Share News

ఈసీ నియామక చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:43 PM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 కొత్త చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో భిన్న తీర్పు వెలువడింది.

ఈసీ నియామక చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు
EC Appointment Law: Supreme Court Delivers Split Verdict on 2023 Act

ఢిల్లీ, సెప్టెంబర్ 23: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల (EC) నియామకానికి సంబంధించిన 2023 కొత్త చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భిన్న తీర్పు (Split Verdict) వెలువడింది. ఈ పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) పంపాలనే అంశంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేకపోయింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్.సి. శర్మలతో కూడిన ధర్మాసనం కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించాలా వద్దా అనే అంశంపై చెరో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్ దీపాంకర్ దత్తా ఆవేదన: సంస్థాగత ఐక్యత దృష్ట్యా ఈ అంశంపై ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్లే సుదీర్ఘమైన ఉత్తర్వులు రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

పాలకులు చట్టానికి లోబడి ఉండాలి

తీర్పు సందర్భంలో జస్టిస్ దీపాంకర్ దత్తా కొన్ని సంచలన, కీలక వ్యాఖ్యలు చేశారు. 'పాలకులు చట్టానికి లోబడి ఉండాలి.. వారెవరూ చట్టానికి అతీతులు కారు' అని స్పష్టం చేశారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలు లేదా అభీష్టం ప్రకారం కాకుండా, రాజ్యాంగం, చట్టాల పరిధిలోనే పరిపాలన సాగాలని ఉద్ఘాటించారు.

కొలీజియం వ్యవస్థపై స్పష్టత

జడ్జీల నియామకం, కొలీజియం వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించింది.'జడ్జీలే తమ సహచర జడ్జీలను నియమించుకుంటున్నారు' అనే వార్తలు లేదా ప్రచారం తీవ్ర అసత్యమని తేల్చిచెప్పింది. అభ్యర్థుల పరిశీలన, ఎంపిక విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), ఇతర నిఘా వర్గాల పాత్ర ఎంతో స్పష్టంగా ఉంటుందని వివరించింది.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 03:43 PM