Share News

ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు!

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:02 AM

వినాయక చవితితో పాటు వరుస సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వడ్డిస్తోంది.

ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు!
RTC

  • స్పెషల్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు

  • ప్రయాణికులతో రద్దీగా మారిన బస్టాండ్లు

  • సెలవులతో స్వగ్రామాలకు నగరవాసులు

  • హైదరాబాద్‌-బెజవాడ హైవే కిటకిట

  • నిలిచిన వాహనాలు.. తప్పని ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ, చౌటుప్పల్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితితో పాటు వరుస సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వడ్డిస్తోంది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు శనివారం ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తూ తమ జేబులకు చిల్లుపెడుతున్నారంటూ ఆర్టీసీ యాజమాన్యం0పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు రావడంతో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సేవలు కొనసాగించారు. పండుగ రద్దీ కోసం నడిపే ప్రత్యేక బస్సులు ఒకవైపు ప్రయాణికులతో వెళ్లినప్పటికీ, తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుందని, ఆ సమయంలో అయ్యే కనీస డీజిల్‌, నిర్వహణ ఖర్చుల భర్తీ కోసం సాధారణ కంటే 50 శాతం వరకు అదనపు చార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


హైవేపై హైరానా !

హైదరాబాద్‌- విజయవాడ హైవేపై శనివారం విపరీతమైన వాహన రద్దీ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి హైవేపై మూడు వరసలుగా వచ్చే వాహనాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోకి చేరే సరికి రెండు వరుసలుగా మారాల్సి వస్తోంది. పట్టణంలోని హైవేపై ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తుండడంతో వాహనాలను సర్వీస్‌ రోడ్ల వెంట పంపిస్తున్నారు. ఈ రోడ్లుపై రెండు వరుసలుగా వాహనాలు వెళ్తుండటంతో తరచూ ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో 2-3 కి.మీ. పొడవునా వాహనాలు నిలిచిపోతున్నాయి. అలాగే, కరీంనగర్‌, విజయవాడ, మేడ్చల్‌, సంగారెడ్డికి వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహనాల సంఖ్య పెరగడంతో శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘సర్‌’ విచారణలో వెనకబాటు
నీళ్లియ్యమని నన్ను అడగొద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 05:02 AM