గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Aug 22 , 2026 | 02:21 PM
హైదరాబాద్‌లోని మాదాపూర్ సర్కిల్ పరిధి గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శనివారం ఏడంతస్తుల భవనం కుప్పకూలింది.
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మాదాపూర్ సర్కిల్ పరిధి గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఈరోజు (శనివారం) ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. కేవలం 50 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు వాలి సమీపంలోని వైట్ ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. రమణారెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతిచెందిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన మహబత్, ఉమేశ్‌గా గుర్తించారు.
ఈ సంఘటన స్థలానికి హైడ్రా, డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనం నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఈ నిర్మాణానికి సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులిచ్చి ఈ భవనాన్ని యజమాని నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమంగా ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ఖాజా అనే వ్యక్తి చేపట్టాడు. అంజయ్య నగర్‌లో అత్యంత ప్రమాదకర స్థాయిలో భవనాలను నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖాజా నిర్మిస్తున్న అక్రమ భవనంపై పలుమార్లు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం ఇదే అంజయ్య నగర్‌లో ఐదు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.
రెండు మృతదేహాలను గుర్తించాం: సుధాకర్ రావు
ఈ ప్రమాదంపై రీజనల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్ రావు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. భవనం కుప్పకూలిందనే సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలికి చేరుకున్నామని తెలిపారు. విక్టిమ్ లోకేషన్స్ సిస్టం ద్వారా శిథిలాల కింద రెండు మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఆ మృతదేహాలను వెలికి తీసి పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా..? అని తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ఉదయం భవనంలో పనిచేయడానికి ఇద్దరు వచ్చినట్లుగా స్థానికులు చెప్పారని సుధాకర్ రావు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News