Share News

బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:07 AM

బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌ నియమితులయ్యారు. దాదాపు ఆరేళ్లుగా రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా కొనసాగుతున్న బన్సల్‌ను పూర్తిస్థాయి ఇన్‌చార్జిగా నియమిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌
Sunil Bansal

  • తొలిసారిగా ఇద్దరు సహ ఇన్‌చార్జులు..

  • అభయ్‌ పాటిల్‌, రేఖా శర్మకు బాధ్యతలు

  • ఏపీ ఇన్‌చార్జిగా అరవింద్‌ భదోరియా

  • ఒడిసా ఇన్‌చార్జిగా పురందేశ్వరి నియామకం

  • రాంమాధవ్‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్‌

  • తమిళనాడు సహ ఇన్‌చార్జిగా డీకే అరుణ

  • కర్ణాటక సహ ఇన్‌చార్జిగా కాసం వెంకటేశ్వర్లు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌ నియమితులయ్యారు. దాదాపు ఆరేళ్లుగా రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా కొనసాగుతున్న బన్సల్‌ను పూర్తిస్థాయి ఇన్‌చార్జిగా నియమిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తొలిసారిగా తెలంగాణకు ఇద్దరు సహ ఇన్‌చార్జులను నియమించింది. ఇప్పటిదాకా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న అభయ్‌ పాటిల్‌కు సహ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. మరో సహ ఇన్‌చార్జిగా రేఖా శర్మను నియమించింది. బుధవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌చార్జులను, సహ ఇన్‌చార్జులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌ నియమించారు.


తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఈ నియామకాల్లో ప్రాధాన్యం దక్కింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. ఒడిసా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులు కాగా, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత రాంమాధవ్‌ నియమితులయ్యారు. ఎంపీ డీకే అరుణ.. తమిళనాడుకు, కాసం వెంకటేశ్వర్లు.. కర్ణాటకకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జిగా మధ్యప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ భదోరియాను నియమించారు. సహ ఇన్‌చార్జిగా తమిళనాడుకు చెందిన వానతీ శ్రీనివాసన్‌ నియమితులయ్యారు.


తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..

తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగు వేసింది. యూపీ, బెంగాల్‌, ఒడిసా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు ఉన్న బన్సల్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. బెంగాల్‌కు ఇకపై కూడా ఆయన ఇన్‌చార్జిగా వ్యవరించనున్నా.. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘దాదాపు ఆరేళ్ల నుంచి రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా కొనసాగుతున్న బన్సల్‌కు తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు సంస్థాగతంగా పార్టీ బలం, బలహీనతలపై సంపూర్ణ అవగాహన ఉంది.


వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన కార్యాచరణలో ఆయన వ్యూహాలే కీలకం కాబోతున్నాయి’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. మరోవైపు, ఇప్పటివరకు ఇన్‌చార్జిగా పనిచేసిన అభయ్‌పాటిల్‌ను సహ ఇన్‌చార్జిగా నియమించడం ఆయనను డిమోట్‌ చేసినట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం తనను సహ ఇన్‌చార్జిగా నియమించడం సంతోషంగా ఉందని అభయ్‌పాటిల్‌ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. కాగా, పార్టీ జాతీయ నాయకత్వం తమకు మంచి టీమ్‌ను ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. ఇన్‌చార్జి, సహ ఇన్‌చార్జుల అనుభవం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఉపయోగపడుతుందన్నారు.


స్మృతి ఇరానీకి రెండు రాష్ట్రాల బాధ్యతలు..

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి ఛత్తీ్‌సగఢ్‌, హరియాణ రాష్ట్రాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. సతీష్‌ పూనియాకు జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, హరీశ్‌ ద్వివేదీకి బిహార్‌, కర్ణాటక రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. అనిల్‌ ఆంటోనీని నాగాలాండ్‌కు ఇన్‌చార్జిగా, గోవాకు సహ ఇన్‌చార్జిగా నియమించారు. ఉత్తరప్రదేశ్‌కు వినోద్‌ తావ్డే, మహారాష్ట్రకు బైజయంత్‌ పాండా, గుజరాత్‌కు తరుణ్‌చుగ్‌, మధ్యప్రదేశ్‌కు బిప్లబ్‌కుమార్‌ దేవ్‌, ఢిల్లీకి వినయ్‌ సహస్రబుద్ధే ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు. కొత్తగా ఇన్‌చార్జులుగా నియమితులైన నేతలకు నితిన్‌ నబీన్‌ ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు వికసిత్‌ భారత్‌ సాకారంలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

3 డీఏలకు ఓకే

జూరాలకు కర్ణాటక నీళ్లు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 05:07 AM