Share News

దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎప్పుడూ కొట్లాటలేనా?

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:27 AM

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఎప్పుడూ కొట్లాటలేనా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీటి పంపకాల వ్యవహారంలో ఏళ్ల తరబడి ఎందుకీ వివాదాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ప్రశ్నించింది

దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎప్పుడూ   కొట్లాటలేనా?
SUPREMECOURT

  • ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు,

    కర్ణాటక నడుమ ఏళ్ల తరబడి

    ఎందుకీ జల వివాదాలు?

  • కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • అన్ని పిటిషన్లపైనా నవంబరు 4న విచారణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఎప్పుడూ కొట్లాటలేనా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీటి పంపకాల వ్యవహారంలో ఏళ్ల తరబడి ఎందుకీ వివాదాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ప్రశ్నించింది. జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-2) 2010 డిసెంబరులో ఇచ్చిన అవార్డు ప్రకారం.. కర్ణాటకకు అదనపు నీటి కేటాయింపులు లభించి ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. అయితే ఆలమట్టి ఎత్తు పెంచితే దిగువకు నీళ్లు రావని.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టాలకు ఇన్‌ఫ్లో తగ్గి ఆయకట్టు ఎడారిగా మారుతుందని ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ 2014లో సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీల్‌(సీ.ఏ.) దాఖలు చేసింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-1) ప్రకారం ఏపీకి ఉన్న మిగులు జలాల హక్కులను దెబ్బతీసేలా బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఉందని, అందువల్ల ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో ప్రచురించకుండా నిలిపివేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రైబ్యునల్‌ తీర్పుపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా స్టే విధించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో భాగస్వామిగా చేరింది. నాలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ అప్పీల్‌ బుధవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక(కావేరీ జల వివాదం) మధ్య ఎందుకీ కొట్లాటని కోర్టు వ్యాఖ్యానించింది.


మా హక్కులను కర్ణాటక హరిస్తోంది: ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘కృష్ణా దిగువ పరీవాహక ప్రాంతంలో ఉన్న మా రాష్ట్ర ప్రాజెక్టులను కర్ణాటక నిరంతరం వ్యతిరేకిస్తోంది. మా హక్కులను హరిస్తోంది. మధ్యంతర ఉత్తర్వులు వెలువడి 15 ఏళ్లు గడిచినా ‘వెకేటింగ్‌ అప్లికేషన్‌’ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రధాన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇప్పటికే ప్రాజెక్టులపై రూ.వేల కోట్ల పెట్టుబడి పెట్టినా నీటిని వినియోగించుకోలేకపోతున్నాం. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన నీటిలో కేవలం 65 నుంచి 70 టీఎంసీల నీటిని మధ్యంతర ఉపశమనంగా వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. మా ఎగువన ఉన్న రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. అందువల్ల ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ జరిపి తగిన ఉత్తర్వులివ్వండి’ అని అభ్యర్థించారు. అయితే ఏపీ పేర్కొన్న నీటి లభ్యత గణాంకాలు సరైనవి కావని కర్ణాటక తరఫు సీనియర్‌ న్యాయవాది తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వివాదంపై ఒక రోజు పూర్తి స్థాయిలో వాదనలు వినడానికి కోర్టుకు అభ్యంతరం లేదని తెలిపింది. కేసు విచారణను దీపావళి తర్వాత నవంబరు 4న విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఐదు అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయవాదులు తెలిపారు. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పిటిషన్లనూ కలిపి అదే రోజు విచారిస్తామని పేర్కొంటూ ధర్మాసనం విచారణను వాయిదావేసింది.

ఇవి కూడా చదవండి

యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!యువతకు విదేశాల్లో జాబ్స్..

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

Updated Date - Sep 24 , 2026 | 03:28 AM