమ్మిపెట్టాలని, ఆ మేరకు భారీగా కమిషన్ ముట్టజెబుతామంటూ బతిమిలాడుకుంటున్నాయి. కండ్లకోయ, మైసమ్మగూడ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐదు సీట్లు అమ్మితే రెండు సీట్లు ఉచితంగా ఇస్తామంటున్నాయి. ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లోని కాలేజీల్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజాంపేట్, బాచుపల్లి, ఘటకేసర్ గండిపేట్, మొయినాబాద్, షేక్‌పేట్, వట్టినాగులపల్లి ప్రాంతాల్లోని కాలేజీల్లో మిగిలి పోయిన బీ కేటగిరీ సీట్లను అమ్మిపెట్టమంటూ ఒక్కొక్క కన్సల్టెంట్‌కు 10 నుంచి 20 సీట్ల చొప్పున అప్పగిస్తున్నాయి.
ఇవీ చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు