Share News

రహదారుల నిర్మాణంలో భద్రతకే పెద్దపీట

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:11 AM

రహదారుల నిర్మాణం విషయంలో ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు నిర్మించామన్నది ముఖ్యం కాదన్నారు.

రహదారుల నిర్మాణంలో భద్రతకే పెద్దపీట
Komatireddy Venkat Reddy

  • డిజైన్లు మెరుగ్గా ఉంటే చాలదు..

  • నాణ్యతలో రాజీ పడకూడదు

  • ప్రారంభానికి ముందే ప్రమాణాల మదింపునకు అంబుడ్స్‌మన్‌

  • గుజరాత్‌లో జరిగిన ‘చింతన్‌ శివిర్‌ -2026’లో మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రహదారుల నిర్మాణం విషయంలో ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు నిర్మించామన్నది ముఖ్యం కాదన్నారు. సురక్షిత, సాఫీ, వేగవంతమైన ప్రయాణానికి భరోసానిచ్చే విధంగా రహదారులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ర్టాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని ఎక్తానగర్‌లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ ప్రాంగణంలో నిర్వహించిన ‘చింతన్‌ శివిర్‌-2026’లో ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్లను డిజైన్‌ చేయడంతోపాటు, నిర్వహణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు.


హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై (ఎన్‌హెచ్‌-65) జరుగుతున్న ప్రమాదాలపైనా మంత్రి ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్‌ స్పాట్లను గుర్తించడమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించాలన్నారు. ఈ మార్గంలో వాహనరద్దీ విపరీతంగా పెరిగిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతమున్న నాలుగు లేన్ల రహదారిని 6+2 లేన్లతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతానికి తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాష్ర్టాలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి వెంకట్‌ రెడ్డి సూచించారు.


డిజైన్‌ ఎంత మెరుగ్గా ఉన్నా నిర్మాణంలో నాణ్యత లోపిస్తే ప్రయోజనం ఉండదన్నారు. స్వీడన్‌ అమలు చేస్తున్న ‘విజన్‌ జీరో’. ఆస్ట్రేలియా అనుసరిస్తున్న ‘సేఫ్‌ సిస్టమ్‌’ విధానాలను అధ్యయనం చేశామని, వీటి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని తెలిపారు. అలాగే కీలక రహదారులను ప్రారంభించే ముందు.. భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలయ్యాయా లేదా అన్నది పరిశీలించేందుకు ‘రోడ్డు భద్రత అంబుడ్స్‌మన్‌’ లేదా భద్రతా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. 2023లో దేశవ్యాప్తంగా 1,72,890 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా.. ఒక్క తెలంగాణలోనే 7,660 మంది మృత్యువాత పడడం ఆందోళనకరమని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...
గ్రామాల్లో ప్రపంచస్థాయి విద్య

పురిట్లోనే ఫంగస్‌ ముప్పు!
దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:11 AM