Share News

బకాయి శ్రీ!

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:03 AM

రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాస్పత్రులను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రెగ్యులర్‌గా వచ్చే నిధులు ఆగిపోవడంతో పాటు ఆరోగ్యశ్రీ నిధులు కూడా బంద్‌ కావడంతో శస్త్రచికిత్సలు నిలిచిపోతున్నాయి.

బకాయి శ్రీ!
Telangana Aarogyasri Dues

  • బోధనాస్పత్రులకు మూడేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధుల బంద్‌

  • పెండింగ్‌లో రూ.800 కోట్ల మేర బకాయిలు

  • ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌లకే రూ.266 కోట్లు

  • రెగ్యులర్‌గా వచ్చే నిధులూ లేవు.. నిర్వహణ భారం

  • ఔషధాలు, సర్జికల్స్‌ నిలిపివేత.. సర్జరీలు బంద్‌

  • రోజువారీ ఖర్చులకు సూపరింటెండెంట్ల గోస

  • ఉస్మానియాలో పాడైపోయిన వెంటిలేటర్లు..

  • మరమ్మతులకు నిధుల్లేక మూలన

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాస్పత్రులను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రెగ్యులర్‌గా వచ్చే నిధులు ఆగిపోవడంతో పాటు ఆరోగ్యశ్రీ నిధులు కూడా బంద్‌ కావడంతో శస్త్రచికిత్సలు నిలిచిపోతున్నాయి. బోధనాస్పత్రులకు గత మూడేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు నిలిచిపోయాయి. బోధనాస్పత్రుల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయడం లేదు. ఆస్పత్రుల సూపరింటిండెంట్లు రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని 35 బోధనాస్పత్రులు, మరో 12 ఆస్పత్రులున్నాయి. టీవీవీపీలో పరిఽధిలో 180కు పైగా ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలు, శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కింద నిధులొస్తాయి. గత మూడేళ్లుగా ఇవి పెండింగ్‌లో ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకు కలపి సుమారు రూ. 800 కోట్ల పైచిలుకు బకాయిలున్నట్లు సమాచారం. ఒక్క ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి రూ.173.80 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో రూ.54 కోట్లు, నిలోఫర్‌లో రూ.40 కోట్లు, సరోజిని కంటి ఆస్పత్రిలో రూ. 14 కోట్లు, ఈఎన్‌టీ ఆస్పత్రిలో రూ.11 కోట్ల మేర ఆరోగ్య శ్రీ బకాయిలున్నాయి. జిల్లాల్లో మహబూబ్‌నగర్‌ బోధనాస్పత్రికి రూ. 10 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా బోధనాస్పత్రుల్లో సగటున రూ. 10-12 కోట్ల మేర బకాయిలుండగా, టీవీవీపీ ఆస్పత్రుల్లోనూ సగటున రూ.2-4 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి ఆస్పత్రికి రూ.3 కోట్ల మేర, కింగ్‌కోఠీ ఆస్పత్రికి రూ.4.6 కోట్ల మేర, బాన్సువాడ ఆస్పత్రికి రూ. 2.5 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.


వీటితో పాటు పాత ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు కూడా సెప్టెంబరు చివరి నాటికి లెక్కిస్తే రూ.76.67 కోట్లుగా తేలాయి. ప్రైవేటు ఆస్పత్రులకు ఈహెచ్‌ఎస్ బకాయిలు రూ.23.85 కోట్లున్నాయి. బోధనాస్పత్రులకు దీర్ఘకాలంగా నిధులు పెండింగ్‌లో పెట్టడంతో ఆ ఆస్పత్రులకు ఇప్లాంట్స్‌, సర్జికల్‌ ఐటమ్స్‌ సరఫరాను నిలిపివేశారు. ఆర్థో ఇంప్లాంట్స్‌ను నిలిపివేయడంతో చాలా బోధనాస్పత్రుల్లో ఆర్థో సర్జరీలు నిలిచిపోయాయి. గాంధీలాంటి చోట్ల యూరాలజీ, కార్డియాలజీ సర్జరీలు కూడా నిలిచిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు.


Untitled-1 copy.jpgరూ.200 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ ఉపయోగమేది?

