Supreme Court: రిట్ పిటిషన్ వెనక్కి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:33 AM
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జలవివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున.. ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్‌గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై.. సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం
సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం
త్వరలో దాఖలు చేస్తామన్న రాష్ట్ర సర్కార్
నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం
మార్గదర్శకాలన్నీ ఉల్లంఘించిన ఏపీ: ఉత్తమ్
నేడు అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ఎలా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉపసంహరించుకుంది. ఈ జలవివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున.. ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్‌గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చెప్పగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. 1979-80లో గోదావరి నదీ జలవివాదాల ట్రైబ్యునల్ ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ పోలవరం ప్రాజెక్టుకు గోదావరి జలాల్లో 484.5 టీఎంసీల మేరకే అనుమతించిందని తెలిపారు. వరద జలాల పేరుతో ఈ ప్రాజెక్టు నుంచి ఏమాత్రం అదనంగా నీటిని మళ్లించినా, ఉపయోగించినా అది ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ఏపీ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని చెప్పారు.
దీనివల్ల తెలంగాణ వాటాకు నష్టం కలుగుతుందన్నారు. అంతేకాకుండా ఏపీ విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డులు, జలశక్తి మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి తగిన అనుమతులు పొందాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ, వీటన్నింటినీ ఏపీ ఉల్లంఘించిందని తెలిపారు. విభజన చట్టం సెక్షన్ 90(1), (4) ప్రకారం తగిన అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే సరైన అథారిటీ అని అభిషేక్ సింఘ్వీ.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సవరణలు చేసే అధికారం ఏపీకి ఏమాత్రమూ లేదన్నారు. 2019లో జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అమలుకు నిర్ణయించిన సాధారణ నిబంధనల్ని కూడా ఉల్లంఘించారని సింఘ్వీ తెలిపారు.
కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా బోర్డులు, జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ఏపీ ఏకపక్ష చర్యను తీవ్రంగా విమర్శించాయని గుర్తు చేశారు. నిజానికి సివిల్ సూట్ ద్వారా ఈ జలవివాదాన్ని పరిష్కరించాలన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కానీ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం కూడా ఈ రిట్ పిటిషన్‌ను విచారించవచ్చునని వాదించారు. ముళ్ల పెరియార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో పేర్కొన్నట్లుగా.. ఇది జలవివాదం కాదని, చట్టాల ఉల్లంఘన అయినందున ఈ పిటిషన్‌ను విచారించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకపక్షంగా నదీ జలాల మళ్లింపుపై ఆర్టికల్ 32 ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని ఒడిసాకు సంబంధించిన కేసులో కూడా అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ఏకపక్షంగా పోలవరం-నల్లమల సాగర్ నిర్మాణం జరపకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ ఉల్లంఘన జలవివాదం కిందకు వస్తుందని, మహారాష్ట్ర, కర్ణాటకతో కూడా దీనికి సంబంధం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
అన్ని స్థాయిల్లో పోరాడతాం: ఉత్తమ్

పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టు వివాదంపై ఒకటి రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని, ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ అనంతరం కోర్టు ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటాను కాపాడుకోవడానికి పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణకు న్యాయరక్షణ కోరుతున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా గోదావరి, కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపిందన్నారు. వారు చెబుతున్న దానికి, చేసిన దానికి తేడా ఉందన్నారు.
నేడు సీఎం రేవంత్ సమీక్ష

తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించడానికి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నెలరోజుల పాటు ఈ కేసుపై అధికారులు కసరత్తు చేసి.. రిట్ పిటిషన్, ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేయగా.. దీనిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఒరిజనల్ అప్లికేషన్ (ఓఏ)వేసుకోవడానికి స్వేచ్ఛనివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై సీఎం అధికారులతో చర్చించి, వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. వచ్చే క్యాబినెట్‌లో చర్చించే ఎజెండాపైనా సీఎం దిశానిర్దేశనం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News