రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:10 AM
రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. రోజురోజుకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. వచ్చే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 12.5-15 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ
పటాన్‌చెరులో12.4 డిగ్రీల ఉష్ణోగ్రత
గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పెరిగిన చలి
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. రోజురోజుకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. వచ్చే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 12.5-15 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చలి తీవ్రతకు సంబంధించి అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 12.4 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 12.5, నిర్మల్ జిల్లా కుబేర్ మండల కేంద్రంలో 14.6, వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బషీరాబాద్, యాలాల్, మోమిన్‌పేటల్లో 14.7, రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో 14.8, మేడ్చల్-మల్కాజిగిరిలోని శామీర్‌పేటలో 15.1, హైదరాబాద్‌లోని దుండిగల్‌లో 15.9, బేగంపేటలో 16.2, హకీంపేట, హాయత్‌నగర్‌లలో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే చలి తీవ్రత పెరగలేదని తెలుస్తోంది.
నిరుడు ఇదే రోజు రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 10.4 డిగ్రీలుగా రికార్డు కావడం గమనార్హం. సోమవారం రాత్రి 25 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులను రాత్రి వేళ వీస్తున్న చలి గాలులు వణికిస్తున్నాయి. దీంతో వాకింగ్, దూర ప్రాంతాలకెళ్లే ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. క్యూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున కురుస్తున్న పొగ మంచుతోపాటు రోడ్లను కప్పేస్తున్న మంచు దుప్పటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6-8 కి.మీ వేగంతో వీస్తాయని వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుండగా, గరిష్టంగా 30-32 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి చలి ఉధృతి పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News