22-A నిషేధిత భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:48 PM
22-ఎ నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో పలు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన మంత్రి.. 22-ఎ భూ సమస్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 12: 22-ఎ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. కాగా.. నిషేధిత భూముల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
‘22-ఎ నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. 22-ఎ దరఖాస్తులన్నీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు. పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేది లేదు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు ప్రత్యేక చొరవ చూపాలి. ప్రతి వారం 22-ఎ భూ సమస్యలపై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. పరిష్కారం కాని సమస్యలను ఉన్నతస్థాయి కమిటీకి పంపాలి. యూఎల్‌సీ సమస్యలపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలి. జీవో 59, 76, 118 అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాంతోపాటు.. 22-ఎ జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు చర్యలు చేపట్టండి. వాటికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. అర్హులైన భూ యజమానులకు త్వరితగతిన న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. అయితే.. ప్రభుత్వ భూముల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించండి’ అని మంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు
తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి
పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News