గ్రామాల్లో ప్రపంచస్థాయి విద్య
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:06 AM
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రపంచస్థాయి విద్య అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
విద్యుత్ ఉత్పత్తి తగ్గినా లోటు రానివ్వలే: భట్టి విక్రమార్క
గరిడేపల్లి, మునగాల, మునగాల రూరల్, చింతలపాలెం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రపంచస్థాయి విద్య అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను పరిశీలించారు. మునగాల మండలం ఎస్‌ఎంపేట శివారులో హరేరామ హరే కృష్ణ(అక్షయపాత్ర) ఫౌండేషన్ సహకారంతో రూ.9.60 కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక వంటశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చింతలపాలెం మండలంలోని పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇటువంటి పాఠశాలను ఒక్కటైనా నిర్మాణం చేయలేదని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని 60వేల మంది విద్యార్ధులకు అల్పాహారం పంపిణీకి హరే రామ, హరే కృష ఫౌండేషన్ వంటశాలను ఏర్పాటుచేయటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎల్‌నివో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల జల విద్యుత్ ఉత్పత్తి సుమారు 4వేల మెగావాట్లు తగ్గినా థర్మల్ విద్యుత్‌తో లోటును అధిగమిస్తూ గృహ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. గరిడేపల్లి ప్రాంతంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల గ్రామీణ పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు.
ఇవి కూడా చదవండి...
మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ వివరాల నమోదుకు మరో 3 వారాల గడువు
పురిట్లోనే ఫంగస్ ముప్పు!
దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్
Read Latest AP News And Telugu News