Share News

సాగర్‌ ఎడమ కాల్వకు మరోసారి నీటి విడుదల

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:50 AM

సాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నుంచి మరోసారి నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

సాగర్‌ ఎడమ కాల్వకు మరోసారి నీటి విడుదల
Uttam Kumar Reddy

  • సాగు చేసిన పంటలను కాపాడుకుంటాం

  • దేవాదుల పూర్తిచేసి తుంగతుర్తికి సాగు నీరిస్తాం: మంత్రి ఉత్తమ్‌

నేరేడుచర్ల, తిరుమలగిరి రూరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నుంచి మరోసారి నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. తన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంతోపాటు నేరేడుచర్లల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి మంత్రి ఉత్తమ్‌ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సాగునీరు కావాలని రైతులు అడుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు సమీక్షించి సాగులో ఉన్న పైర్లను కాపాడేందుకు ఒక తడి కోసం మరోసారి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు.


ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవనందున శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయన్నారు. కరువు పరిస్థితులను రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూనే, రాబోయే వానాకాలం వరకు సరైన వర్షాలు కురవకపోతే తాగునీటి అవసరాలకు సరిపడేలా నీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలను కాపాడుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. కాగా, దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీటిని అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో శిశువు మృతి

జూరాలకు కర్ణాటక నీళ్లు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 04:51 AM