Share News

Telangana BJP: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీజీ బీజేపీ

ABN , Publish Date - Jan 16 , 2026 | 07:15 PM

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశించినా.. మూడు నెలల గడువులోగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

Telangana BJP: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీజీ బీజేపీ
Telangana BJP

ఢిల్లీ, జనవరి16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు మరో కీలక దశకు చేరుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ(Telangana BJP) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ.. తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.


మూడు నెలల్లో నిర్ణయం..

పార్టీ ఫిరాయింపుల అంశంపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఆదేశించింది. అయితే.. నిర్ణీత గడువు ముగిసినా ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇది న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ తన పిటిషన్‌లో స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడమే కాకుండా.. కావాలనే తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ(Contempt of Court) కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు.


పిటిషన్‌లోని అంశాలు

కోర్టు ఆదేశాలు అమలు జరగలేదని... ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం, పార్టీ ఫిరాయింపులను చట్టబద్ధం చేసే పరిస్థితి వంటివి ఉన్నాయని పిటీషన్‌లో ప్రస్తావించింది బీజేపీ. ఈ పిటిషన్‌లో మరో కీలక అంశాన్ని కూడా చేరుస్తూ.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను పొందుపరిచింది. దానం నాగేందర్ తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారలేదని మీడియాలో వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పష్టత లేకపోవడాన్ని స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతోందో చూపిస్తున్నాయని బీజేపీ వాదిస్తోంది.

అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలా నిర్ణయాన్ని స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం పడుతుందని అందుకే స్పీకర్ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు ఏలేటి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది.


ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం

పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని, రాజ్యాంగ విరుద్ధ పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు ఏలేటి. ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఎలాంటి పరిణామాలు ఉండవనే భావన పెరుగుతుందని బీజేపీ తన పిటిషన్‌లో రాసుకొచ్చింది.


సుప్రీంకోర్టు స్పందనపై ఉత్కంఠ..

ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా? స్పీకర్‌కు నోటీసులు జారీ అవుతాయా?ఈ నిర్ణయానికి స్పష్టమైన గడువు విధిస్తుందా?. అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. కోర్టు ఆదేశాల ఉల్లంఘన రుజువైతే స్పీకర్‌ న్యాయస్థానానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

బీజేపీ వ్యూహాత్మక అడుగుగా..

ఈ పిటిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంగా రాజ్యాంగ సంస్థల బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నంగా పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో చర్చించే చర్యగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా ఉంది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


ఇవి కూడా చదవండి...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల

కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 08:04 PM