కొద్ది రోజుల క్రితం ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి రూ.200 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు కేవలం ఆస్పత్రుల్లో పరికరాల కొనుగోలు కోసమేనని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఏ ఆస్పత్రి ఏయే పరికరాలు కొనుగోలు చేయాలనేదీ శాఖే నిర్ణయించింది. ఆ ప్రకారమే పరికరాలను సమకూర్చుకోవాలని.. అది కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగాలని మెలికపెట్టింది. ప్రతి ఆస్పత్రికి హాస్పిటల్‌ డెవలె్‌పమెంట్‌ సొసైటీ (హెచ్‌డీఎస్) ఉంటుంది. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయి. నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకోసారి హెచ్‌డీఎ్‌స సమావేశం ఏర్పాటు చేసి, ఆస్పత్రుల్లో కల్పించే సౌకర్యాలు, అవసరమైన పరికరాల కొనుగోలు వంటివాటిపై నిర్ణయం తీసుకుంటారు.


అయితే ఈ భేటీల్లో తీసుకునే నిర్ణయాలు అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. తాజాగా ప్రతి ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రివాల్వింగ్‌ ఫండ్‌ కింద కొనుగోలు చేయాల్సిన పరికరాల కొనుగోళ్ల విషయాన్ని జిల్లా కలెక్టర్లు పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఫలితంగా రివాల్వింగ్‌ ఫండ్‌ వచ్చినా.. ఉపయోగం లేకుండాపోయిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని సర్కారు దవాఖానాలకు రావాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేసి, రోగుల శస్త్రచికిత్సలు, వైద్యసేవలకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


ఆరోగ్యశ్రీకి, సర్జికల్స్‌ కొరతకు ఏం సంబంధం?

వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రులకు మాదిరిగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద జరిగే శస్త్రచికిత్సలకు, ఇతర వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కింద బిల్లులు చెల్లించాలి. ఉదాహరణకు ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ స్టోన్‌ ప్యాకేజీ కింద రూ.40 వేలు చెల్లిస్తే.. సర్కారు దవాఖానాల్లో చేసే వాటికి కూడా అంతే మొత్తం చెల్లించాలన్న నిబంధన ఉంది. ఈ రూ.40 వేలలో 20 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ కింద ఆరోగ్యశ్రీ ట్రస్టే తన దగ్గర పెట్టుకుంటుంది. మిగిలిన దాంట్లో 35 శాతం సర్జరీ చేసిన వైద్య బృందం, అందులో పాల్గొన్న వారికి ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. మిగిలిన 45 శాతం మొత్తాన్ని హాస్పిటల్‌ డెవలెప్‌మెంట్‌ ఫండ్‌ (హెచ్‌డీఎఫ్) కింద జమ చేస్తారు.


ఎక్కడైతే శస్త్రచికిత్స చేస్తారో ఆ దవాఖానా బ్యాంకు ఖాతాకు హెచ్‌డీఎఫ్ ఫండ్‌ జమ చేస్తారు. బోధనాస్పత్రుల్లో గత రెండేళ్లుగా సర్జరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఆర్థోకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆరోగ్య శ్రీ నిధులు విడుదల ద్వారా వచ్చే హెచ్‌డీఎఫ్ ఫండ్‌తో శస్త్రచికిత్సలకు అవసరమయ్యే ఇంప్లాంట్స్‌, సర్జికల్స్‌ను ఆస్పత్రుల సూపరింటిండెంట్లే కొనుగోలు చేస్తుంటారు. హెచ్‌డీఎఫ్ నిధులు లేకపోవడంతో సర్జికల్స్‌ కొనుగోళ్లు, యంత్ర పరికరాల మరమ్మతులు కూడా ఆగిపోతున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిల్లో వెంటిలేటర్లు రిపేరుకొచ్చాయి. వాటిని బాగు చేసుకోవాలన్నా కూడా నిధులు లేక పక్కనపెట్టేశారు. కొన్ని ఆస్పత్రుల్లో సీటీస్కాన్స్‌ ఇతర యంత్రాల రిపేర్లు, మరుగుదొడ్ల నిర్మాణం, రోగ నిర్ధారణకు అవసరమైన రీయెజెంట్స్‌, గ్లౌజుల వంటి కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 03:15 AM