Share News

మరో శిశువు మృతి

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:28 AM

ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశువుల విభాగంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌, ఏసీ పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన చిన్నారుల సంఖ్య ఐదుకు చేరింది.

మరో శిశువు మృతి
Kalvakuntla Kavitha

  • రిమ్స్‌ అగ్ని ప్రమాద ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

  • మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సర్కారు నష్టపరిహారం

  • మెరుగైన చికిత్స కోసం ఏడుగురు చిన్నారులు హైదరాబాద్‌కు..

  • ప్రమాదంపై హక్కుల కమిషన్‌ సీరియస్‌.. సుమోటోగా విచారణ

  • నివేదికకు ఆదేశం.. బాధిత కుటుంబాలకు నేతల పరామర్శ

  • ఒక్కో కుటుంబానికి బీఆర్‌ఎస్‌ లక్ష, కవిత 50 వేల చొప్పున సాయం

ఆదిలాబాద్‌/హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశువుల విభాగంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌, ఏసీ పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన చిన్నారుల సంఖ్య ఐదుకు చేరింది. ఆసిఫాబాద్‌ జిల్లా కంచన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మార్లేగూడ గ్రామానికి చెందిన కుమ్ర మారుతి, దుర్గాబాయి దంపతుల నవజాత శిశువు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనలో వార్డంతా పొగ కమ్ముకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాద సమయంలో వార్డులో 27 మంది శిశువులు ఉన్నారు. తీవ్ర శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న ఏడుగుర్ని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా చిన్నారులు స్థానికంగా వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో మరణించిన శిశువుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదిలాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన మొదలు పెట్టబోతున్నామని తెలిపారు.


సుమోటోగా హెచ్‌ఆర్సీ విచారణ

ఆదిలాబాద్‌ రిమ్స్‌ అగ్ని ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతిచెందిన ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని హెచ్‌ ఆర్సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నవజాత శిశువుల విభాగంలో భద్రత, నిర్వహణ ఏర్పాట్లు, బాధిత శిశువుల రక్షణకు, చికిత్స అందించడానికి తీసుకున్న చర్యలు, ఘటనపై విచారణలో వెలుగుచూసిన అంశాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను అక్టోబరు 27వ తేదీకి వాయిదా వేశారు.


కవిత, బీఆర్‌ఎస్‌ నేతల పరామర్శ

ఆదిలాబాద్‌ రిమ్స్‌ అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం దత్తత తీసుకున్న జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగితే ఆయనకు బాధిత కుటుంబాలను పలకరించే తీరిక లేదా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన వార్డును బుధవారం ఆమె పరిశీలించారు. మృతిచెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, జోగు రామన్న, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోధ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ కూడా ఆస్పత్రిని సందర్శించారు. బీఆర్‌ఎస్‌ తరపున బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..!

పుట్టిన గంటల్లోనే నూరేళ్లు
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 04:28 AM