Share News

ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా.. ఉద్యోగులను కష్టపెట్టట్లేదు

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:27 AM

ఆర్థిక పరమైన కష్టాలున్నా.. ఉద్యోగులపై దాని ప్రభావం పడకుండా, వారిని కష్ట పెట్టకుండా తమ ప్రభుత్వం చూస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ప్రభుత్వం  కష్టాల్లో ఉన్నా.. ఉద్యోగులను కష్టపెట్టట్లేదు
Bhatti Vikramarka

  • కేసీఆర్‌ సర్కారు దివాలా భరిస్తున్నాం..

  • గత ప్రభుత్వం 15 వరకూ వేతనాలివ్వలేదు

  • మా హయాంలో ఒకటో తేదీనే వేతనాల చెల్లింపు

  • పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు వెయ్యి కోట్లకు పెంపు

  • ఎస్‌టీఎఫ్‌ విద్యా సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక పరమైన కష్టాలున్నా.. ఉద్యోగులపై దాని ప్రభావం పడకుండా, వారిని కష్ట పెట్టకుండా తమ ప్రభుత్వం చూస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత సర్కారు హయాంలో 15వ తేదీకి కూడా సిబ్బందికి వేతనాలు అందని పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్ర ఖజానాకు కేసీఆర్‌ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పులతో తీసుకొచ్చిన దివాళాను తమ సర్కారు భరిస్తోందన్నారు. అయినా తాము సుమారు రూ.6,500 కోట్ల రుణ చెల్లింపులు చేస్తూనే ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఖైరతాబాద్‌లోని ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ భవన్‌లో ఆదివారం స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌టీఎఫ్‌) మహాసభలను ముఖ్య అతిథిగా ఆయన ప్రారంభిస్తూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక డిమాండ్‌ అయిన క్యాష్‌లెస్‌ హెల్త్‌కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.


గతంలో పేరుకుపోయిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు దశల వారీగా పెంచుతూ ప్రస్తుతం నెలకు రూ.750 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ చెల్లిస్తున్నామన్నారు. విద్యాబోధనతోపాటు విద్యార్థులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర సాయం వారి కుటుంబాలకు చేరేలా సలహాలు, సూచనలివ్వాలని భట్టి చెప్పారు. గతంలో ఎస్‌టీఎఫ్‌ ఏర్పాటుకూ ఇదే సామాజిక దృక్పథం పునాదిగా నిలిచిందని గుర్తుచేశారు. విద్యాబోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల కుటుంబాలకు, సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా కొనసాగాలన్న ఆశయంతో దివంగత సీఎం వైఎస్‌ హయాంలో ఆవిర్భవించిన ఎస్‌టీఎఫ్‌.. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక బాధ్యతను స్వీకరించాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచనల ఫలితంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని భట్టి వెల్లడించారు.


ప్రపంచంతో పోటీ పడే విధంగా రాష్ట్ర యువతను తీర్చి దిద్దడానికి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామన్న భట్టి.. వేలాది మంది ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల కల్పనతోపాటు సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా రంగ అభివృద్ధికి అసెంబ్లీ సెగ్మెంట్‌కో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌తోపాటు సెమీ రెసిడెన్షియల్‌ విధానంలో 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లకు అనుమతినిచ్చామని చెప్పారు. ఈ సభకు ఎస్‌టీఎఫ్‌ అధ్యక్షుడు దేవరకొండ సైదులు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి పోచయ్య, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి, విద్యా కమిషన్‌ సభ్యులు ప్రొ.విశ్వేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.


రిసోర్స్‌ పర్సన్ల రసాభాస

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్లిపోగానే సదస్సులో పాల్గొన్న క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్లు (సీఆర్‌పీ) రసాభాస చేశారు. తమకు సదస్సులో ప్రాధాన్యం ఇవ్వలేదని, డిప్యూటీ సీఎం తమ సమస్యలను లేవనెత్తలేదని, తమ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మధ్యలోనే బయటకెళ్లిపోయారు. నిర్వాహకులు నచ్చ చెప్పినా వినకపోవడంతో సదస్సును అర్ధంతరంగా నిలిపేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సీఆర్‌పీలు తమకు న్యాయం జరుగలేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 05:28 AM