Share News

పురిట్లోనే ఫంగస్‌ ముప్పు!

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:59 AM

అప్పుడే పుట్టిన పసికందులను మొండి శిలీంద్రాలు (ఫంగస్‌లు) వెంటాడుతున్నాయి. వారి రక్తంలోకి చొరబడిఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. నవజాత శిశువుల ఐసీయూల (ఎన్‌ఐసీయూ)లో చేరిన చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

పురిట్లోనే ఫంగస్‌ ముప్పు!
Newborns fungal infection

  • పసికందుల రక్తాన్ని పీల్చేస్తున్న మొండి శిలీంద్రాలు..

  • దేశవ్యాప్తంగా 997 రక్త నమూనాలపై పరిశీలన

  • సగం కేసులు ఏడాదిలోపు చిన్నారుల్లోనే..

  • నవజాత శిశువుల ఐసీయూల్లోనే అత్యధిక కేసులు

  • మందులకు లొంగని ‘కాండిడా ఆరిస్‌’

  • కేంద్ర ఆరోగ్యశాఖ ‘నార్స్‌ నెట్‌’ నివేదిక

  • తెలంగాణలోని ఉస్మానియా, నిలోఫర్‌, ఎంజీఎం ఆస్పత్రుల్లో అప్రమత్తత అవసరం

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అప్పుడే పుట్టిన పసికందులను మొండి శిలీంద్రాలు (ఫంగస్‌లు) వెంటాడుతున్నాయి. వారి రక్తంలోకి చొరబడిఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. నవజాత శిశువుల ఐసీయూల (ఎన్‌ఐసీయూ)లో చేరిన చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల ఎన్‌ఐసీయూల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో 23శాతం వాటిలో శిలీంధ్రాల జాడ ఉన్నట్టు ఢిల్లీలోని నేషనల్‌ రిఫరెన్స్‌ ల్యాబొరేటరీ తేల్చింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ పరిధిలోని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)’ విభాగం తాజాగా విడుదలచేసిన ‘జాతీయ యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ సర్వైలెన్స్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఏఆర్‌ఎ్‌స-నెట్‌)’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు 39 కేంద్రాల నుంచి వచ్చిన రక్త నమూనాల్లో 997 నమూనాల్లో ఫంగ్‌సలు ఉన్నట్టు గుర్తించారు.


కాండిడా ట్రాపికాలి్‌సదే అగ్రస్థానం

నవజాత శిశువుల్లో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్థి చెందకపోవడంతో తీవ్ర ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రక్తంలో కాండిడా వంటి శిలీంద్రాల ఇన్ఫెక్షన్లను గుర్తించడం అత్యంత కీలకమని నివేదిక స్పష్టం చేసింది. శిలీంద్రాల జాతిని కచ్చితంగా గుర్తించడం, యాంటీ ఫంగల్‌ సెన్సిటివిటీ పరీక్షలు నిర్వహించడం, ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్‌ నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం అవసరమని పేర్కొంది. ముఖ్యంగా ఐసీయూ, ఎన్‌ఐసీయూలలో ఇన్ఫెక్షన్లపై నిరంతర నిఘా అవసరమని తెలిపింది. చిన్నారుల ఐసీయూల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో గుర్తించిన శిలీంద్రాల్లో.. కాండిడా ట్రాపికాలిస్‌ 45శాతంతో మొదటి స్థానంలో ఉంది. కాండిడా అల్బికాన్స్‌ 13 శాతం, కాండిడా పారాప్సిలోసిస్‌ 10 శాతం, పిచియా కుడ్రియావ్జెవీ 8 శాతం, కాండిడా ఆరిస్‌ 4శాతంనమూనాల్లో గుర్తించారు.


ఐసీయూలేవైనా ఫంగ్‌సకు అడ్డాలే..

రక్తంలో కాండిడా శిలీంద్రాలు పెరిగే పరిస్థితిని వైద్య పరిభాషలో కాండిడీమియాగా పిలుస్తారు. నార్స్‌నెట్‌ నివేదిక ప్రకారం.. దాదాపు 23 శాతం కేసులు నవజాత శిశువుల ఐసీయూల నుంచే నమోదయ్యాయి. అంటే తీవ్ర అనారోగ్యంతో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉన్న నవజాత శిశువుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు నమూనాల్లో 51 శాతం పెద్దల ఐసీయూల నుంచి వచ్చాయి. కాండిడా ఆరిస్‌ కేసుల్లో ఏకంగా 70 శాతం పెద్దలకు చిక్సిత అందించే ఐసీయూల్లోనే గుర్తించారు. ఇక అన్నింటికంటే ఆందోళన కలిగించే అంశం శిలీంద్రాలు ఔషధ నిరోధకత పెంచుకుంటుండటం. ముఖ్యంగా కాండిడా ఆరిస్‌లో ఫ్లూకనజోల్‌కు 70శాతం నిరోధకత నమోదైంది. కాండిడా పారాప్సిలోసి్‌సలో 19.3 శాతం, కాండిడా ట్రాపికాలి్‌సలో సుమారు 6 శాతం ఫ్లూకనజోల్‌ నిరోధకత కనిపించింది.


యాంటీ బయాటిక్స్‌ మితిమీరిన వాడటంతో..

నార్స్‌ నెట్‌ నివేదిక ప్రకారరం.. ఈ-కోలి (80 శాతం), క్లెబ్సియెల్లా (83 శాతం) వంటి బ్యాక్టీరియాలు ఇప్పటికే ప్రాథమిక మందులను ఎదుర్కొనగలిగేవిగా అభివృద్ధి చెందాయి. ఇక కార్బాపెనెమ్‌ను తట్టుకునే సామర్థ్యం క్లెబ్సియెల్లాలో 62 శాతం, ఎసినెటోబాక్టర్‌లో 68 శాతం, ఈ-కోలిలో 41 శాతంగా నమోదైంది. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల భయంతో వైద్యులు చిన్నారులకు కూడా అధిక సామర్థ్యం గల యాంటీ బయాటిక్స్‌ను ఇస్తున్నారు. దీనితో రోగనిరోధక శక్తి బలహీనపడి ఫంగ్‌సల వ్యాప్తికి కారణం అవుతోందని నిపుణులు నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తెలంగాణ ఆస్పత్రుల్లో నివారణ చర్యలు అత్యవసరం

తెలంగాణలోని ఉస్మానియా, నిలోఫర్‌, వరంగల్‌ ఎంజీఎం వంటి ప్రధాన బోధనాసుపత్రులకు నిత్యం జిల్లాల నుంచి విషమ పరిస్థితుల్లో వేలాది మంది చిన్నారులు వస్తుంటారు. ప్రస్తుతం ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తుండటంతో.. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ల నివారణ నిబంధనలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం వచ్చిందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశుభ్రత పాటించడం, వైద్య పరికరాలను స్టెరిలైజ్‌ చేయడం, అత్యవసరమైతే తప్ప అధిక సామర్థ్యమున్న యాంటీ బయాటిక్స్‌ వాడకపోవడం తదితర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...
మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ వివరాల నమోదుకు మరో 3 వారాల గడువు

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ
దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:59 AM