ఈసీలో బుల్డోజింగ్ !
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:54 AM
ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై బయట రాజకీయ రగడ మాత్రమే కాదు.. ఆ ప్రక్రియలోని పలు అంశాలపై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోకుండానే ‘సర్’పై నిర్ణయాలుఓటర్ల తొలగింపు,
తిరిగి చేర్చే విధానంపై
సుఖ్‌బీర్ సంధూ, వివేక్ జోషి ప్రశ్నలు
వాటిని తేల్చకుండానే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్
నిర్ణయాలు తీసుకున్నారంటూ నోట్
ఫారం-6లో మార్పులు ‘అనధికారికం, చట్టవిరుద్ధం’
ఓటర్ల జాబితాలపై ఈఆర్‌వోల అధికారాలకు కత్తెర
తొలగించిన అర్హులను తిరిగి చేర్చేందుకు లేని ఆప్షన్
ఇలా పది నెలల్లో అధికారికంగా 14 అభ్యంతరాలు
కీలక పత్రాలను ఉటంకిస్తూ ఆంగ్ల పత్రిక కథనం
కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమే: ఈసీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై బయట రాజకీయ రగడ మాత్రమే కాదు.. ఆ ప్రక్రియలోని పలు అంశాలపై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ అభ్యంతరాలను కాదని మరీ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం ముందుకు వెళ్లిందని తేలింది. ఎన్నికల సంఘంలో కీలక నిర్ణయాలను తమకు తెలియకుండానే తీసుకున్నారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6లో మార్పులు, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ తదితర అంశాలపై సీఈసీ నిర్ణయాలను ‘అనధికారికం, చట్టవిరుద్ధ’మని పేర్కొంటూ పది నెలల్లోనే 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలను నమోదు చేశారు. ఈ అంశాలతో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూన్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ‘సర్’ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. ఈ ప్రక్రియలో పెట్టిన నిబంధనలు, సవరణల కోసం అవసరమైన ధ్రువపత్రాల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎవరి ఓటు ఉంటుందో, ఎవరి పేరు తొలగిస్తారో తెలియని గందరగోళం నెలకొంది. అయినా ఎన్నికల సంఘం ముందుకు వెళ్లింది.
ఇప్పటివరకు 30రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, 13 కోట్ల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించింది. అయితే ఆయా అంశాలు, నిర్ణయాలపై ఎన్నికల సంఘంలో పదే పదే ప్రశ్నలు, అభ్యంతరాలు వచ్చాయని.. పలు నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలు తెలిపారని తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ల మధ్య, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, వివిధ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారు (సీఈవో)లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వివరాలను వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు (సుఖ్‌బీర్ సంధూ, వివేక్ జోషి) తమకు తెలియకుండానే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని పలుమార్లు అభ్యంతర వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదులో చేసిన మార్పులు, తొలగించిన ఓటర్ల పేర్ల పునరుద్ధరణ, సర్ ప్రక్రియలో ఓటర్ల పేర్లను పునరుద్ధరించే నిర్ణయాలపై అప్పీలు, మొత్తం ఓటర్ల జాబితాల భద్రత తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు.
అందులో ఒకే రోజున నాలుగు అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు. ఈ అభ్యంతరాల ప్రతులను సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు పంపారు. అందులో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు తెలియకుండానే ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడిందని.. అది చట్టవిరుద్ధం, అనధికారికం అని స్పష్టం చేశారు. ఇక ఓటర్ల జాబితాలకు సంబంధించి ఐటీ విభాగంలో తమకు తెలియకుండానే మార్పులు చేశారని ఎన్నికల కమిషనర్లు సంధూ, వివేక్ జోషి వేర్వేరుగా కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వేర్వేరుగా లేఖలు రాశారు. దీనితో ఆ మార్పును నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 9న సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు భేటీ అయ్యారు. నాలుగున్నర నెలల్లో వారు భేటీకావడం అదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈసీ నిర్ణయాలపై ప్రశ్నలెన్నో!?
ఎన్నికల సంఘం ఈ ఏడాది జూలైలో కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6లో మార్పులు చేసింది. 2002నాటి ‘సర్’ జాబితాలో మీ తల్లిదండ్రులు/తాతనానమ్మల పేర్లు ఉన్నాయా? అనే ప్రశ్నను చేర్చింది. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా దరఖాస్తుదారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ముందే మే నెలలోనే ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి దీనిపై అభ్యంతరాన్ని నమోదు చేశారు. ప్రభుత్వం చట్టాలను మార్చకుండా ఈ మార్పును తీసుకురావడం కుదరదని స్పష్టం చేశారు. మరో ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సంధూ కూడా ఈ అభ్యంతరాన్ని సమర్థించారు. ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించినా సరే.. జూలైలో ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీనితో ‘ఈ నిర్ణయం చట్టవిరుద్ధం, అనధికారికం. వెనక్కి తీసుకోవాలి’ అంటూ సుఖ్‌బీర్ అధికారికంగా ఫైల్‌పై నమోదు చేయడం గమనార్హం. అయినా కొత్తనిబంధన అమల్లోనే ఉంది.
