భార్య విలువ తెలిసి.. భర్త మనసు కరిగె..
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:18 AM
భారతీయ వివాహ బంధం విలువను ఉన్నతంగా చూపిన ‘పవిత్ర బంధం’ సినిమా గుర్తుందా.. భార్య విలువ తెలియక ఇంటినుంచి వెళ్లగొట్టిన హీరో..
విడిపోయిన భర్తకు రోడ్డుప్రమాదం
జరగటంతో భార్య సపర్యలు
మనసు మార్చుకొని ఆమెను తిరిగి
తన జీవితంలోకి ఆహ్వానించిన భర్త
మహబూబాబాద్‌లో జాతీయ లోక్ అదాలత్ వేదికగా తిరిగి ఒక్కటైన భార్యాభర్తలు
హైదరాబాద్ సిటీ/ మహబూబాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): భారతీయ వివాహ బంధం విలువను ఉన్నతంగా చూపిన ‘పవిత్ర బంధం’ సినిమా గుర్తుందా.. భార్య విలువ తెలియక ఇంటినుంచి వెళ్లగొట్టిన హీరో.. తాను ఆపదలో ఉన్నప్పుడు ఆమె తిరిగి వచ్చి నిస్వార్థంగా చేసిన సేవలతో మనసు మార్చుకొని తిరిగి తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అలాంటి ఘటనే వాస్తవంగా కూడా జరిగింది. మహబూబాబాద్ జిల్లా జంగంవారిగూడెంకు చెందిన నోముల రమణకు 2014లో శ్రవణ్‌తో వివాహం జరిగింది. వారికి కుమారుడు జన్మించిన తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. భర్త నుంచిభరణం కోరుతూ రమణ మహబూబాబాద్ న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించారు.
ప్రైవేట్ న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేకపోవడంతో న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాది రాజమణిని నియమించింది. కేసు పెండింగ్‌లో ఉండగానే శ్రవణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న న్యాయవాది.. రమణకు కౌన్సిలింగ్ ఇచ్చి కష్టకాలంలో భర్తకు అండగా నిలవాలని సూచించారు. రమణ సానుకూలంగా స్పందించి తన కుమారుడితో కలిసి భర్త వద్దకు వెళ్లింది. శ్రవణ్ కోలుకునే వరకు కంటికి రెప్పలా చూసుకుంది. దీంతో మనసు మార్చుకున్న శ్రవణ్.. రమణను తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించాడు. వీరు తమ కుమారుడితో కలిసి శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. వారి నిర్ణయం గురించి తెలుసుకున్న జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి కే మురళీమోహన్ ఆ దంపతులను అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రేవంత్ పాపాల చిట్టా బయటపెడతా
వచ్చే 30 ఏళ్ల అవసరాల కోసమే క్యూర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News