500 ఉన్నత పాఠశాలల్లో 11, 12వ తరగతులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:00 AM
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ దిశగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
కాలేజీలు దూరంగా ఉన్న పాఠశాలల్లో 12వ తరగతి తప్పనిసరి
విద్యాశాఖ అధికారుల భేటీలో నిర్ణయం
హైస్కూళ్లు.. హయ్యర్ సెకండరీ స్కూళ్లుగా ఉన్నతీకరణ
వచ్చే ఏడాది నుంచి అమల్లోకి
పరీక్షల నిర్వహణకు కొనసాగనున్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డులు
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ దిశగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పాఠశాల విద్య పూర్తయ్యాక ఇంటర్ కాలేజీలు దూరంగా ఉండటం కూడా డ్రాపవుట్లకు ప్రధాన కారణమని విద్యాశాఖ జరిపిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో కాలేజీలు దూరంగా ఉన్న కనీసం 500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరిగా 12వ తరగతి ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో శుక్రవారం విద్యాశాఖ సలహాదారు కే.కేశవరావు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ విద్య, పాఠశాల విద్య కార్యదర్శులు అభిలాష, నవీన్ నికోలస్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్న ఉన్నత పాఠశాలను 12వ తరగతి వరకు ఎలా కొనసాగించాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాంఘీక సంక్షేమ గురుకులాల్లో ఇప్పటికే 12వ తరగతి వరకు విద్య కొనసాగుతోంది. దీంతో అవి యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అంశంపైనే చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో 96 కాలేజీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల క్యాంప్‌సలోనే కొనసాగనున్నాయి. 260 కాలేజీలు ఉన్నత పాఠశాలలకు 1 కి.మీ. పరిధిలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ రెండు చోట్ల ఉన్న కాలేజీలు వచ్చే ఏడాది నుంచి హయ్యర్ సెకండరీ స్కూళ్లుగా మారనున్నాయి. ఇతర కాలేజీల విషయంలోనూ త్వరలో స్పష్టత రానుంది.
పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు కార్యదర్శుల స్థానంలో విలీనం తర్వాత ఒక్కరే ఉంటారు. అయితే 10, 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ కోసం పదోతరగతి, ఇంటర్ బోర్డులు యధావిధిగా కొనసాగనున్నాయి. ఇంటర్ బోర్డు (టీజీబీఐఈ) స్వతంత్ర సంస్థగా ఉంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్ పరీక్షల విధివిధానాలు, పరీక్షల నిర్వహణ, కాలేజీలకు అనుబంధ గుర్తింపులను బోర్డు చూస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్య పాఠశాల విద్యలో విలీనం అయ్యాక స్వల్ప మార్పులతో ఇదే విధానంలో బోర్డును కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డులో మొత్తం 255 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 145 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు. వీరి సీనియారిటీ, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News