Share News

మగపిల్లలనూ కాటేస్తున్నారు!

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:24 AM

ఇంట్లో, బడిలో ఎప్పుడూ చలాకీగా ఉండే అబ్బాయి భయం భయంగా ఉంటున్నాడా? పలకరించినా మాట్లాడడం లేదా? అయితే, నిర్లక్ష్యం చేయొద్దు! బాలుడు లైంగిక వేధింపుల బాధితుడై ఉండొచ్చు! కన్నవారికి చెబితే ఏమనుకుంటారోనన్న భయంతోనో..

మగపిల్లలనూ కాటేస్తున్నారు!

  • రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచార కేసులు

  • నిరుడు 61.. ఈ ఏడాది ఇప్పటికే 74 నిందితుల్లో తెలిసినవారే ఎక్కువ

  • గరిష్ఠంగా జీవిత ఖైదు పడే అవకాశం

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో, బడిలో ఎప్పుడూ చలాకీగా ఉండే అబ్బాయి భయం భయంగా ఉంటున్నాడా? పలకరించినా మాట్లాడడం లేదా? అయితే, నిర్లక్ష్యం చేయొద్దు! బాలుడు లైంగిక వేధింపుల బాధితుడై ఉండొచ్చు! కన్నవారికి చెబితే ఏమనుకుంటారోనన్న భయంతోనో.. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులు బెదిరించడంతోనో బాబు ఆ దాష్టీకాన్ని మౌనంగా భరిస్తూ ఉండి ఉండొచ్చు! మగపిల్లలపైనా లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆ దుర్మార్గానికి ఒడిగడుతున్నవారిలో పిల్లలకు తెలిసినవారే ఎక్కువ మంది ఉంటున్నారు. బంధువులో, పరిచయస్తులో, స్కూల్‌ సిబ్బందో.. ఇరుగుపొరుగు వాళ్లో ఉంటున్నారు.


గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మగపిల్లలపై అత్యాచారాలకు సంబంధించి 61 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నవంబరు 25వరకే 74 కేసులు నమోదయ్యాయని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఎక్కువగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నిరుడు హైదరాబాద్‌ పరిధిలో 24 కేసులు, ఖమ్మం జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే హైదరాబాద్‌ పరిధిలో 27 కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌లో 9, నిర్మల్‌ 3, కరీంనగర్‌ 3, వరంగల్‌లో 4 కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒంటరిగా ఉండే పిల్లలను దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.


మునుపు తమ పిల్లాడిపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు వెనుకాడేవారని, పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరగడం, పోక్సో చట్టాల గురించి అవగాహన పెరగడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్నారు. 61శాతం కేసుల్లో తెలిసినవాళ్లే అఘాయిత్యానికి ఒడిగడుతున్నారని పోలీసులు చెప్పారు. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూద్దామని పిలవడమో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆశ చూపించడమో, డబ్బులు ఇస్తానని చెప్పడమో, ఆట వస్తువులు కొనిస్తామని ఆశ పెట్టడమో చేసి దారుణానికి ఒడిగడుతున్నారని చెబుతున్నారు. పైగా.. ‘అమ్మనాన్నకు చెప్పావో నీకే ఇబ్బంది.. తిడతారు జాగ్రత్త’ అంటూ పిల్లలను నిందితులు భయపెడుతున్నారని తేలింది. బాధితుల్లో ఎక్కువమంది వెంటనే తల్లిదండ్రులకు చెబుతున్నారని, కొందరు మౌనంగా భరిస్తుండటంతో వారు పదేపదే దారుణాల బారినపడుతున్నారని.. ఇలాంటి పిల్లల్లో భయాన్నే దుండగులు అలుసుగా తీసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.


ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాక బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి తమ బాల్యాన్ని ఎప్పటిలాగే సాధారణంగా గడిపేలా చేస్తున్నామని అధికారులు చెప్పారు. అపరిచితులతో మాట్లాడవద్దని చెబితే సరిపోదని.. తెలిసినవారెవరైనా కూడా అసహజంగా, అసభ్యంగా ప్రవర్తించినా తమకు చెప్పాలని పిల్లలకు తల్లిదండ్రులు నూరిపోయాలని పోలీసులు సూచిస్తున్నారు. పాఠశాలల్లో పోలీసు శాఖ గుడ్‌ టచ్‌-బాడ్‌ టచ్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. మైనర్లలో ఎవరిపైనైనా లైంగిక దాడి జరిగినా పోక్సో కేసు నమోదు చేస్తామని చెప్పారు.


బాధితులు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పోక్సో చట్టం ఒకేలా వర్తిస్తుందని.. దోషులకు శిక్షల్లో తేడా ఉండదని.. ఇలాంటి నేరాల్లో పదేళ్ల జైలు నుంచి గరిష్ఠంగా జీవతఖైదు దాకా శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పోక్సో కేసులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పనిచేస్తున్నప్పటికీ శిక్షలు పడటానికి రెండేళ్ల నుంచి ఆరేళ్ల సమయం పడుతుండటం బాధితుల్లో అసహనానికి కారణమవుతోంది. తెలంగాణలో 2016 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు 31,516 పోక్సో కేసులు నమోదు కాగా, అందులో సగానికి పైగా విచారణ దశలో ఉన్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఇటీవల తీర్పుల్లో కొన్ని..

2024లో పహాడీషరీ‌ఫ్‌లో పదమూడేళ్ల బాలుడిపై మదర్సా ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది సెప్టెంబరులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు వెలువరించింది. దోషికి జీవిత ఖైదు, రూ.2లక్షల జరిమానా విధించింది. పాతబస్తీలోనే మరో ఘటనలో 11ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేశాడో మదర్సా టీచర్‌. ఈ కేసుకు సంబంధించి గత జూలైలో తీర్పు వెలువడింది. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2023లో కామాటిపురాలో పదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కోర్టు దోషిగా తేల్చి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మైలార్‌దేవులపల్లిలో పదేళ్ల బాలుడిపై పక్కంటి వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈనెలలోనే కోర్టు తీర్పు వెలువరించింది. దోషికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా విధించింది. చందానగర్‌లో నాలుగేళ్ల బాలుడిపై స్కూల్‌ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి ఒడిగట్టాడు. గత జూలైలో కోర్టు దోషికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 30 , 2026 | 03:35 AM