Share News

జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:03 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) విషయంలో జాతీయ ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి

జ్ఞానేశ్‌కుమార్‌ను   అరెస్టు చేయాలి
Parties symbols

  • మోదీ, షా చేతిలో ఆయుధంగా

మారారు: ప్రతిపక్షాలు

  • ఈసీ పనితీరుపై సుప్రీంకోర్టు

సుమోటోగా విచారణ చేయాలి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) విషయంలో జాతీయ ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఆయనను తొలగించేందుకు పార్లమెంటులో అభిశంసన చర్యలు చేపట్టాలని బుధవారం కోరాయి. ‘బీజేపీ, ఆరెస్సెస్‌, ఈసీ కలిసి దేశద్రోహానికి పాల్పడ్డాయి. ప్రజలకు న్యాయం జరగాలి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ‘జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ 24న 73 మంది ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. పెండింగ్‌ నోటీసుపై రాజ్యసభ చైర్మన్‌ ఇప్పటికైనా నిర్ణయం తీసకుంటారా?’ అని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. ‘ప్రధాని ఆదేశాలను అమలు చేసే అమిత్‌ షా చేతిలో జ్ఞానేశ్‌కుమార్‌ గొడ్డలిగా మారారు’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ‘జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు. తమ రాష్ట్రంలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా డిమాండ్‌ చేశారు.


ఎన్నికల సంఘం పక్షపాత జోక్యంతో ఏర్పడే ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవేనని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ అన్నారు. జ్ఞానేశ్‌కుమార్‌పై దేశద్రోహ కేసు పెట్టి అరెస్టు చేయాలని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భిన్నాభిప్రాయాలు సహజమని ఆ పార్టీ నేత సంబిత్‌ పాత్ర అన్నారు. నిజానికి ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలే ఊపిరి అని పేర్కొన్నారు. ఈసీ స్వతంత్రతను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ద్వయం నియంత్రిస్తోందని నటుడు ప్రకాశ్‌రాజ్‌ విమర్శించారు. ‘ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌, నరేంద్రమోదీ, అమిత్‌షా’ అని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

Updated Date - Sep 24 , 2026 | 04:03 AM