Share News

సీఎం సభకు కసరత్తు..

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:16 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 30న జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ నిర్వహణకు కసరత్తు మొదలైంది. లక్షమంది లక్ష్యంతో భారీ సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ మొదలైంది.

సీఎం సభకు కసరత్తు..

- 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లు

- సభాస్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్‌, కలెక్టర్‌, ఎస్పీ

- లక్ష మంది లక్ష్యం.. జన సమీకరణపై సన్నాహక సమావేశం

- కాంగ్రెస్‌ శ్రేణుల్లో మొదలైన జోష్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 30న జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ నిర్వహణకు కసరత్తు మొదలైంది. లక్షమంది లక్ష్యంతో భారీ సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ మొదలైంది. శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూ కుంభకోణాలు, అక్రమాలు, అసైన్డ్‌ భూములు ప్రైవేటు వ్యక్తుల పట్టాలుగా మారిన వ్యవహారం ప్రస్తావిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల అక్రమ భూములను గుర్తించినట్లు ప్రకటించడం ఆ క్రమంలో సిరిసిల్లలో నిర్వహిస్తున్న సభ ప్రత్యేకతగా మారింది. గత ప్రభుత్వం హయాంలో అత్యధికంగా భూ ఆక్రమణలు ధరణిని అడ్డుపెట్టుకొని అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలిటికల్‌ హీట్‌గా మార్చింది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు మాజీ మంత్రి కే తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పలుకుబడి భూములపై అక్రమాల ఆరోపణలు వచ్చిన క్రమంలో జరగనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభ వైపు జిల్లా ప్రజల ఆసక్తిగా చూస్తున్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఇచ్చే వరాలకంటే.. బీఆర్‌ఎస్‌ నేతలపై ఎలాంటి విషయాలపై ప్రస్తావిస్తారు.. ఇంకా భూముల అక్రమాలు బయట పెడతారా.. చట్టపరమైన చర్యలకు ఆదేశాలు ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి సభ జిల్లాలో మాత్రం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ముఖ్యమంత్రి షెడ్యూల్‌ ఖరారు కావడంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఇతర ముఖ్య నాయకులు సభ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మంగళవారం సిరిసిల్లలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఎం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. జన సమీకరణపై చర్చించారు. సిరిసిల్ల మొదటి బైపాస్‌ రోడ్డు రగుడు కలెక్టరేట్‌ చౌరస్తాకు దగ్గరలో స్థలాన్ని పరిశీలించారు. సల పరిశీలనలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గీతేతో పాటు అదనపు కలెక్టర్‌ నగేష్‌, డీఎస్పీ నాగేంద్రచారి, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఉన్నారు. కలెక్టర్‌, ఎస్పీలతో సభ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఆది శ్రీనివాస్‌ చర్చించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్‌, ట్రాఫిక్‌, హెలిపాడ్‌ ఇతర అంశాలపై కలెక్టర్‌, ఎస్పీ, ప్రభుత్వ విప్‌లు చర్చించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులను చేపట్టే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా లక్ష మందిని సభకు తరలించే లక్ష్యంగా పెట్టుకోగా ప్రధానంగా ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో స్వశక్తి సంఘాల మహిళలను సభకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు సిరిసిల్లలో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని సంకల్పంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఉన్నారు. పదేళ్ల పాలల్లో జరిగిన విధ్వంసాన్ని ముఖ్యమంత్రి సిరిసిల్ల సభ ద్వారా వివరిస్తారని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నారు. సభ విజయవంతం చేయడం ద్వారా ప్రజల్లోకి, రాజకీయ వర్గాల్లోకి బలమైన సందేశం ఇవ్వాలని సంకల్పంతో కాంగ్రెస్‌ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌కు బలమైన పట్టున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సభ ద్వారా కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్సాహం నింపి ముందుకు నడిపించాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు.

ఎదురుదాడికి గులాబీలు సిద్ధం..

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి పర్యటనతో భారీ బహిరంగ సభకు సిద్ధం కావడం బీఆర్‌ఎస్‌ నేతలు సీఎం చేసిన భుముల అక్రమాలపై చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో సిరిసిల్లకు సంబంధించిన బీఆర్‌ఎస్‌ నేతల భూములను రేవంత్‌రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలోనే కేటీఆర్‌ తీవ్రంగా ఖండించడమే కాకుండా సమాధానం ఇచ్చారు. అదే క్రమంలో సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావులతోపాటు ముఖ్యనాయకులు సీఎం తీరుపై మండిపడ్డారు. 8 వేల ఎకరాలు, స్వాధీనం చేసుకున్న 2400 ఎకరాలు భూముల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్‌ను కోరారు. 8 వేల ఎకరాలతో పాటు స్వాధీనం చేసుకున్న భూములపై వివరాలు వెల్లడించాలని దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ముఖ్యమంత్రి సిరిసిల్లకు వచ్చే ముందు 8 వేల ఎకరాలు కబ్జా పెట్టామని చెప్పిన భూమి ఎవరి చేతిలో ఉంది.. ఎక్కడివో ఊరు, సర్వే నంబర్లతో సహా ఎప్పుడు కబ్జా పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారని, స్పష్టంగా పేర్లతో సహా చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడతాం.. అబద్ధాలు చెప్తాం... అధికారంలో ఉన్నామని అనుకుంటే కుదరదని.. శ్వేత పత్రం విడుదల చేయాలని.. లేకుంటే ఇన్ని రోజులు మాట్లాడినవి అబద్ధాలని.. నేత కార్మికులు, రైతులను వంచించానని వారికి క్షమాపణ చెప్పి రాజన్నను దర్శించుకుని పాపప్రక్షాళన చేసుకొని ముఖ్యమంత్రి వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభతో జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య వాడి వేడి మొదలైంది.

Updated Date - Sep 23 , 2026 | 01:16 AM