క్షేత్రస్థాయిలో అధికారాలకు కత్తెర
ఈసీఐ నెట్, ఈఆర్‌వో నెట్ పోర్టల్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ)లకు.. ఓటర్ల జాబితాలపై నియంత్రణ లేకుండా చేస్తున్నారని, ఓటర్ల జాబితాలను కేంద్రీకృత డేటాబే్‌సగా మారుస్తున్నారని ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి ఈ ఏడాది మేలో పేర్కొన్నారు. ఈఆర్‌ఓలు ఇతర చట్టబద్ధ హక్కు ఉన్న అధికారులకు తప్ప ఇతరులు మరెవరికీ ఓటర్ల జాబితాలు సవరించే అవకాశం లేదని తేల్చాలని, ఇందుకోసం ప్రత్యేక ఆడిట్ జరపాలని కోరారు. మరో ఎన్నికల కమిషనర్ సంధూ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. తమకు ఈఆర్‌ఓనెట్ పోర్టల్‌లో సరైన యాక్సెస్ ఉండటం లేదని రాష్ట్రాల ఎన్నికల అధికారులు చెబుతున్నారని నోట్ రాశారు. కానీ ఈ అంశాలపై సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ స్పందించలేదు.
ఈసీ తరఫున అప్పీలు చేసిందెవరు?
పశ్చిమబెంగాల్‌లో చేపట్టిన సర్‌లో ఓట్ల తొలగింపుపై వివాదం చెలరేగింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ట్రైబ్యునళ్లతో ఓటర్ల జాబితాలు, అప్పీళ్లను పరిశీలించి లక్షలాది మంది పేర్లను తిరిగి చేర్చింది. అయితే ట్రైబ్యునళ్లు పునరుద్ధరించిన ఓటర్లను తొలగించాలని కోరుతూ ఎన్నికల అధికారులు 16 లక్షల అప్పీళ్లను దాఖలు చేశారు. అయితే తమకుగానీ, బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)కు గానీ తెలియకుండానే ఈ అప్పీళ్లు దాఖలయ్యాయని.. అవి ఎవరు చేశారు, ఎవరు అనుమతించారని ఎన్నికల కమిషనర్లు సంధూ, వివేక్ జోషి ప్రశ్నించారు.
సాఫ్ట్‌వేర్ ఎందుకు తిరస్కరించింది?
ఎన్నికల కమిషనర్లు సంధూ, వివేక్ జోషి లేవనెత్తిన కేంద్రీకృత విధానం గోవాలో అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు దక్కకుండా చేసింది. తల్లిదండ్రులు, బంధువుల పేరు సరిపోకపోవడం, వయసులో అసాధారణ వ్యత్యాసాలు వంటి కారణాలతో ఓటు హక్కు తిరస్కరించిన వారికి మరోసారి పత్రాలు చూపే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 29న ఆదేశించింది. దీనితో ఈఆర్‌ఓలు పరిశీలన జరిపి 97 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించారు. అర్హుల ఓటర్ల పేర్లు తిరిగి చేర్చేలా ‘రోల్ బ్యాక్’ ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరినా.. ఎన్నికల సంఘం స్పందించలేదు.
మెజారిటీ నిర్ణయమే కీలకం.. కానీ?
ఎన్నికల కమిషన్‌లో సీఈసీ, ఇద్దరు కమిషనర్లకు సమాన హోదా ఉంటుంది. ఏ నిర్ణయమైనా సరే మెజారిటీతో లేదా ఏకగ్రీవంగా తీసుకుంటేనే అమల్లోకి వస్తుంది. కానీ ఇప్పుడు ఇద్దరు కమిషనర్లు పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. ఎన్నికల సంఘం పనితీరునే ప్రశ్నార్థకంగా మార్చేసిందనే విమర్శలు వస్తున్నాయి
నియామకాల తీరుపైనే అభ్యంతరాలు
పాత ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాని, ప్రతిపక్ష నేతలతో కూడి ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2023లో ఈ చట్టానికి సవరణ చేసి.. ప్యానెల్ నుంచి సుప్రీం చీఫ్ జస్టి్‌సను తొలగించింది. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేలా మార్చింది. అంటే ప్రభుత్వం ఎవరిని కోరుకుంటే వారిని నియమించుకునే వీలు ఏర్పడింది. ఈ క్రమంలోనే 2024 మార్చిలో జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ ఎన్నికల కమిషనర్లుగా నియామకమయ్యారు. ఈనియామకాలను అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్‌రంజన్ చౌదరి వ్యతిరేకించారు. ఇక 2025 ఫిబ్రవరిలో జ్ఞానేశ్‌కుమార్‌కు సీఈసీగా పదోన్నతి ఇచ్చారు. వివేక్‌జోషిని కమిషనర్‌గా నియమించారు. దీనిని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యతిరేకించినా అమల్లోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు