Share News

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:15 AM

సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న 250 డిపెండెంట్‌ ఆర్డర్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలను 15 రోజుల్లో పూర్తి చేసి, అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!
Bhatti Vikramarka

  • సింగరేణిలో 250 మంది అభ్యర్థులకు ఉత్తర్వులివ్వండి

  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

  • సింగరేణి సమస్యలపై ఆ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న 250 డిపెండెంట్‌ ఆర్డర్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలను 15 రోజుల్లో పూర్తి చేసి, అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. డిపెండెంట్‌ ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించి సుమారు 136 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, సింగరేణి అధికారుల కమిటీ సిఫారసుల ఆధారంగా మానవీయ కోణంలో వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ప్రజాభవన్‌లో సింగరేణి ప్రాంత మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్‌, ఎమ్మెల్యేలతో పాటు సంస్థ ఉన్నతాధికారులతో భట్టి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులను ప్రజాప్రతినిధులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు.


వాటన్నింటినీ విన్న ఆయన.. తక్షణ చర్యలకు ఆదేశాలిచ్చారు. మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా బోర్డు మీటింగ్‌ నిర్వహించాలని, అక్కడే వీలైనంత మందికి పరీక్షలు నిర్వహించి మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని భట్టి ఆదేశించారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాల వల్ల విధులకు హాజరవకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులను వన్‌ టైం ఆప్షన్‌ కింద తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 5774 ఎకరాలను సింగిరేణి సంస్థ తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించిందని భట్టి తెలిపారు. అందులో 4,500 ఎకరాలను వైఎస్‌ హయాంలో పేదలకు పంపిణీ చేశారని, మిగిలిన 1250 ఎకరాల్లో జీవో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.


నెల రోజుల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. సింగరేణి భూముల్లో ఇప్పటివరకు మైనింగ్‌ చేయని ప్రదేశాలను గుర్తించి ఉద్యోగులు, కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం నెహ్రూ హౌసింగ్‌ కాలనీ పేరిట లేఅవుట్‌ వేయడానికి కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు. సింగరేణి పరిధిలోని ఏరియా ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సింగరేణి పరిధిలోని ప్రతి గ్రామానికీ వెళ్లి ఉచితంగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు కోరగా.. భట్టి అంగీకరించారు. సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, భవనాలపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సింగరేణి సంస్థ నుంచి స్థలం కేటాయించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...
గ్రామాల్లో ప్రపంచస్థాయి విద్య

రహదారుల నిర్మాణంలో భద్రతకే పెద్దపీట

దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:15 AM