Share News

3 డీఏలకు ఓకే

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:58 AM

ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కొలిక్కివచ్చాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో బుధవారం జరిపిన చర్చల్లో కొన్ని అంశాలపై స్పష్టత వచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాల్లో (డీఏ) మూడింటిని విడుదల చేస్తామని చెప్పగా..

3 డీఏలకు ఓకే
DA

  • సంక్రాంతికి మూడో డీఏ చెల్లింపు

  • మార్చి నాటికి 10 వేల కోట్ల బకాయిల క్లియర్‌

  • పీఆర్సీ నివేదిక 15 రోజుల్లో.. అమలుపై ఆలోచన

  • సీపీఎస్‌ రద్దుపై అధికారులతో కమిటీ

  • ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రతిపాదనలు

  • సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలు!

  • నేడు తలపెట్టిన జేఏసీ అత్యవసర సమావేశం రద్దు

  • తొలుత సీఎ్‌సతో చర్చల్లో లభించని పరిష్కారం

  • సాయంత్రం సర్కారు పిలుపుతో మరోసారి చర్చలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కొలిక్కివచ్చాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో బుధవారం జరిపిన చర్చల్లో కొన్ని అంశాలపై స్పష్టత వచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాల్లో (డీఏ) మూడింటిని విడుదల చేస్తామని చెప్పగా.. అందుకు ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇందులో రెండు డీఏలను వెంటనే విడుదల చేయడంతోపాటు మూడో డీఏను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. దీంతోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పాత బకాయిలు రూ.10 వేల కోట్లను వచ్చే ఏడాది మార్చి నాటికి క్లియర్‌ చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇక వేతన సవరణ (పీఆర్సీ) నివేదికను 15 రోజుల్లోగా తెప్పించి.. అమలుపై ఆలోచన చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్‌ అయిన సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసే విషయంలో త్వరలోనే అధికారులతో కమిటీ వేస్తామని సర్కారు చెప్పినట్లు తెలిసింది.


దీంతో గురువారం తలపెట్టిన అత్యవసర సమావేశాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ విరమించుకుంది. నాలుగు రోజులుగా జరుగుతున్న చర్చలకు కొనసాగింపుగా బుధవారం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజూతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు కొలిక్కి రాకపోవడంతో.. సాయంత్రం మరోసారి చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం కబురు పెట్టింది. ఎంసీహెచ్‌ఆర్‌డీ కేంద్రంగా రాత్రి 9 గంటల తరువాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ చర్చలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగుల డిమాండ్లపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు.. ఉద్యోగులు అడుగుతున్న నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా‌స్‌రావు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు గురువారం జేఏసీ విసృ్త్రత స్థాయి సమావేశం నిర్వహిస్తుందని ఒక ప్రకటనలో వారు పేర్కొన్నారు.


న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించండి: లచ్చిరెడ్డి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి , కార్యదర్శి వొడ్నాల రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా చర్యలు చేపట్టాలని కోరారు. బుధవారం సీఎ్‌సతో జరిగిన సమావేశంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖలో గత 20 ఏళ్లుగా పని చేస్తున్న 632 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను తీసుకోవాలని, అద్దె వాహనాల చార్జీలు క్రమం తప్పకుండా చెల్లించాలని, అద్దె వాహనాల చార్జీలు రూ.75 వేలకు పెంచాలని, గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంచాలని, నగర ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏ 35 శాతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.


పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెండింగ్‌ బిల్లులను ప్రాధా న్యం క్రమంలో మూడు నెలల్లో చెల్లించాలని, తహసీల్దార్లు, ఇతర అధికారులకు ఆరు నెలలుగా ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణం విడుదల చేయడంతోపాటు 69 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లను అమలు చేయాలని కోరామన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తన చుట్టూ ఉన్న భజన చేసే నాయకుల మాటలు విని ఉద్యోగులకు దూరం కావద్దని గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ‘‘రేవంతన్నా.. మీ చుట్టూ భజన చేసే నాయకులు ఉన్నారు. వారి మాటలు విని.. మీరు సీఎం కావాలని, మీ కోసం పని చేసిన ఉద్యోగులకు దూరం కావద్దు’’ అని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాగర్‌ ఎడమ కాల్వకు మరోసారి నీటి విడుదల

జూరాలకు కర్ణాటక నీళ్లు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 04:58 AM