Share News

జూరాలకు కర్ణాటక నీళ్లు!

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:43 AM

జూరాల ఆయకట్టు రైతుల నీటి కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి పది రోజుల పాటు వారాబందీ(ఆన్‌ అండ్‌ ఆఫ్‌) విధానంలో నీళ్లు ఇవ్వడానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అంగీకరించారు.

జూరాలకు కర్ణాటక నీళ్లు!
Karnataka Water

  • కర్ణాటక సీఎంతో మళ్లీ రాష్ట్ర మంత్రుల భేటీ

  • సానుకూలంగా స్పందించిన సీఎం డీకే

  • వారాబందీ విధానంలో పది రోజుల పాటు నీటి విడుదలకు హామీ

  • నేడు ‘ఉమ్మడి పాలమూరు’ ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారుల సమావేశం

హైదరాబాద్‌, బెంగళూరు సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జూరాల ఆయకట్టు రైతుల నీటి కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి పది రోజుల పాటు వారాబందీ(ఆన్‌ అండ్‌ ఆఫ్‌) విధానంలో నీళ్లు ఇవ్వడానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అంగీకరించారు. బెంగళూరులో బుధవారం ఆయన్ను కలిసిన తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మధుసూధన్‌రెడ్డి, మేఘారెడ్డిలకు ఈ మేరకు హామీ ఇచ్చారు. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరితో కూడిన బృందం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను మంగళవారం కూడా స్వయంగా కలిసి నారాయణపుర నుంచి జూరాలకు నీళ్లు విడుదల చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం డీకే శివకుమార్‌తో రాష్ట్ర మంత్రులు బుధవారం మరోసారి సమావేశమయ్యారు.


Untitled-1 copy.jpg

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం, సాగునీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రజల తాగునీటి అవసరాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర మంత్రుల వినతికి సానుకూలంగా స్పందించిన సీఎం డీకే శివకుమార్‌.. ఆ రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులతో చర్చించి.. పది రోజుల పాటు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో ఆల్మట్టి, నారయణపుర నుంచి జూరాలకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమ సాగు నీటి శాఖ అధికారులను కూడా ఆదేశించారు. కర్ణాటకలోనూ నీటి పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించిన కర్ణాటక సీఎంకు రాష్ట్ర మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలియజేశారు.


రాష్ట్రానికి మూడు టీఎంసీలు

తెలంగాణకు 3 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు కర్ణాటక నిర్ణయించింది. జూరాలకు ఎగువన కృష్ణాపై ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల్లో నిండుగా నిల్వలున్నాయి. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా బుధవారం ఆ ప్రాజెక్టులో 117.77 టీఎంసీల నిల్వ ఉంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపుర ప్రాజెక్టు సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ప్రాజెక్టులో 31.09 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 9584 క్యూసెక్కుల వరద వస్తుండగా 11,403 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.


నారాయణపుర నుంచి జూరాల 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వానాకాలంలో నారాయణపురలో 11 వేల క్యూసెక్కులు వదిలితే జూరాలకు 9 వేల క్యూసెక్కులు చేరుతాయి. ఎండాకాలంలో అయితే 11 వేలు వదిలితే 5 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నారాయణపురలో ఔట్‌ఫ్లో 11403 క్యూసెక్కులు ఉండగా... మధ్యలో వినియోగం అనంతరం ప్రతిరోజు 5 వేల క్యూసెక్కులు కచ్చితంగా జూరాలకు చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన వారం రోజుల్లో 3 టీఎంసీల జలాలు జూరాలకు చేరే అవకాశం ఉంది.


పాలమూరుప్రజాప్రతినిధులతో నేడు భేటీ

నారాయణపుర నుంచి జూరాలకు నీళ్లు విడుదల కానున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులతో గురువారం ఓ సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి వెల్లడించారు. కర్ణాటక సీఎంతో భేటీ అనంతరం బెంగళూరులో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక నుంచి జూరాలకు పది రోజుల పాటు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తామంటూ సీఎం డీకే శివకుమార్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు. జూరాల ఆయకట్టు రైతులు ఇక ఆందోళన పడక్కర్లేదన్నారు. జూరాలతో పాటు బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు, ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.


జూరాల కాలువలకు నీరు విడుదల

గద్వాల: జూరాల ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాలువలకు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. కృష్ణ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో కుడి కాలువకు 717, ఎడమ కాలువకు 1,000, సమాంతర కాలువకు 750 క్యూసెక్కులను వదులుతున్నారు. అలాగే, కోయిల్‌సాగర్‌కు 315, భీమాకు 650, నెట్టెంపాడు ప్రాజెక్టుకు 1,500 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెర్రెలు బారిన నేలలకు కొంత ఉపశమనం కలిగింది.


‘కర్ణాటక సీఎంగారు థాంక్యూ!’

  • జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు సీఎం రేవంత్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కృష్ణా నదీ జలాలు విడుదలకు అంగీకారం తెలిపిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణా జలాల అంశంలో తమ అభ్యర్థనను మన్నించినందుకు తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక ముఖ్యమంత్రికి ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు థ్యాంక్యూ అంటూ ఓ పోస్ట్‌ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలకు ఉదాహరణ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. అలాగే, దేశ ప్రజల మధ్య ఉన్న సోదర బావానికి నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో శిశువు మృతి

పుట్టిన గంటల్లోనే నూరేళ్లు
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 04:43 AM