కొత్త ఐడీ కావాలంటే కాసులివ్వండి..!!
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:33 AM
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తూ ప్రభుత్వ నర్సుగా ఇటీవల కొలువు పొందిన నర్సులతో డీఎంహెచ్‌వో సిబ్బంది ఆటలాడుకుంటున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇచ్చిన ...
ప్రభుత్వ కొలువు సాధించిన కాంట్రాక్టు నర్సుల నుంచి డీఎంహెచ్‌వో సిబ్బంది వసూళ్లు
పాత ఐడీల తొలగింపునకు డబ్బు డిమాండ్
కొత్త ఐడీ రాక మూడు నెలలుగా వేతనాలు బంద్
దాదాపు రెండు వేల మంది నర్సుల పాట్లు
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తూ ప్రభుత్వ నర్సుగా ఇటీవల కొలువు పొందిన నర్సులతో డీఎంహెచ్‌వో సిబ్బంది ఆటలాడుకుంటున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇచ్చిన గుర్తింపు నెంబర్(ఐడీ)ను రికార్డుల నుంచి తొలగించేందుకు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత ఐడీని తొలగించకపోవడంతో ప్రభుత్వ నర్సుగా కొత్త ఐడీ క్రియేట్ చేయడం కుదరడం లేదు. దీంతో రాష్ట్రంలో దాదాపు 2,000 మంది నర్సులకు మూడు నెలలుగా జీతాలు ఆగిపోగా.. ఆయా కుటుంబాలు నానావస్థలు పడుతున్నాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ ఏడాది జూన్‌లో 2,322 మందికి స్టాఫ్‌నర్సులుగా ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసింది. ఈ 2,322 మందిలో దాదాపు 90 శాతం మంది అప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సులగా పని చేసిన వారే ఉన్నారు. సర్వీసు వెయిటేజ్ ఆధారంగా వీరంతా శాశ్వత కొలువులు పొందారు. అయితే, ఆయా నర్సులకు ఆర్థిక శాఖ ఓ ఐడీని క్రియేట్ చేసి వాటి ఆధారంగానే వేతనాలను సంబంధిత కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు పంపేది. ఆ ఐడీలు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్నాయి. అయితే, శాశ్వత ఉద్యోగం వచ్చిన తర్వాత నిబంధనల మేరకు ఆర్థిక శాఖ ప్రతీ ఉద్యోగికి ప్రత్యేక ఐడీని క్రియేట్ చేస్తుంది. దాని ఆధారంగానే వేతనాలు విడుదల చేస్తుంది. అయితే, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేసి శాశ్వత ఉద్యోగం పొందిన నర్సులకు కొత్త ఐడీ రూపొందించేందుకు పాత ఐడీ ఆటంకంగా మారింది. ఆధార్‌తో అనుసంధానమై ఉండడం వల్ల పాత ఐడీని రికార్డుల నుంచి తొలగిస్తే కానీ కొత్త ఐడీ తయారీ సాధ్యం కాదు. కాగా, శాశ్వత ఉద్యోగం పొందిన వారంతా సంబంధిత విభాగాధిపతులకు తమ ఉద్యోగ రాజీనామా లేఖల్ని సమర్పించారు.
ఉద్యోగి రాజీనామా సమర్పించిన వెంటనే విభాగాధిపతులు ఉద్యోగి ఐడీని ఆన్‌లైన్ నుంచి తొలగించాలి. కానీ వారు అలా చేయకపోవడం వల్ల సదరు ఉద్యోగి ఇంకా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నట్లు ఆర్థికశాఖ పోర్టల్‌లో చూపుతోంది. దీంతో ఐడీ క్రియేట్ అవ్వడం లేదు. స్టాఫ్ నర్సులకు సంబంధించి ఆయా జిల్లాల డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులే రాజీనామా చేసిన ఉద్యోగుల ఐడీలను తొలగించాలి. కానీ కొన్ని జిల్లాల డీఎంహెచ్‌వోల సిబ్బంది డబ్బులిస్తేనే ఐడీలను తొలగిస్తామని నర్సులను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఒక జిల్లాలో అయితే ఒక్కొక్కరి దగ్గర్నించి పెద్దమొత్తంలో డబ్బు అందితే కానీ వారి ఐడీని తొలగించడం లేదు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని నర్సులు ఆరోపిస్తున్నారు. శాశ్వత ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఉన్నా కొత్త ఐడీ క్రియేట్ అవ్వక మూడు నెలలుగా జీతాలు రావడం లేదని వారంతా వాపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తమ పాత ఐడీలను వెంటనే తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆకాశమే’ హద్దుగా..
సురేఖకు అధిష్ఠానం పిలుపు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News