Share News

3 శాతం కమీషన్‌తో కోట్లు కొల్లగొట్టేస్తారు..!

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:45 AM

కమీషన్లు ఆశచూపి బ్యాంకు ఖాతాదారులను (మనీ మ్యూల్స్‌) హటోల్‌ గదుల్లో ఉంచి.. వారి సెల్‌ఫోన్లలోకి మాల్వేర్‌ను జొప్పించి.. సమాంతరంగా సైబర్‌ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాగుట్టును మియాపూర్‌ పోలీసులు రట్టు చేశారు.

3 శాతం కమీషన్‌తో కోట్లు కొల్లగొట్టేస్తారు..!
Cyber crimes

  • అకౌంట్‌ ఇస్తే కమీషన్‌ ఎర..

  • ఖాతాదారులను హోటల్లో ఉంచి.. ఫోన్లపై పూర్తిపెత్తనం

  • బాధితుల సొమ్ము తొలుత

  • ఈ మ్యూల్‌ ఖాతాల్లో జమ

  • ఆ వెంటనే వేరే ఖాతాలకు మళ్లింపు

  • 2, 3 రోజుల తర్వాత మకాం మార్పు

  • మరో హోటల్‌లో కొత్త వారితో అదే దందా

  • సైబర్‌ ముఠా ఆటకట్టించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కమీషన్లు ఆశచూపి బ్యాంకు ఖాతాదారులను (మనీ మ్యూల్స్‌) హటోల్‌ గదుల్లో ఉంచి.. వారి సెల్‌ఫోన్లలోకి మాల్వేర్‌ను జొప్పించి.. సమాంతరంగా సైబర్‌ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాగుట్టును మియాపూర్‌ పోలీసులు రట్టు చేశారు. సైబర్‌ నేరాల ద్వారా అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును ఈ మ్యూల్‌ ఖాతాల్లోకి మళ్లించి, ఆ మొత్తాన్ని కాజేస్తున్న నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చారు. పోలీసులు వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ‘ఫార్చ్యూన్‌ విస్టా స్టే ఇన్‌’ హోటల్‌లో సైబర్‌ నేరాల ముఠా మకాం వేసినట్లు సమాచారం రావడంతో, ఎస్‌ఐ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ నెల 10న తనిఖీలు చేపట్టారు.


గది నంబర్‌ 209లో ఉన్న అసోంకి చెందిన హకీమ్‌ అలీని అదుపులోకి తీసుకుని విచారించగా.. జమీల్‌ అనే వ్యక్తి ఆదేశాలతో మ్యూల్‌ ఖాతాదారులకు వసతి కల్పిస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. తర్వాత హకీమ్‌ అలీ పోలీసుల కళ్లుగప్పి హోటల్‌ నుంచి పరారయ్యాడు. హకీమ్‌ ఇచ్చిన సమాచారంతో రూమ్‌ నంబర్‌ 208పై దాడి చేసి, సామల హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌కు చెందిన సామల హరికృష్ణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెలిగ్రామ్‌లోని ‘ఇండియన్‌ కార్పొరేట్‌ అకౌంట్‌’ అనే ఛానల్‌ ప్రకటన చూసి ఈ ముఠా వలలో పడ్డాడు. ముఠా సూత్రధారి ‘లవ్లీ’తో పరిచయం ఏర్పడింది. సైబర్‌ నేరాల నిధుల మళ్లింపు కోసం హరికృష్ణ తన కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఖాతా వివరాలను లవ్లీకి అప్పగించాడు. ఖాతా సమకూర్చినందుకుగాను రూ.లక్ష కమీషన్‌ను కొంత క్రిప్టో కరెన్సీ, కొంత నగదు రూపంలో ముఠా చెల్లించింది. ఈ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఖాతాకు సంబంధించి గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదైనట్లు హరికృష్ణ వెల్లడించాడు.


పకడ్బందీగా..

ఈ ముఠా నేరాలకు పాల్పడే విధానం అత్యంత పకడ్బందీగా సాగింది. ఖాతాదారులకు కమీషన్‌ ఆశ చూపించి, వారిని తీసుకొచ్చి రెండు, మూడు రోజుల పాటు హోటల్‌ గదుల్లో ఉంచుతారు. వారి మొబైల్‌ ఫోన్లలోకి ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన తర్వాత.. ఖాతాదారుల ఫోన్లపై డిజిటల్‌గా పూర్తి నియంత్రణ లవ్లీ చేతుల్లోకి వెళుతుంది. ఫోన్‌కు వచ్చే బ్యాంక్‌ ఎస్‌ఎంఎ్‌సలు, ఓటీపీలను పరిశీలిస్తూ.. సైబర్‌ నేరాల బాధితుల సొమ్ము మ్యూల్‌ ఖాతాల్లో జమ అయిన వెంటనే, ఆ మొత్తాన్ని లవ్లీ ఇతర ఖాతాల్లోకి మళ్లించేవాడు. రోజూ రాత్రి లావాదేవీలను లెక్కగట్టి, ఒక్కో మ్యూల్‌ ఖాతాదారుడికి 3 శాతం చొప్పున కమీషన్‌ చెల్లించేవాడు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడు.. ఆయా మ్యూల్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తుంటారు. అవి ఫ్రీజ్‌ అయినట్లు గుర్తించగానే, ఈ ముఠా అక్కడి నుంచి మకాం మారుస్తుంది. వేరే మ్యూల్‌ ఖాతాదారులతో మళ్లీ అదే దందా కొనసాగించేవారని తెలిసింది. జూన్‌లో మాదాపూర్‌ పరిధిలోని పీకేఆర్‌ హోమ్స్‌లో బెంగళూరుకు చెందిన కార్తిక్‌, శివాజీతో కలిసి.. జూలైలో అదే ప్రాంతంలోని పీకేఆర్‌ హోమ్స్‌లో అబ్దుల్‌, మరో గుర్తుతెలియని వ్యక్తితో కలిసి మ్యూల్‌ ఖాతాలను నిర్వహించినట్లు పేర్కొన్నాడు. ఆగస్టులో హనుమకొండ బీమారానికి చెందిన కృపాకర్‌, హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్‌ ఖాతాలను కూడా ఈ విధమైన లావాదేవీలకు వినియోగించినట్లు వెల్లడించాడు. ఈ విధంగా తనకు రూ. 2 లక్షలు కమీషన్‌గా అందినట్లు హరికృష్ణ విచారణలో తెలిపాడు.


బాధితులకు బెదిరింపులు..

సైబర్‌ నేరాల్లో డబ్బులు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులను ఈ ముఠా అత్యంత దారుణంగా వేధించేది. బాధితుల కుటుంబ సభ్యుల ఫొటోలను సేకరించి, నగ్నంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించేవారు. బాధితుల చిరునామాలకు డ్రగ్స్‌ పార్సిల్‌ పంపించి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు దిగేవారు. ‘‘పోలీసులకు ఫిర్యాదు చేసినా తమ లీగల్‌ టీమ్‌ చూసుకుంటుంది’’అని ముఠా నాయకుడు లవ్లీ హామీ ఇవ్వడంతో తాను ఈ ముఠాలో చేరినట్లు హరికృష్ణ తెలిపాడు. ఫార్చ్యూన్‌ విస్టా హోటల్‌లో ముఠా సభ్యుల మధ్య డబ్బుల పంపకంపై వివాదం తలెత్తడంతో కొందరు అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి, ముఠా నాయకుడు లవ్లీ సహా ఇతరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొత్త ఐడీ కావాలంటే కాసులివ్వండి..!!
సురేఖకు అధిష్ఠానం పిలుపు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 05:45 AM