యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:38 PM
భారతీయ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. సుమారు 20 దేశాల ఉద్యోగ ప్రమాణాలకు అనుగుణంగా భారత యువతను తీర్చిదిద్దనుంది.
షాంఘై (చైనా), సెప్టెంబర్ 23: భారతీయ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MSDE) కీలక అడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వయోధికుల సంఖ్య పెరగడం వల్ల ఎదుర్కొంటున్న మానవవనరుల కొరతను భర్తీ చేయడానికి, సుమారు 20 దేశాల ఉద్యోగ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ తన నైపుణ్య శిక్షణను మ్యాపింగ్ చేస్తోందని శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు మనీషా సేన్ శర్మ వెల్లడించారు.
దాదాపు 20 దేశాల అవసరాలకు అనుగుణంగా మన పాఠ్యాంశాలను, ఉద్యోగ శిక్షణా ప్రమాణాలను సమీకరించే పనులు ప్రారంభమయ్యాయి. దీనివల్ల శిక్షణ పొందిన భారతీయ యువతకు విదేశాలలో సులువుగా ఉద్యోగాలు పొందే మార్గం సుగమం అవుతుంది.
కేర్‌గివింగ్, నిర్మాణ రంగానికి విపరీతమైన డిమాండ్
అంతర్జాతీయంగా కేర్‌గివింగ్ (Caregiving - సంరక్షకులు), కన్స్ట్రక్షన్ (నిర్మాణ రంగం) లతో పాటు ఇతర స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ విభాగాల్లో (యూఏఈ తదితర దేశాల్లో) భారతీయ యువతకు భారీగా డిమాండ్ ఉందని స్పష్టం చేశారు.
ఇతర దేశాల్లో వయోధికులు పెరుగుతున్న వేళ, భారత్‌కు ఉన్న 'జనాభా ప్రయోజనం' రాబోయే కొన్నేళ్ల పాటు మనకు అతిపెద్ద అడ్వాంటేజ్ కానుందని పేర్కొన్నారు.
వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026
షాంఘైలో సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు జరుగుతున్న ఈ 'నైపుణ్యాల ఒలింపిక్స్' టోర్నమెంట్‌లో భారత్ తరఫున 70 మంది సభ్యులతో కూడిన అతిపెద్ద బృందం 63 విభాగాల్లో పోటీపడుతోంది.
మన దేశీయ శిక్షణా ప్రమాణాలను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు మారుస్తూ, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు మనీషా సేన్ శర్మ తెలిపారు.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు